కాలేజీ ప్రాజెక్ట్‌గా మొదలై.. స్టూడెంట్ ఆస్కార్ విజేతగా.!

by Daayi Srishailam |   (  Updated:2026-01-12 08:28:47  IST  )

ఆస్కార్ అకాడమీ మెయిల్ పంపితే పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయాడు

కాలేజీ ప్రాజెక్ట్‌గా మొదలై.. స్టూడెంట్ ఆస్కార్ విజేతగా.!
X

దిశ, ఫీచర్స్: సినిమాలకు కొత్త కొత్త కథలు వస్తున్నాయి. వాస్తవిక ఘటనల నేపథ్యం ఉన్న.. సహజసిద్ధమైన కథల్ని జనాలు కూడా ఇష్టపడుతున్నారు. అందుకే వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. కేరళలోని తిరువనంతపురానికి చెందిన సిద్ధార్థ్ హరికుమార్ కూడా ఈ కోవకు చెందిన యువకుడే.

అర్ధరాత్రి మెయిల్..

బెర్లిన్‌లో సినిమాటోగ్రఫీ చదివిన సిద్ధార్థ్.. అక్కడి "మెట్‌ఫిల్మ్ స్కూల్ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్‌"గా తీసిన 16 నిమిషాల మలయాళ షార్ట్ ఫిల్మ్ 2025 స్టూడెంట్ ఆస్కార్స్ ఫైనలిస్ట్ అయింది. ఆ సినిమా పేరు వాసు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 3127 ఎంట్రీల్లో కేవలం 28 చిత్రాలు మాత్రమే ఎంపికైతే అందులో విజేత అయ్యింది వాసు ఒక్కటే. సిద్ధార్థ్‌కు ఒక అర్ధరాత్రి మెయిల్ వచ్చింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్.. ఆస్కార్ అకాడమీ ఆ మెయిల్ పంపింది. మొదట సిద్ధు నమ్మలేదు. మళ్లీ మళ్లీ చదివాడు. ఆఖరికి నమ్మేసి పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయాడు.

రిటైర్డ్ కానిస్టేబుల్ కథ..

అసలీ వాసు చిత్ర కథేంటంటే.. కేరళలో ఒంటరిగా జీవిస్తున్న రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ వాసు. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఒకప్పుడు చేసిన తప్పుడు పని.. ఇప్పుడు అతన్ని రోజూ వెంటాడుతోంది. ఏదో మెంటలెక్కినట్లు చేసేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడ కాదు. జనాలందర్నీ దూరం పెట్టేశాడు. నేరం గుర్తొచ్చినప్పుడల్లా పిచ్చోడిలా మారిపోయేవాడు. శిక్ష పడుతుందో.. ఉరితీస్తారో అనే భయభ్రాంతికి గురయ్యేవాడు. ఊరేమో పైకి ప్రశాంతమైనది. లోపల మాత్రం భారీ భావోద్వేగ తుఫానులా ఉంటుంది. ఆ సైలెన్స్‌నే కథలో హైలైట్ చేసి అద్భుతంగా చిత్రీకరించాడు సిద్ధార్థ్.

టాలెంట్ ప్రూవ్..

బెర్లిన్‌లో ఉండగా హోలోకాస్ట్ గురించి చాలా చదివాడు సిద్ధార్థ్. అక్కడ దుఃఖాన్ని స్పెక్టాకిల్‌గా కాకుండా సైలెన్స్‌తో గుర్తు చేసుకుంటారట. ఆ భావనే వాసులోకి వచ్చేలా చేశాడు. మన దేశంలో వాసులాంటి మెంటల్ హెల్త్ సమస్య పాతతరం జనరేషన్‌కు తెలియదు. కామన్‌మ్యానే కాదు.. పోలీసులు.. నర్సులు.. కార్మికులు కూడా అంతే. తమ బాధను లోపలోనే దాచుకొని బతుకుతుండేది. థెరపీ అంటే ఏమిటో అస్సలు తెలియదు. వాళ్లెంతసేపూ బాధను దాచుకోవడంలోనే ఉండిపోతారు. అచ్చం వాసు సినిమాలోని పాత్రలాగ. ఆ సున్నితమైన పాయింటే అందరికీ నచ్చింది. యువత టాలెంట్ ప్రూవ్ అయింది.

హాలీవుడ్ తలుపు తడుతూ..

వాసు సినిమాను మొత్తం సిద్ధార్థ్ సొంత జేబులోంచి తీశాడు. బెర్లిన్‌లో ఉండేందుకు దాచిపెట్టుకున్న డబ్బంతా ఈ సినిమాలో పెట్టేశాడు. మూడే రోజుల్లో 20 మంది చిన్న టీమ్‌తో గెరిల్లా స్టయిల్‌లో షూట్ చేశారు. సిద్ధార్థ్ భార్య నందన అజిత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి లొకేషన్స్.. బడ్జెట్ అన్నీ తనే చూసుకుంది. సిద్ధార్థ్ ఇండిపెండెంట్‌గానే చిత్రాన్ని సబ్మిట్ చేశాడు. మెట్‌ఫిల్మ్ స్కూల్ మొదట "ఛాన్స్ లేదు" అనుకుంది. స్కూల్ చరిత్రలోనే మొదటిసారి స్టూడెంట్ ఆస్కార్ ఫైనలిస్ట్ ఐనందుకు గర్వంగా ఫీలవుతోంది. వాసు.. కాలేజీ ప్రాజెక్ట్‌గా మొదలై హాలీవుడ్ తలుపు తడుతోందంటే మామూలు విషయమా.?

Next Story