చైల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల కోసం.. చట్టాన్ని తీసుకొచ్చిన శ్రేయ నల్లమోతు.!

by Daayi Srishailam |   (  Updated:2025-12-25 06:40:49  IST  )

చైల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల రక్షణకు చారిత్రాత్మక ఉద్యమం చేసింది

చైల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల కోసం.. చట్టాన్ని తీసుకొచ్చిన శ్రేయ నల్లమోతు.!
X

దిశ, ఫీచర్స్: సామాజిక స్పృహకు.. సమస్యల మీద పోరాటానికి వయసుతో సంబంధంలేదని నిరూపించింది పదమూడేళ్ల అమ్మాయి శ్రేయ నల్లమోతు. అమెరికాలో ఉండే ఈ అమ్మాయి.. తన సామాజిక స్పృహతో ఏకంగా చట్టాన్నే మార్చగలిగింది. చైల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల రక్షణకు చారిత్రాత్మక ఉద్యమం చేసింది.

వాళ్ల అకౌంట్‌లోకే..

2020 కరోనా సమయంలో ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. ఇలినాయిస్‌లో ఉంటే శ్రేయ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్.. యూట్యూబ్‌లో చైల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల వీడియోలు చూస్తూ ఉండేది. అప్పుడు తనకొక సమస్య కనిపించింది. చిన్న పిల్లలు సరదాగా చేసే స్కిట్స్ ద్వారా డబ్బులొస్తాయి కదా.? కొందరికైతే స్పాన్సర్‌షిప్స్.. బ్రాండ్ డీల్స్.. యాడ్ రెవెన్యూ ద్వారా లక్షల రూపాయలు వస్తుంటాయి. ఐతే.. వీటి ద్వారా పిల్లలకు నయా పైసా రావడం లేదు అనే విషయాన్ని గ్రహించింది. హాలీవుడ్ చైల్డ్ యాక్టర్లకు 1939 కూగన్ చట్టం ద్వారా ఆదాయంలో సగభాగం ట్రస్ట్‌లో పెట్టాల్సి ఉంటుంది. అది పెద్దయ్యాక పిల్లలకు చెందుతుంది. కానీ ఇక్కడ డిజిటల్ ఇన్‌ఫ్లూయెన్సర్లకు అలాంటిది లేదు. అకౌంట్సన్నీ పేరెంట్సే మేనేజ్ చేస్తారు కాబట్టీ డబ్బు కూడా వాళ్ల అకౌంట్లకే వెళ్తుంది.

కంటెంట్‌పై హక్కు..

ఇన్‌ఫ్లూయెన్సర్లకు జరుగుతున్నది తీవ్ర అన్యాయం అనిపించింది తనకు. అది ఆమెను కలవరపరిచింది. సమస్యను చిన్నదిగా వదిలేయొద్దనుకుంది. ఏదో ఒకటి చేసి వారికి న్యాయం జరిగేటట్లు చేయాలని సెనేటర్ డేవ్ కోహ్లర్‌కు వివరంగా లేఖ రాసింది. చైల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆర్జించే డబ్బు పట్ల వారికే హక్కు లేకుండా పోయిందని.. సాంప్రదాయ ఎంటర్‌టైన్‌మెంట్ చట్టాలతో పోల్చి వివరించింది. ఈ లేఖ సెనేటర్‌ను ఆకట్టుకుంది. తన బృందంతో కలిసి శ్రేయ 'చైల్డ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రొటెక్షన్ యాక్ట్' బిల్ డ్రాఫ్ట్ చేశారు సెనేటర్. ఈ చట్టం ప్రకారం పేరెంట్స్ చైల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల ఆదాయంలో కొంత భాగాన్ని ట్రస్ట్ అకౌంట్‌లో పెట్టాలన్నమాట. అలాగే కంటెంట్‌పై పిల్లలకు హక్కులు ఉంటాయేది ఈ చట్టం సారాంశం.

తొలి రాష్ట్రం ఇలినాయిస్..

బిల్ పాస్ కావడం అంత సులభంగా జరగలేదు. చాలామంది న్యాయ నిపుణులు దీనినొక చిన్న సమస్యగా కొట్టిపారేశారు. అసలు ఫ్యామిలీ విషయాల్లో జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పారు. కానీ శ్రేయ పట్టువీడలేదు. తాను చేసిన రీసెర్చ్.. కొన్ని ఉదాహరణలు.. వంటివాటిని చైల్డ్ లేబర్ చట్టాలతో పోల్చి మొత్తానికి ఒప్పించింది. రెండు పార్టీల నుంచి మద్దతు వచ్చింది. 2023లో అమెరికాలో ఈ చట్టాన్ని పాస్ చేసిన తొలి రాష్ట్రంగా ఇలినాయిస్ నిలిచింది. 2024 జులై నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టం.. చైల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల ఆదాయంలో సగంశాతం ట్రస్ట్‌లో పెట్టాల్సిందిగా తప్పనిసరి చేసింది. దీని నుంచి ప్రేరణ పొంది 2025లో కాలిఫోర్నియా ఇలాంటి చట్టాన్ని పాస్ చేసింది. ఇతర రాష్ట్రాలు చర్చలు మొదలుపెట్టాయి. డ్యూక్ యూనివర్సిటీలో రాబర్ట్‌సన్ స్కాలర్‌గా చదువుతోంది శ్రేయ.

Read More..

యువతలో 83% మంది కంటెంట్ క్రియేటర్లే..! ఆ నివేదికలో వెల్లడి

Next Story