- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇల్లు లేక టెంట్ కింద చదివి.. కాశ్మీర్ లోయకే ఘనత తీసుకొచ్చింది అమ్మాయి.!
17 ఏండ్ల షబ్నం సాదిక్.. ఓ పేదింటి బిడ్డ.

కశ్మీరీల బతుకు..
ఎంత కష్టమో..
ఎంత భయకంపితమో చూస్తున్నాం కదా.?
ఇండ్లుండవు.
ఉపాధి ఉండదు.
పిల్లలకు చదువుండదు.
అలాంటి పరిస్థితిని జయించి..
జయకేతనం ఎగరేస్తుంటారు కొందరు.
అలాంటివారిలో షబ్నం సాదిక్ ఒకరు.
- దిశ, ఫీచర్స్
17 ఏండ్ల షబ్నం సాదిక్.. ఓ పేదింటి బిడ్డ. పుల్వామాలోని కఠ్వాడ్ వాళ్ల ఊరు. తార్పాలిన్‌తో కప్పిన గుడారమే వాళ్ల ఇల్లు. కరెంటు లేకుండా.. ట్యూషన్లకు వెళ్లకుండా.. ఒకవైపు కాశ్మీర్ అట్టుడుకుతుంటే మరోవైపు తన దృఢ సంకల్పతో 12వ తరగతిలో 92శాతం మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది.
టెంటు సాక్షిగా..
షబ్నం గుజ్జార్ సముదాయానికి చెందిన సంచారజాతి కుటుంబంలో పుట్టింది. గొర్లు.. బర్లు కాసుకొని జీవనం సాగిస్తుంటారు. చదువుకోవాలనే ఆశ షబ్నంది. కానీ అది సాధ్యం కాదేమో అనే భయం వెంటాడేది. వీళ్లకే కాదు కఠ్వాడ్‌లోని ఏ ఒక్క కుటుంబానికీ ఇల్లు లేదు. ఉపాధి కరువు. కనీసం ఆ ఊరికి సరైన రోడ్డు కూడా లేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటారు గ్రామస్తులంతా. అలాంటి పరిస్థితిలో ఛాన్స్ లేకున్నా చదివి.. తలరాతను మార్చుకోవాలనుకుంది షబ్నం. తార్పాలిన్ టెంటు కిందే చదివి.. ఐఏఎస్ కావాలనే సంకల్పం ఏర్పడింది. ఐఏఎస్ కావడం కోసమే షబ్నం కష్టపడి చదువుతోంది.
పెద్ద విషయమే
ప్రతీరోజూ షబ్నం ఒక కిలోమీటరు దూరం నడిచి ప్రధాన రహదారికి చేరుకునేది. అక్కడి నుంచి బస్సులో పాఠశాలకు వెళ్లేది. పేరుకే బస్సు.. కానీ ఒకరోజు వస్తే ఐదు రోజులు రాకపోయేది. దీంతో రెగ్యులర్‌గా ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూలుకెళ్లేది. చలికాలంలో భారీ హిమపాతం కఠ్వాడ్ అంతా కమ్మేసేది. అయినా షబ్నం స్కూలుకు వెళ్లడం ఆపలేదు. పుస్తకాలే ప్రపంచంగా.. తనను తాను అర్థం చేసుకొని చదివితే 12వ క్లాసులో 92శాతం మార్కులు సాధించింది. వేరేవాళ్లకు ఇది మామూలు విషయమే కావచ్చు. కానీ కఠ్వాడా లాంటి గ్రామాల్లోని గుజ్జార్ సముదాయానికి ఇది పెద్ద విజయమే అని చెప్పొచ్చు.
ఆడపిల్ల చదువా.?
కనీస సౌకర్యాల్లేకుండా 92% మార్కులు సాధించిన షబ్నం మాకందరికీ గర్వకారణం.. మాకే కాదు.. కాశ్మీర్ లోయ మొత్తానికీ ఆదర్శంగా నిలిచింది అని చెప్తున్నారు టీచర్లు. కాశ్మీర్లో గుజ్జార్ సముదాయం జమ్మూ కాశ్మీర్ జనాభాలో 11.9% ఉన్నప్పటికీ రాజకీయ నిర్లక్ష్యం.. ఒంటరితనం.. మౌలిక సదుపాయాల కొరత వల్ల అవకాశాలకు దూరంగా ఉంది. 1991లో షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా పొందినప్పటికీ త్రాల్.. రజౌరీ వంటి ప్రాంతాల్లో విద్యుత్.. ఆరోగ్య సంరక్షణ.. విద్య వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆడపిల్లల చదువు సవాలుగా మారింది. ఆ సవాలను స్వీకరించిన మొదటి బాలిక షబ్నం.
ప్రశంసలు.. సత్కారాలు
షబ్నం తండ్రి మొహ్మద్ సాదిఖ్ రోజువారీ కూలీ. తొమ్మిదో తరగతిలో చదువు మానేశాడు. చదువులేని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కళ్లారా చూశాడు. అందుకే తన బిడ్డకు చదువు చెప్పించాలనుకునేవాడు. కానీ స్థోమత లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. తండ్రి మనసును అర్థం చేసుకున్న షబ్నం చదువుపై దృష్టి సారించి ఇక్కడివరకు వచ్చింది. కూతురు 92% మార్కులతో పాసయ్యిందని తెలియగానే సాదిఖ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రిజల్ట్ రోజైతే గ్రామస్తులు.. బంధువులు షబ్నం వాళ్లుండే టెంట్ కింద పోగయ్యి సంబరాలు చేసుకున్నారు. పుల్వామా డెవలప్మెంట్ కమిషనర్ బషారత్ ఖయూం ఆమెకు రూ.50000 నగదు బహుమతితో సత్కరించారు.






