అమెరికా నుంచి వచ్చి.. ఫర్నీచర్ షాప్ నడుపుతోంది.!

by Daayi Srishailam |

పారేసిన వస్తువులతో చేసే ఫర్నీచర్ షాప్ పెట్టుకుంది.

అమెరికా నుంచి వచ్చి.. ఫర్నీచర్ షాప్ నడుపుతోంది.!
X

అమెరికా వెళ్లాలి..

ఓ మంచి జాబ్ చేయాలి.

అక్కడే పెళ్లి సంబంధం చూసుకోవాలి.

సెటిలవ్వాలి.

అనేది సగటు ఇండియన్ యువత డ్రీమ్.

కానీ.. అక్కడే సెటిలైనా.. అవేవీ వద్దనుకొని ఇండియా వచ్చిందో యువతి.

అంతేకాదు.. పారేసిన వస్తువులతో చేసే ఫర్నీచర్ షాప్ పెట్టుకుంది.

- దిశ, ఫీచర్స్

"కళ".. కేవలం అందానికి సంబంధించినది మాత్రమే కాదు. పారేసిన.. పక్కకు పెట్టిన.. మర్చిపోయిన వస్తువులకు తిరిగి జీవం పోయడం కూడా కళే. ముంబైకి చెందిన పూనం షా ఈ కళాత్మకతను నిరూపించింది.

రెసిన్ ఆర్ట్‌పై ఆసక్తి

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో సెటిల్ అయ్యింది పూనం షా. "రెసిన్ ఆర్ట్"పై ఆసక్తి పెంచుకుంది. అందరూ అమెరికా వైపు పరుగులు తీస్తుంటే పూనమ్ మాత్రం ఇండియాకు ఎప్పుడు వెళ్లిపోదామా అని ఆలోచించేది. అలా అనీ అక్కడి పరిస్థితి బాగాలేదని కాదు. భర్త ఉద్యోగం.. తాను ఉద్యోగం చేస్తూ బిజీలైఫ్‌‌‌లో ఉన్నారు. సంపాదన కూడా బాగానే ఉంది. కానీ అవన్నీ వదిలేసుకొని ఇండియా తిరిగొచ్చేసింది. చిన్ననాటి జ్ఞాపకాలను చెక్కినట్లుగా కనిపించే రెసిన్ ఫర్నీచర్ తయారీలో నిమగ్నమైంది. కుర్చీ.. మేజాజ. దీపస్తంభం.. మనతో అనుభూతిని.. అనుబంధాన్ని కలిగి ఉన్న రెసిన్ ఫర్నీచర్‌ను అందిస్తోంది.

ఫైనాన్స్ టు ఫర్నీచర్

ముంబైలో పుట్టి పెరిగిన పూనమ్.. మొదట ఫైనాన్స్ రంగంలో కెరీర్ ను ప్రారంభించింది. యూకేలో మాస్టర్స్ పూర్తిచేసి డెలాయిట్ సంస్థలో పనిచేసంది. ఆ తర్వాత పెళ్లయింది. భర్తతో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడి కొత్త ప్రపంచంలోకి వెళ్లింది. అంత చదివి.. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసిన పూనమ్‌కు ఎందుకోగానీ ఇవేవీ నచ్చలేదు. అప్పుడే రెసిన్ ఆర్ట్ మీద ఆసక్తి ఏర్పడింది. చిన్నప్పటి నుంచే కొంత కళాత్మకత ఉండేది. అమెరికాలో ఎక్కడ ఆర్ట్ గ్యాలరీలు.. శిక్షణా వర్క్‌షాప్‌లు ఉంటే అక్కడికి వెళ్లేది. ఆ కళను పూర్తిగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. ముంబైకి వచ్చి రెసిన్ ఫర్నీచర్ షాపు ఓపెన్ చేసింది.

బిడ్డ ప్రశ్నతో..

ఒకరోజు తన 7 ఏళ్ల కుమార్తె అయానా "అమ్మా.. నా పాత బొమ్మలతో ఏమైనా చేయగలవా.?" అని అడిగిందట. అదే ఆమెను ఫర్నీచర్ దిశగా ఆలోచించేలా చేసింది. పాత బొమ్మలతో రెసిన్ స్లాబ్ చేసి ఉంచిన పూనమ్.. దానిని మామూలు మేజాగా మార్చేబదులు అయానా కోసం ఒక చిన్న రాకింగ్ కుర్చీ చేసింది. అదే ఆమె "కిడ్స్ లైన్"కు శ్రీకారం చుట్టింది. పిల్లల పాత బొమ్మలు.. ఫజిల్ ముక్కలు.. క్రేయాన్స్.. బ్లాక్స్ అన్నీ ఆమె చేతుల్లో ఓ కొత్త రూపాన్ని.. జీవాన్ని అందుకోవడం ప్రారంభించాయి. కొద్దిరోజుల్లోనే ఆదరణ పెరిగి పూనమ్ బిజినెస్ పరంగా పట్టు సాధించింది.

ప్రతీ ఆర్డర్ ప్రత్యేకమే

పూనమ్‌‌‌‌కు ప్రతీ రెసిన్ ఫర్నీచర్ ఆర్డర్ ప్రత్యేకమే. కస్టమర్‌తో ముచ్చటించి.. నమూనాను రూపకల్పన చేసి.. పరిమాణం.. ఆక‌ృతివంటివి నిర్ణయిస్తారు. తర్వాత ఆకారానికి తగగ్ మౌల్డ్ తయారుచేసి.. బొమ్మల్ని అందులో అలంకరిస్తారు. వీటిని వీడియో కాల్ ద్వారా కస్టమర్‌తో షేర్ చేసి ఆమోదం తీసుకుంటారు. తర్వాత రెసిన్ పోసి.. గాజు పోలిక ఫినిష్ చేస్తారు. ఒక రెసిన్ వస్తువు తయారీకి దాదాపు నెల రోజులు పడుతుంది. "రెసిన్ గాజులా గట్టి పదార్థం. దానిని సాఫీగా చేయడానికి పాలిషింగ్ అవసరం. ఇది శ్రమతో కూడిన పని. కానీ ఫైనల్ రిజల్ట్ చూస్తే అదంతా మర్చిపోతాం" అని చెప్తోంది పూనమ్.

సక్సెస్ ఉమన్

"కిడ్స్ లైన్" పూనమ్ వ్యాపారానికి మార్గర్శిగా మారింది. రంగు రంగుల బొమ్మలు.. శక్తివంతమైన రూపకల్పన.. ఇవన్నీ కలిసినప్పుడు ఫర్నీచర్‌కి జీవం వస్తుంది. 2023లో ఫుల్‌టైమ్ బిజినెస్‌గా "పూనమ్ షా ఆర్ట్"ను ప్రారంభించిన ఆమె.. ప్రధానంగా ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా తన ప్రాజెక్టులను ప్రచారం చేస్తోంది ముంబైలోని అంధేరీలో తన స్టూడియో ఉంది. ప్రస్తుతం ఆ స్టూడియోలో 7–10 మంది పనిచేస్తున్నారు. మంచి బృందం ఉంది. వాళ్ల సహాయంతో ఆర్డర్లు.. ప్యాకింగ్.. ప్రొడక్షన్‌ను సులభంగా నిర్వహిస్తోంది. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఫర్నీచర్ స్టూడియో పెట్టుకొని సక్సెస్ కావడమంటే నిజంగా గట్స్ ఉండాలి కదా.?

Next Story