ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా అమర్చగలిగే కిడ్నీని సృష్టించిన శాస్త్రవేత్తలు.. ఎలా ఉపయోగ పడుతుందంటే..

by Javid Pasha |   (  Updated:2025-10-24 07:38:13  IST  )

శాస్త్రవేత్తలు ఒక ప్రయోగంలో భాగంగా ఏ బ్లడ్ గ్రూపు వారికైనా అమర్చగలిగే యూనివర్సల్ కిడ్నీని సృష్టించారు.

ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా అమర్చగలిగే కిడ్నీని సృష్టించిన శాస్త్రవేత్తలు.. ఎలా ఉపయోగ పడుతుందంటే..
X

దిశ, ఫీచర్స్ : కిడ్నీ వైఫల్యం వంటివి సంభవించినప్పుడు ఒక అవయవ దాత నుంచి సేకరించిన కిడ్నీ మరో వ్యక్తికి అమర్చడం సాధ్యమే అయినప్పటికీ అంత ఈజీ మాత్రం కాదు.ఇది సక్సెస్ కావాలంటే దాత, అలాగే స్వీకర్త గ్రూపులు (A, B, AB, లేదా O) మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ అలా కాకపోతే స్వీకర్త శరీరం కొత్త కిడ్నీని తిరస్కరించే అవకాశం ఉంటుంది. బ్లడ్ గ్రూప్ మార్కర్స్ (antigens) రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడమే ఇందుకు కారణం. ఇటువంటి సమస్యల వల్ల అవయవ మార్పిడి కోసం కోసం వెయిట్ చేయాల్సిన సమయం చాలా అధికంగా ఉంటుంది. పైగా బాధితులకు సరైన దాత దొరకడం కూడా కష్టమే. కానీ భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు తొలగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు ఏ బ్లడ్ గ్రూపు వారికైనా అమర్చగలిగే ఒక యూనివర్సల్ కిడ్నీని సృష్టించారు.

ప్రయోగంలో భాగంగా..

శాస్త్రవేత్తలు ఒక ప్రయోగంలో భాగంగా సృష్టించిన సరికొత్త యూనివర్సల్ కిడ్నీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది దాత శరీరం నుండి రక్త గ్రూపు గుర్తుల(Blood group markers)ను తొలగించడానికి ప్రత్యేక ఎంజైమ్‌లను ఉపయోగించడం ద్వారా కిడ్నీని ‘‘టైప్ O’’గా మార్చవచ్చు. దీంతో ఈ కిడ్నీని బ్లడ్ గ్రూపుతో సంబంధం లేకుండా ఎవరికైనా సురక్షితంగా అవయవ మార్పిడి చేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొదటి దశ పరిశోధనలో సక్సెస్ సాధించిన పరిశోధకులు ఈ ఆవిష్కరణ ప్రపంచ వైద్య రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా అవయవ మార్పిడి రంగంలో అడ్డంకులను తొలగించి, రోగులకు త్వరితగతిన సహాయం అందించే సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని భావిస్తున్నారు.

ఎలా క్రియేట్ చేశారంటే..

శాస్త్రవేత్తలు సృష్టించిన యూనివర్సల్ కిడ్నీ విషయానికొస్తే, వాళ్లు కొత్తగా కిడ్నీని ల్యాబ్‌లో తయారు చేయలేదు. కాకపోతే దాతల నుండి స్వీకరించిన కిడ్నీలనే అందుకోసం ఉపయోగించారు. అయితే కిడ్నీ వైఫల్యం చెందిన బాధితులకు అమర్చే క్రమంలో చేసిన ప్రయోగంలో వీరు ఈ కిడ్నీపై ప్రత్యేక ఎంజైమ్‌లను వాడి, కిడ్నీలోని రక్త గ్రూపు గుర్తులను (antigens) తొలగించారు. ఈ ప్రక్రియ ద్వారా కిడ్నీని ‘టైప్ O% స్థితికి మార్చారు. దీనివల్ల అది ఎటువంటి బ్లడ్ గ్రూపు ఉన్న వ్యక్తికైనా సరిపోతుందని నిర్ధారించారు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కిడ్నీ, దాని సాంకేతికత అవయవ మార్పిడి రంగంలో పెద్ద మార్పును తీసుకొస్తుందని పరిశోధకులు నమ్ముతున్నారు.

Next Story