పిల్‌క్యామ్ డివైజ్.. క్యాప్సూల్ సైజ్ ఎండోస్కోపిక్ పరికరాన్ని డెవలప్ చేసిన నిపుణులు

by Javid Pasha |

సాధారణ ఎండోస్కోపీతో గుర్తించలేని ప్రేగుల్లో సమస్యలను ‘పిల్ క్యామ్’పరికరం ద్వారా కనుగొనవచ్చు.

పిల్‌క్యామ్ డివైజ్.. క్యాప్సూల్ సైజ్ ఎండోస్కోపిక్ పరికరాన్ని డెవలప్ చేసిన నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : కడుపు, గొంతు లోపలి భాగాల్లో ఏర్పడే పలు అనారోగ్య సమస్యలను స్కానింగ్, ఎక్స్‌రే వంటి పరీక్షల ద్వారా వైద్య నిపుణులు గుర్తిస్తుంటారు. అయితే వీటిద్వారా కూడా సాధ్యం కానప్పుడు ఎండోస్కోపిక్ పద్ధతిలోనూ పరీక్షిస్తారు. ఒక సన్నిని గొట్టం లేదా పైపును లోపలికి పంపడం ద్వారా ఇలా చేస్తారు. ఇది కొద్ది సమయం మాత్రమే చేసే మెడికల్ ఎగ్జామినేషన్. అయితే దీనికి బదులుగా, ఇంతకంటే సమర్థవంతంగా రోగి లోపలి సమస్యను గుర్తించడానికి అవసరమైన ఒక క్యాప్సూల్ సైజ్ చిన్న పరికరాన్ని ఇజ్రాయిల్ ఎలక్ట్రో- ఆప్టికల్ ఇంజినీర్ గవ్రియేల్ ఇడ్డాన్ (Gavriel Iddan) అభివృద్ధి చేశారు. దీనికి ‘పిల్‌క్యామ్’ అని పేరు పెట్టారు. ఈ సాంకేతికత ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలా పనిచేస్తుంది?

శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పిల్‌క్యామ్ అనేది అతి చిన్నగా ఉండే ఎండోస్కోపిక్ కెమెరా అని చెప్పవచ్చు. ఇది చిన్న విటమిన్ ట్యాబ్లెట్ సైజులో ఉంటుంది. ఇక దీని పనితీరు విషయానికి వస్తే రోగులు దీన్ని నోటిద్వారా అచ్చం టాబ్లెట్ మాదిరిగానే మింగాల్సి ఉంటుంది. అలా చేయడవల్ల ఇది శస్త్రచికిత్స అవసరం లేకుండానే జీర్ణవ్యవస్థ లోపలి భాగాలను చూడటంలో వైద్యులకు సహాయపడుతుంది. ఎందుకంటే ఈ క్యాప్సూల్ పరికరం లోపల ఒక చిన్న కెమెరా, ఎల్‌ఈడీ (LED) లైట్లు, బ్యాటరీ, ట్రాన్స్‌మిటర్ ఉంటాయి. ఇది శరీరంలో సహజంగా కదులుతూ ప్రతీ సెకనుకు 2 నుంచి 6 ఫోటోలు తీస్తుంది. వాటిని వైర్‌లెస్‌గా బయట ఉన్న రికార్డర్‌కు పంపుతుంది. తర్వాత వైద్యులు పరిశీలించి సమస్యను విశ్లేసిస్తారు. నిజానికి ఈ పద్ధతి సాధారణ ఎండోస్కోపీతో పోలిస్తే మరింత సులభంగా, ఎక్కవ పరిశీలన ద్వారా చిన్న ప్రేగుల్లో ట్యూమర్లు, వ్యాధులను నిర్ధారించడంలో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పైగా దీనిని మింగడంవల్ల రోగికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సాధారణ జీవితం గడుపుతుండగానే ఎండోస్కోపి ఎగ్జామినేషన్ అయిపోతుంది.

ఉపయోగాలు ఏమిటి?

పిల్‌క్యామ్ డివైజ్ ముఖ్యంగా చిన్న ప్రేగు (small intestine) లోపలి భాగాలను పరీశీలించడానికి లేదా పరీక్షించడానికి చాలా ముఖ్యం. అంతేకాకుండా సాధారణ ఎండోస్కోపీతో సులభంగా చేరని శరీరంలోని వివిధ ప్రాంతాల్లో రక్తస్రావం (obscure GI bleeding), ‘క్రోన్’ వ్యాధి, సెలియాక్ వ్యాధి, ట్యూమర్లు, పాలిప్స్, ఇన్‌ఫ్లమేషన్, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వంటి సమస్యలను నిర్ధారించడంలోనూ సహాయపడుతుంది. కొన్ని రకాలు esophagus లేదా colon ను కూడా చూడగలవు. ఇది శస్త్రచికిత్స లేకుండా, తక్కువ అసౌకర్యంతో కచ్చితమైన రోగనిర్ధారణకు సహాయపడుతుంది.

Next Story