- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్విడ్ ట్రీస్.. చెట్లు లేకున్నా ఆక్సిజన్ అందించే సాంకేతికతను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
చెట్లు లేని ప్రాంతంలో గాలిని శుద్ధిచేసి ఆక్సిజన్ అందించగల ‘లిక్విడ్ ట్రీస్’ని సాంకేతిక శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.

దిశ, ఫీచర్స్ : ఒకవేళ పచ్చని చెట్లులేని ఏడారి ప్రాంతంలో నివసించాల్సి వస్తే.. అసలు ఒక్క వృక్షం కూడా కనిపించని నిర్మానుష్య ప్రాంతంలో ఉండాల్సి వస్తే.. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదూ.. అలాంటి ఏరియాలో గాలి సక్రమంగా లేకపోవడం, ఆక్సిజన్ కొరత కారణంగా బతకడమే కష్టం అనుకుంటాం ఎవరమైనా.. కానీ ‘లిక్విడ్ ట్రీస్’ అమర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చునని, ప్రాణ వాయువులు లేని ప్రాంతంలోనూ జీవనం కొనసాగించే చాన్స్ ఉంటుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఇంతకీ అదెలా సాధ్యం?
ఆక్సిజన్ అందిస్తాయి
చెట్లులేని ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో సెర్బియాలోని యూనివర్సిటీ ఆఫ్ బెల్‌గ్రేడ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు లిక్విడ్ ట్రీస్ (Photobioreactors) డివైజెస్‌ను అభివృద్ధి చేశారు. డాక్టర్ ఇవాన్ స్పాసోజెవిక్ (Dr. Ivan Spasojevic) అనే పరిశోధకుడు దీనికి నాయకత్వం వహించారు. మొదటి యూనిట్ ‘LIQUID3’ పేరుతో 2021లో బెల్‌గ్రేడ్‌లో స్థాపించారు. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP), స్థానిక ప్రభుత్వ సహకారంతో రూపొందించబడింది. అయితే శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన ఈ ఫోటోబయోరియాక్టర్లు (లిక్విడ్ ట్రీస్).. నిజానికి మైక్రో ఆల్గేతో నిండిన ట్యాంకులు. వీటిలోని ఆల్గేలు కార్బన్ డయాక్సైడ్(CO₂)ను గ్రహించి, ఆక్సిజన్(O₂)ను విడుదల చేస్తాయి. కాబట్టి చెట్లు లేని ఎడారుల్లో, ఆక్సిజన్ కొరత ఉన్న పర్వత ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా లైఫ్ క్వాలిటీని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
ఎలా పనిచేస్తాయి?
లిక్విడ్ ట్రీస్ సాంకేతిక వ్యవస్థ అంటే.. నీరు, ఆల్గేలతో నిండిన ట్యాంకులు. ఇవి తక్కువ భూమిని ఆక్రమించి, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో 600 లీటర్ల నీరు, మైక్రో ఆల్గేలతో నిండిన ట్యాంక్ (LIQUID3) ప్రపంచంలోనే మొదటి అర్బన్ ఫోటో బయోరియాక్టర్ అని చెప్పవచ్చు. అయితే ఈ విధమైన లిక్విడ్ ట్రీస్ (Liquid Trees) ఆల్గేల ఫోటోసింథెసిస్ ప్రాసెస్ ద్వారా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి, ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. సంప్రదాయ చెట్లకంటే 10 నుంచి 50 రెట్లు వేగంగా పనిచేస్తాయి. ఒక్క యూనిట్ రెండు పెద్ద చెట్లు లేదా డజన్లకొద్దీ చిన్న చెట్లకు సమానమైన గాలి శుద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఉపయోగంలో ఉన్నాయా?
లిక్విడ్ ట్రీస్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOCs), పార్టిక్యులేట్ మ్యాటర్(PM), వైరస్‌లు వంటి ఇతర కాలుష్య కారకాలను తొలగిస్తాయి. మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే.. ఇవి సోలార్ పవర్‌తో నడుస్తాయి కాబట్టి ఈ లిక్విడ్ చెట్ల పరికరాలను నగరాల్లో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం వీటిని సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌తో పాటు ఇతర కొన్ని ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు. భారతదేశం విషయానికి వస్తే కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ (KUFOS)లో 2024లో మొదటి ప్రోటోటైప్ స్థాపించబడింది. అలాగే యూరప్‌లో కూడా కొన్ని చోట్ల వర్కింగ్‌లో ఉన్నాయి. కాగా వీటిని అందరూ వాడేందుకు మార్కెట్లో కమర్షియల్‌గా అందుబాటులో లేవు. ఎందుకంటే ఇవి ఇంకా పరిశోధనా దశలో ఉన్నాయి. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.






