బియ్యపు గింజంత రోబో.. ఆపరేషన్ లేకుండానే కిడ్నీస్టోన్స్‌ను కరిగించేస్తుంది!

by Javid Pasha |

బియ్యపు గింజంత రోబో.. ఆపరేషన్ లేకుండానే కిడ్నీస్టోన్స్‌ను కరిగించేస్తుంది!
X

దిశ, ఫీచర్స్ : కిడ్నీల్లో రాళ్ల సమస్యకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరిష్కారం శస్త్ర చికిత్స చేయడం. అయితే ఇకముందు అలాంటి అవసరం లేకుండానే స్టోన్స్‌ను తొలగించే అవకాశం రావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. పైగా కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ ( University of Waterloo)కు చెందిన శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన మినీ రోబోను అభివృద్ధి చేశారు. దీనిని స్పాగెట్టీ-లైక్ స్ట్రిప్(spaghetti-like strip) అని కూడా పిలుస్తారు. కేవలం బియ్యపు గింజంత సైజులో ఉండే ఈ రోబో ఆపరేషన్ లేకుండానే కిడ్నీ స్టోన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన మినీ రోబో నేరుగా మూత్రమార్గం గుండా(urinary tract)లోపలికి వెళ్లి, కిడ్నీ స్టోన్స్‌ను కరిగించేస్తుంది. ప్రస్తుతం ఇది టెక్స్‌పెరిమెంటల్ దశలో అంటే ప్రీ-క్లినికల్ దశలో ఉంది. తర్వాత పెద్ద జంతువులపై ట్రయల్స్ జరగనున్నాయి. ఈ టెక్నాలజీ విజయవంతమైతే, షాక్-వేవ్ థెరపీ లేదా ఆపరేషన్‌లు అవసరమైన రోగులకు చాలా సులభమైన, తక్కువ బాధతో కూడిన చికిత్స అందుబాటులోకి వస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

మినీ రోబో పని తీరు విషయానికి వస్తే ఇది మెత్తని, ఫ్లెక్సిబుల్ హైడ్రోజెల్ ఫిలమెంట్ స్ట్రిప్. దాదాపు 1 సెం.మీ పొడవు ఉంటుంది. దీనిలోపల చిన్న మాగ్నెట్స్, యూరియేస్(urease) అనే ఎంజైమ్ ఉంటాయి. డాక్టర్లు బయటి నుంచి రోబోటిక్ ఆర్మ్‌తో మాగ్నెట్ ఉపయోగించి చిన్న ఈ ఫిలమెంట్‌ను మూత్రమార్గంలోకి పంపుతారు. అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ద్వారా రియల్-టైమ్‌లో ట్రాక్ చేస్తూ కిడ్నీ స్టోన్ దగ్గరకు చేరుస్తారు. అక్కడికి చేరగానే యూరియేస్ ఎంజైమ్ రిలీజ్ అయి మూత్రంలోని ఆమ్లత్వాన్ని (pH) పెంచుతుంది. దీంతో రాయి కొద్ది రోజుల్లోనే చిన్న చిన్న ముక్కలుగా కరిగిపోతుంది. అలా కరిగిపోయిన ముక్కలు సహజంగానే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ల్యాబ్ టెస్టుల్లో 3D ప్రింటెడ్ యూరినరీ ట్రాక్ మోడల్స్‌(Urinary tract models)లో ఈ రోబో కేవలం 5 రోజుల్లోనే కిడ్నీ స్టోన్‌ను 30% తగ్గించగలిగింది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ మనుషులపై కూడా అప్లై అయితే, కిడ్నీ స్టోన్స్ బాధితులకు ఆపరేషన్ భయం లేకుండా సులభతరమై చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Next Story