పుట్టుకతో వచ్చే వినికిడి లోపాన్ని నయం చేయవచ్చా? అందుబాటులోకి కొత్త చికిత్స!

by Javid Pasha |   (  Updated:2026-05-13 08:27:18  IST  )

కొత్తగా అభివృద్ధి చేసిన ఒటార్మెని అనే చికిత్సా విధానంలో ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో వినికిడి లోపాన్ని సరిచేస్తారు.

పుట్టుకతో వచ్చే వినికిడి లోపాన్ని నయం చేయవచ్చా? అందుబాటులోకి కొత్త చికిత్స!
X

దిశ, ఫీచర్స్ : సాధారణ చెవి సమస్యలను పరిష్కరించే చికిత్స అందుబాటులో ఉందన్న విషయం తెలిసిందే. కానీ పుట్టుకతో వచ్చే చెవుడును కూడా శాశ్వతంగా నయం చేయవచ్చా? ఒకప్పుడు అలాంటి అవకాశం లేకుండె, కానీ ఈ రోజుల్లో అది సాధ్యమే అంటున్నారు వైద్య నిపుణులు. పైగా ఒటోఫెర్లిన్ జన్యు మ్యుటేషన్ వల్ల వచ్చే చెవుడును ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో సరిచేసే Otarmeni అనే జన్యు చికిత్సను యూఎస్ శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేశారు.

ఏం చేస్తారంటే?

ఒటార్మెని (Otarmeni) అనే కొత్త చికిత్సలో అడినో-అసోసియేటెడ్ వైరస్ (AAV) వెక్టర్‌ల ద్వారా సాధారణ OTOF జన్యువును లోపలి చెవి (కాక్లియా)లోని హెయిర్ సెల్స్‌కు నేరుగా అందజేస్తారు. ఇది ఒటోఫెర్లిన్ అనే ప్రొటీన్ ఉత్పత్తిని పునరుద్ధరించి, ధ్వని సంకేతాలను మెదడుకు పంపే సామర్థ్యాన్ని తిరిగి ఇస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎఫ్‌డీఏ కూడా Otarmeni (లున్సోటోజీన్ పార్వెక్)ను ఆమోదించింది. ఇది ఒక్కసారి మాత్రమే ఇచ్చే ఇంజెక్షన్ చికిత్స.

80% మందిలో మెరుగుదల

క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో కూడా పుట్టినప్పటి నుంచి పూర్తి చెవుడుగా ఉన్న నెలల నుంచి 16 సంవత్సరాల లోపు పిల్లలు ఈ చికిత్స తర్వాత మొదటిసారి ధ్వనులను వినగలిగారని పరిశోధకులు అంటున్నారు. చాలామందిలో చికిత్స తర్వాత వారాలు లేదా నెలల్లో మెరుగుదల కనిపించిందని చెబుతున్నారు. కొందరిలో వినికిడి సాధారణ స్థాయికి చేరుకున్నట్లు కూడా గుర్తించారు. ఈ ప్రభావం 2.5 సంవత్సరాల వరకు కొనసాగుతున్నట్లు అధ్యయనాలు పేర్కొటున్నాయి. ఇది కొక్లియర్ ఇంప్లాంట్లకు బదులుగా శరీరం సహజంగా మరమ్మతు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. చాలా ట్రయల్స్‌లో 80%కి పైగా రోగుల్లో మెరుగుదల కనిపించింది.

రీజెనరేటివ్ మెడిసిన్..

కొత్తగా అభివృద్ధి చేసిన ఒటార్మెని (Otarmeni) చికిత్సా విధానంలో సర్జరీ ద్వారా (చిన్న కోత ద్వారా) చెవిలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఒక్క చెవికి లేదా రెండు చెవులకు కూడా ఇవ్వవచ్చు. అయితే పుట్టుకతో వచ్చే OTOF మ్యుటేషన్ ఉన్నవారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇతర జన్యు మ్యుటేషన్ల వల్ల వచ్చే చెవుడు, దృష్టి సమస్యలను కూడా ఇలాంటి టార్గెటెడ్ జన్యు చికిత్సలతో నయం చేయవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది రీజెనరేటివ్ మెడిసిన్‌లో మరో ముందడుగు అని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ చికిత్స ప్రస్తుతం యూఎస్‌లో అందుబాటులో ఉంది. ఇండియాలో ఇంకా విస్తృతంగా అందుబాటులో లేదు. భవిష్యత్తులో ఇతర దేశాల్లో నూ దీనిని విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Next Story