సూది బాధకు వీడ్కోలు.. లోషన్ రాసుకుంటే షుగర్ కంట్రోల్!..

by Javid Pasha |   (  Updated:2026-04-13 14:30:48  IST  )

చర్మంపై రాసుకుంటే ఇన్సులిన్ అంది డయాబెటిస్‌ను నియంత్రించగలిగే లోషన్‌ను చైనీస్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

సూది బాధకు వీడ్కోలు.. లోషన్ రాసుకుంటే షుగర్ కంట్రోల్!..
X

దిశ, ఫీచర్స్ : డయాబెటిస్ పేషెంట్లు షుగర్‌ను నియంత్రణలో ఉంచుకునేందుకు సాధారణంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడుతుంటారు. అయితే భవిష్యత్తులో ఇలా సూదుల ద్వారా కాకుండా.. కేవలం చర్మంపై రాసుకునే లోషన్‌తో మధుమేహాన్ని నియంత్రించే అవకాశం రావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించిన పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త స్మార్ట్ పాలిమర్ (OP- poly[2-(N-oxide-N,N-dimethylamino)ethyl methacrylate]) ఇన్సులిన్‌ను చర్మం ద్వారా శరీరంలోకి చేర్చగలుగుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. దీంతో డయాబెటిస్ నియంత్రణ మరింత సులభతరం కానుందన్న ఆశభావం వ్యక్తం అవుతున్నది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం.

ఇన్సులిన్ అందించే కొత్త మార్గం..

మధుమేహ నియంత్రణకు ఇప్పుడున్న పద్ధతిలో అయితే ఇన్సులిన్ పెద్ద అణువులు కావడం వల్ల చర్మంలోని ఆయిలీ (లిపిడ్) రక్షణ పొరను సహజంగా దాటలేవు. కానీ చైనీస్ పరిశోధకులు డెవలప్ చేసిన కొత్త పాలిమర్ చర్మానికి సంబంధించిన ఆమ్లత్వం (pH) మార్పును ఉపయోగించి తన ఛార్జ్‌(charge)ను మార్చుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. చర్మం ఉపరితలం ఆమ్లంగా ఉన్నప్పుడు పాజిటివ్ ఛార్జ్‌తో లిపిడ్లతో అతుక్కుని లోపలికి వెళ్తుంది. లోపలి భాగం న్యూట్రల్ pHలోకి చేరగానే ఛార్జ్ మారి ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. 2025 నవంబర్‌లో నేచర్ జర్నల్‌లో పబ్లిషైన ఈ పరిశోధన ఇన్సులిన్ ట్రాన్స్‌డెర్మల్ డెలివరీకి కొత్త మార్గం చూపుతున్నది.

అదే జరిగితే అద్భుతమే..

స్మార్ట్ పాలిమర్ ఇన్సులిన్ క్రీమ్‌ను(OP-conjugated insulin) పరీక్షించినప్పుడు ఎలుకలు, చిన్న చిన్న పందులు, ల్యాబ్‌లో పెరిగిన మానవ చర్మం మీద బాగా పనిచేసిందని, టైప్-1 డయాబెటిస్ ఉన్న ఎలుకలకు 116 U/kg డోస్ రాసినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయి త్వరగానే సాధారణ స్థాయికి తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఇక చిన్న పందులకు 29 U/kg డోస్‌తో 2 గంటల్లో గ్లూకోజ్ సాధారణ స్థాయికి చేరి, 12 గంటల వరకు స్థిరంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇంజెక్షన్ ఇచ్చినంతటి వేగంతో, అంతే స్థిరంగా రక్తంలో చక్కెరను తగ్గించింది. పైగా చర్మంపై ఎలాంటి వాపు, ఇన్‌ఫ్లమేషన్ లేదా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని, ల్యాబ్‌లో పెరిగిన మానవ చర్మం మీద కూడా ఇన్సులిన్ సమర్థవంతంగా చొచ్చుకుపోయిందని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు. అయితే ఈ ఆవిష్కరణ ప్రస్తుతం జంతువులు, ల్యాబ్‌లో పెరిగిన చర్మంపై మాత్రమే సక్సెస్ అయింది. మానవులపై క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందని, ఇది విజయవంతం అయితే ప్రొటీన్-పెప్టైడ్ ఔషధాలను కూడా చర్మం ద్వారా అందించడం సాధ్యం అవుతుందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా డయాబెటిస్ బాధితులకు రోజువారీ ఇంజెక్షన్ల బాధ తప్పుతుందని చెబుతున్నారు.

Next Story