- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్స్ తెరుచుకునే సమయం వచ్చేసింది.. ప్రకృతి బడి ఎక్కడుందో తెలుసా.?
స్కూలంటే ప్రకృతి.. మొక్కలు.. పక్షులు.. వాతావరణం అంటోంది బెంగుళూరుకు చెందిన సైదేవీ సంజీవిరాజా.

ప్రకృతిని పాఠశాలగా మార్చింది.!
నాలుగ్గోడల్లో బంధించి చెప్పేది చదువా.?
ప్రకృతిని మిళితం చేస్తూ చెప్పేది చదువా.?
ఈ ర్యాంకులు.. మార్కుల ఉరుకులాటలో పడి..
పిల్లలకు అసలేం చెప్పాలి.. ఎలా చెప్పాలి.. అనేదే మర్చిపోతున్నాం.
చదువంటే పాఠ్యపుస్తకాలే కాదు..
ప్రకృతి.. మొక్కలు.. పక్షులు.. వాతావరణం అంటోంది బెంగుళూరుకు చెందిన సైదేవీ సంజీవిరాజా.
ప్రకృతినే పాఠశాలలుగా మార్చేసి కొత్త తరాన్ని తయారుచేస్తోంది.
- దిశ, ఫీచర్స్
సైదేవి వాళ్ల సొంతూరు తమిళనాడులోని తూర్పు కనుమలు. అక్కడే "గ్రిజల్డ్ స్క్విరెల్ వైల్డ్‌లైఫ్ సాంక్షువరీ" సమీపంలో నెమళ్లు.. అరుదైన ఉడతల మధ్య ఆమె బాల్యం గడిచింది. వారాంతాల్లో పక్షులను చూడటం.. పాఠశాల చుట్టూ తిరగడం ఆమెకు అలవాటు.
ప్రకృతి బాట
సైదీవి చదివిన పాఠశాల ప్రిన్సిపాల్ వాళ్లమ్మనే. ఆ స్కూల్ 20 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. వేసవి వచ్చిందంటే ఆ 20 ఎకరాలు తిరిగేది సైదీవి. చీమలు గుండ్లు తవ్వడం.. టైలర్ బర్డ్స్ సాలెగూళ్లతో గూడుకట్టడం చూస్తూ గంటల తరబడి గడిపేది. అంతర్జాతీయంగా పేరుపొందిన యూనివర్సిటీలో చదువుకున్నా.. ఫైనాన్స్ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నా సంతృప్తి లేదు ఆమెకు. అందుకే అవన్నీ వదిలేసి బెంగళూరుకు వచ్చింది. మెట్రో కల్చర్‌కు దూరంగా ప్రకృతికి దగ్గరగా బతకాలనుకుంది.
పిల్లలకు పరిచయం
చిన్నతనంలో పక్షులు.. ప్రకృతితో గడిపిన రోజులే ఆమె మనసులో మెదులుతున్నాయి. ఆ జీవితమెంతో స్వేచ్ఛగా ఉండేది. ఇప్పుడేమో కనీసం పార్కులో అయినా సేదతీరుదామని వెళితే ఇక్కడ కూర్చోవద్దు.. అక్కడ పరిగెత్తొద్దు అని సవాలక్ష కండీషన్స్ పెట్టడంతో ఆమెకు ఏదోలా ఉండేది. ప్రకృతిని మిస్సవుతున్నా అనే లోటు ఉండేది. తన పరిస్థితే ఇలా ఉంటే.. అసలు ప్రకృతి అంటేనే తెలియని నేటి జనరేషన్ పరిస్థితేంటి అనిపించింది. పిల్లలకు ప్రకృతిని దగ్గర చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తన చిన్నతనంలో మాదిరి వాళ్లకు ప్రకృతితో గడిపే అవకశాన్ని కల్పించాలనుకుంది.
థికెట్ టేల్స్
పిల్లలకు ప్రకృతిని పరిచయం చేయాలన్న లక్ష్యంతో సైదేవి "థికెట్ టేల్స్" అనే సంస్థను ప్రారంభించింది. ఆ సంస్థ ద్వారా తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లలకు ప్రకృతి పట్ల ఆసక్తిని పెంచుతోంది. నేచర్ వాక్స్.. కథలు.. పర్యావరణ ప్రాజెక్టుల ద్వారా విజ్ఞాన శాస్త్రం.. సామాజిక శాస్త్రాలను ప్రకృతితో జోడిస్తోంది. బెంగళూరులోని 100 పాఠశాలలు.. పార్కులలో ఈ సంస్థ పనిచేస్తోంది. వారానికి 80 నిమిషాల సెషన్‌లో పిల్లలు పర్యావరణంతో సన్నిహితంగా ఉండి ఎంతో నేర్చుకుంటారు. వీడియోలు.. డాక్యుమెంటరీల ద్వారా ఆసక్తిని పెంచుతుననారు.
పుస్తకాలకు మించి..
"థికెట్ టేల్స్"ను బయాలజీ.. విజ్ఞాన శాస్త్ర.. నిపుణులతో కూడిన బృందం పర్యవేక్షిస్తోంది. పార్కులలో అన్వేషిస్తూ పిల్లలు తమ ఆలోచన.. ఇంద్రియ నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటున్నారు. పక్షుల శబ్దాలను గుర్తించడం.. తేనెటీగల పరాగసంపర్కాన్ని అర్థం చేసుకోవడం వంటి వాటితో పుస్తకాలకు మించిన జ్ఞానాన్ని.. ప్రకృతి పట్ల ప్రేమను పొందుతున్నారు. నేచర్ వాక్స్ ద్వారా వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. స్కావెంజర్ హంట్స్.. చెట్ల కింద కథలు వంటివి వారి ఆలోచనలను.. జీవుల పట్ల సానుభూతిని పెంచుతున్నాయి.
ఒక కొత్త తరాన్ని
సైదేవి కార్యక్రమాలు పిల్లలను చురుకైన మార్పు దిశగా తీసుకెళ్తున్నాయి. పరిసరాల్లో సమస్యలను గుర్తించి.. పరిష్కారాలను ఆలోచిస్తున్నారు వాళ్లు. పార్కులో చెత్త సమస్య.. హరిత ప్రదేశాల కొరతపై సానుభూతితో.. ఆలోచనాత్మకంగా పనిచేస్తున్నారు. పుస్తకాలతోనే కాదు ఆకులు.. పుష్పాలతో కూడా చాలా నేరచుకోవచ్చని నిరూపిస్తున్నారు. కేవలం బోధించడం కాదు.. పర్యావరణాన్ని కాపాడే తరాన్ని తయారుచేస్తూ కొత్త విప్లవం సృష్టిస్తోంది సైదేవి. థికెట్ టేల్స్ అనేది కేవలం నేచర్ వాక్ మాత్రమే కాదు.. వాస్తవ విద్య కోసం చేపట్టిన ఒక ఉద్యమం.






