- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాసను ఎగతాళి చేసినవాళ్లే.. యాహూ సౌరభ్ అంటున్నారు.!
ఎగతాళిపై ధిక్కార స్వరం వినిపించి అవధికి పట్టంగట్టేట్లు చేసిండు

దిశ, ఫీచర్స్: మనది భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ రకరకాల భాషలు, సంస్కృతులు ఉంటాయి. ఒకరి భాషను ఇంకొకరు గౌరవించుకోవడం గొప్ప సంప్రదాయం. కానీ యూపీలోని అవధి యాస పట్ల సమాజంలో చిన్నచూపు ఉంది. ఆ ఎగతాళిపై ధిక్కార స్వరం వినిపించి అవధికి పట్టంగట్టేట్లు చేసిండు సౌరభ్ పాండే.
యాస శాపమైంది..
ఒకప్పుడు మన తెలంగాణ యాస, భాషలను ఎలాగైతే ఎక్కిరింతకు గురయ్యిందో అవధి యాస కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. "ఇదేం భాషరా బాబూ" అని ఉద్యోగాలు ఇవ్వకపోయేది. పనుల్లో పెట్టుకోకపోయేది. ఆధిపత్య రంగాల్లోకి రానియ్యకపోయేది. గ్రామీణ నేపథ్యమున్న సౌరభ్ పాండేకు ఇదొక శాపంగా మారింది. తన కలలేమో ఆకాశాన్ని తాకేలా ఉండేవి. వాటన్నింటినీ అవధి యాస పటాపంచలు చేసింది. ఎవరి కోసమే తన యాస, భాషలను మార్చుకోవడం కాదు.. వారసత్వంగా వస్తున్న తన మాండలికంతోనే వెలిగిపోవాలని సంకల్పించాడు.
అడ్డంకులను అధిగమిస్తూ..
సౌరభ్ వాళ్ల నాన్న ముంబైలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఎలాగైనా కొడుకును డాక్టర్ చదివించాలనేది అతడి కోరిక. కానీ మనోడికేమో అదిష్టం లేదు. పోనీ ఇంకేదైనా మంచి ప్రొఫెషనల్ కోర్సు చేస్తాడేమో అని అడిగి చూశారు. సౌరభ్ దృష్టేమో ఫ్యాషన్ డిజైన్ వైపు మళ్లింది. తన భాషపై, మాట్లాడే విధానంపై అడుగడుగునా అడ్డంకులు వస్తున్నా వాటిని అధిగమిస్తూ డిజైనింగ్ కలల్లో మునిగిపోయాడు. కలను సాధించుకునేందుకు మాల్స్‌లో రోజుకు 12 గంటలు పనిచేస్తూ డబ్బు సంపాదించసాగాడు. తన పట్టుదలతో ఎన్నో అవకాశాలు వచ్చినా భాషా పరమైన సమస్యలు వచ్చేవి.
ఉద్యోగం ఊస్టింగ్..
ఉద్యోగం ఏదైనా తనతోపాటు పనిచేసేవాళ్లు సౌరభ్‌ను విచిత్రంగా చూసేవాళ్లు. "అవధి యాస పిల్ల బచ్చా" అని ఆటపట్టించేవాళ్లు. ఎంతసేపూ "నువ్వు ఊరోడవు.. నీ యాసేందిరా అలా ఉంది. నీ మొఖం అద్దంలో చూసుకోపో" వంటి ఎగతాళి మాటలతో వేధించేవాళ్లు. వాటన్నింటినీ భరిస్తూ ఉన్నా.. "మీలాంటి వారికిక్కడ స్థానం లేదు" అని ఉద్యోగంలో నుంచి తొలగించేవాళ్లు. ఇలా కాదిగ.. "పోగొట్టుకున్న చోటనే వెతుక్కుంటా" అని తన యాసనే సానబట్టడం ప్రారంభించాడు. గత అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొని ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.
యాసే ఇన్‌ఫ్లుయెన్సర్‌ను చేసింది..
డిజైనింగ్ పట్ల పట్టు సాధించిన సౌరభ్ అనతికాలంలోనే ప్రొఫెషనల్ డిజైనర్‌గా పేరు సంపాదించి గుచ్చి, ప్రాడా, డియోర్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు డిజైనర్‌గా పని చేశాడు. తర్వాత కంటెంట్ క్రియేషన్‌లోకి అడుగుపెట్టి ఎగతాళికి గురైన అవధి యాసను ఆకాశానికి ఎత్తాలని నిర్ణయించుకున్నాడు. వినూత్నమైన కంటెంట్ క్రియేషన్‌తో ప్రజలను ఆకట్టుకున్నాడు. మన తెలంగాణ మాండలికాల్లా అవధి కూడా మంచి ఆర్గానిక్ స్లాంగ్. డిజిటల్ దునియాలో అదొక సంచలనంగా మారింది. జనాలకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు సౌరభ్‌కు, అతడు పలికే యాసకు వేలాదిమంది ఫాలోవర్లు, అభిమానులు ఉన్నారు.






