రెండు చీరలు.. ఒక టెంట్‌తో.. ఇండియాను చుట్టేసిన మహిళ.!

by Daayi Srishailam |

పైసా ఖర్చు లేకుండా ఇండియా మొత్తం చుట్టేసింది

రెండు చీరలు.. ఒక టెంట్‌తో.. ఇండియాను చుట్టేసిన మహిళ.!
X

దిశ, ఫీచర్స్: మహిళలు కూడా చాలావరకు ఈ మధ్య సోలో ట్రావెల్స్ చేస్తున్నారు. కానీ.. ఖర్చు విషయంలో కొందరు టార్గెట్ రీచ్ కాకుండానే వెనుతిరుగుతుంటారు. ఇంకా కొందరైతే లక్షల రూపాయలు ఖర్చుచేసి ట్రావెల్ చేస్తుంటారు. కానీ.. సరస్వతీ అయ్యర్ అనే మహిళ పైసా ఖర్చు లేకుండా జీరో బడ్జెట్‌తో ఇండియా మొత్తం చుట్టేసింది. రెండు చీరలు.. ఒక క్యాంపింగ్ టెంట్.. ఒక పవర్ బ్యాంక్‌తో మాత్రమే దీనిని సాధించింది.

స్వేచ్ఛా ప్రయాణం..

సరస్వతి అయ్యర్ కార్పొరేట్ ఉద్యోగం చేసేది. రొటీన్‌ లైఫ్ తనకు బోర్ కొట్టింది. జీవితం అంటే ఇంతేనా అనిపించింది. ఎన్నో ప్రశ్నలు ఆమె మనస్సును కలవరపరిచాయి. ఇలా అయితే లాభం లేదని 2023లో తన ఉద్యోగాన్ని వదిలేసింది. డబ్బు పోగేయడం ఒక్కటే కాదు.. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలు సేకరించాలని నిర్ణయించుకుంది. రెండు చీరలు.. ఒక చిన్న క్యాంపింగ్ టెంట్.. పవర్ బ్యాంక్ తీసుకొని సోలో పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఇండియా మొత్తం తిరిగి రోజుకో కొత్త ప్రయాణం చేస్తోంది. ట్రెక్కింగ్.. అడ్వెంచర్‌తో స్వేచ్ఛా ప్రయాణం చేసి చూపెట్టింది.

జీరో బడ్జెట్ ప్లాన్..

చేతిలో పైసా లేకుండా దేశాన్ని చుట్టేయడమంటే మామూలు ముచ్చట కాదు. దీనికోసం ఆమె పక్కా ప్లాన్ చేసింది. కొంతదూరం నడిచేది. రోడ్డుపై వెళ్లేవాళ్లను లిఫ్ట్ అడిగి వెళ్లేది. అపరిచితులైనా వాళ్లపై నమ్మకంతో ట్రావెల్ చేసింది. కొన్నిసార్లు ట్రక్కులను ఆపేది. ఇక తిండీ.. ఠికానా గురించి బెంగే లేదు. తను వెళ్లే గ్రామాల్లో ఏదైనా పనిచేసేది. ఇల్లు క్లీనింగ్.. తోట పనులు వంటివి చేసి దానికి బదులుగా వాళ్ల దగ్గర భోజనం చేసేది. రాత్రిళ్లో ధర్మశాలలు.. ఆశ్రమాల్లో బస చేసింది. టెంపుల్ గ్రౌండ్స్.. పర్వతాల్లో క్యాంపింగ్ చేసేది. ఈ వ్యూహాలు సరస్వతిని డబ్బు లేకుండా దేశం దాటేలా చేశాయి.

ప్రతీది ఆస్వాదిస్తూ..

సరస్వతి ప్రయాణం కేవలం కిలోమీటర్లు దాటుకుంటూ పోవడం కాదు. ఎన్నో హృదయాలను కలిపింది. ఉత్తరకాశ్మీర్‌ గ్రామాల్లో స్థానికులతో కలిసిపోయి వాళ్ల జీవితాల గురించి పంచుకుంది. కేరళలో గ్రీన్ టీ ప్లాంటేషన్లలో పనిచేసి అక్కడి సంస్కృతి గురించి తెలుసుకుంది. ఈ కమ్యునికేషన్ వల్ల అపరిచితులు ఎంతోమంది స్నేహితులుగా మారారు. చిన్న చిన్న గ్రామాల్లో పండుగలు.. ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించింది. వర్షాలు.. చలి.. ఎండ వంటి వాటిని అసౌకర్యంగా భావించకుండా ప్రతీ అడుగునూ బలంగా మార్చుకుంది. ప్రతీ అనుభవాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగింది.

సేఫ్ లడ్కీ ఇన్‌స్టాగ్రామ్‌‌లో..

సోలో ట్రిప్ ఎలా చేయొచ్చు.. పైసా లేకుండా ప్రయాణం ఎలా చేయొచ్చు.. దేశ పర్యటనలో తన అనుభవాలేంటి.. అపరిచితులు సుపరిచితులు ఎలా కాగలిగారు.. భారతదేశంలో ఉన్న భిన్న సంస్కృతులు.. సంప్రదాయాల గురించి పంచుకోవాలనుకుంది. దానికోసం ''సేఫ్ లడ్కీ'' ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. ఫాలోవర్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇన్‌స్టాలో తనకు 50+ వేల ఫాలోవర్లు ఉన్నారు. తనలా సోలోగా.. జీరో బడ్జెట్లో దేశ పర్యటనలు చేయాలనుకునే మహిళలకు సలహాలిస్తోంది. నమ్మకం పెట్టుకోండి.. సురక్షితంగా జర్నీ చేయండని సూచిస్తోంది.

Next Story