కొబ్బరి చెట్లెక్కే కూలీ.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌‌కు.!

by Daayi Srishailam |

54 ఏళ్ల వయసులో అథ్లెట్‌గా మారిపోయాడు. యువతను ఆలోచింపజేస్తున్నాడు

కొబ్బరి చెట్లెక్కే కూలీ.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌‌కు.!
X

దిశ, ఫీచర్స్: ఇప్పుడు కొత్త ట్రెండేంటో తెలుసా.? 50+ వయసులో ఆటల్లో రాణించడం. యువత ఫోన్లలో రీల్స్ చూసే బిజీలో ఉందిగా.. మరి దేశం కోసం ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే. కేరళకు చెందిన సలీమ్ కూడా 54 ఏళ్ల వయసులో అథ్లెట్‌గా మారిపోయాడు. యువతను ఆలోచింపజేస్తున్నాడు.

చెట్లెక్కే కూలీగా..

మలప్పురం జిల్లా తవనూరుకు చెందిన సలీంకు ఆటలంటే చాలా ఇష్టం. ఒకరకంగా ప్రాణం అని చెప్పొచ్చు. చిన్నప్పుడు స్కూల్లో నిర్వహించే ఆటల పోటీల్లో పాల్గొనేవాడు. పరుగు పందెం అంటే క్షణాల్లో వాలిపోయేవాడు. ప్రతీసారి ప్రైజ్ కూడా కొట్టేవాడు. ఇంకా యంగ్ ఏజ్‌లో ఊర్లలో నిర్వహించే టోర్నమెంట్లలో కూడా అదరగొట్టేవాడు సలీం. కానీ పెళ్లయ్యాక బాధ్యతలు.. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. చిన్నపాటి వ్యాపారం ఒకటి పెట్టాడు. కానీ దాంట్లో బాగా నష్టపోయాడు. చివరికి కొబ్బరి చెట్లు ఎక్కే కూలీగా మారిపోయాడు. జీవితంలో పరిగెత్తడం మొదలుపెట్టి ఆటల్లో పరుగెత్తడం మర్చిపోయాడు.

మళ్లీ ట్రాక్ పైకి..

కొబ్బరి చెట్లు ఎక్కడమంటే ఉత్త ముచ్చట కాదు. చాలా కష్టం ఉంటుంది. శరీరం దృఢంగా ఉండాలి. కష్టానికి తగ్గట్టు పౌష్టికమైన తిండి తినాల్సిందే. ఇదిలా ఉంటే.. రెండేళ్ల క్రితం తవనూరుకు చెందిన స్పోర్ట్స్ టీచర్ ఒకతను సలీంను కలిశాడు. "అప్పట్లో ఆటల్లో తోపు ఉంటుంటిరీ.. మల్లా ప్రయత్నించొద్దూ.?" అన్నాడు. అప్పటివరకు ఆటల మీద ధ్యాసే లేని సలీం భాయ్.. ఆలోచించడం మొదలుపెట్టాడు. సలీం జీవితం మళ్లీ ట్రాక్ మీదికొచ్చింది. చెట్లు ఎక్కిన శరీరమే ట్రాక్‌పై పరుగులు పెట్టించింది. యాబై దాటాక మళ్లీ వ్యాయామం మొదలుపెట్టి రోజూ 10 కిలోమీటర్లు పరిగెత్తడం అలవాటు చేసుకున్నాడు.

50+ వయసు విభాగంలో..

2023లో సలీం ఒక్కసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. మాస్టర్స్ విభాగంలో 800 మీటర్ల రేసులో జాతీయ బంగారు పతకం సాధించాడు. అయితే డబ్బుల్లేక ఆ ఏడాది ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఆసియా మీట్‌కు వెళ్లలేకపోయాడు. ఈ నెల ప్రారంభంలో చెన్నయ్‌లో జరిగిన ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 50+ వయసు విభాగంలో 2 నిమిషాల 28.81 సెకన్లతో ఐదో స్థానం సాధించి.. దక్షిణ కొరియా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత పొందాడు. ఆ కేటగిరీలోనే 42 మంది పోటీ పడ్డారు. వీరిలో చాలామంది సైనిక.. పోలీసు నేపథ్యం నుంచి వచ్చినవారున్నారు.

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌‌కు..

సలీం ఇప్పుడు కేరళలో అత్యంత ప్రేరణాత్మకమైన మాస్టర్స్ అథ్లెట్‌గా మారిపోయాడు. జీవితమంతా కొబ్బరి చెట్లెక్కి.. కుటుంబ బాధ్యతల మధ్య కూరుకుపోయిన ఈ సామాన్యుడు.. 2026లో దక్షిణ కొరియాలో జరగనున్న "వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌"కు అర్హత సాధించాడు. దీనికి వెళ్లాలంటే సుమారు రెండు లక్షల రూపాయలు కావాలి. సలీం చెప్పే మాట ఒక్కటే "ప్రొఫెషనల్ శిక్షణ లేకుండా ఇంతదాక వచ్చిన. ఇక మిగిలిన దారి కూడా దాటేస్తా. ఆశ వదలను" అని అంటున్నాడు. సామాన్యుడి శరీరంలో అసామాన్యమైన పట్టుదల ఉంటే వయసు కేవలం సంఖ్య మాత్రమే అనేదానికి సలీం ఒక ఉదాహరణ.

Next Story