సైనా టక్కర్ స్వదేశీ డిజైన్.. అర్ధి లూమ్స్ కార్పెడ్ బ్రాండ్‌తో అందలం!

by Javid Pasha |

సైనా అర్ధిలూమ్స్ కార్పెట్‌లో ప్రతీ కార్పెట్ వెనుక ఒక కథ ఉంటుంది. ఆర్కిటెక్చర్.. ప్రకృతి భావాల నుంచి స్ఫూర్తి పొంది, స్కెచ్ చేసి రంగులు ఎంపిక చేసి.. చేనేత కళాకారులకు అప్పగిస్తారు.

సైనా టక్కర్ స్వదేశీ డిజైన్.. అర్ధి లూమ్స్ కార్పెడ్ బ్రాండ్‌తో అందలం!
X

దిశ, ఫీచర్స్ :టొరంటోలో డిజిటల్ మార్కెటింగ్ చదువుకున్న సైనా టక్కర్ ఇండియా వైపు తిరిగి చూసినప్పుడు సంప్రదాయ కళాకారులు.. చేతి వృత్తులు తనను ఆకర్షించాయి. 2022లో తన సోదరి కనికతో కలిసి ‘అర్ధి లూమ్స్’ కార్పెట్ బ్రాండ్‌ను స్థాపించింది. బనారస్ కళాకారులతో కలిసి పనిచేస్తూ సహజ పదార్థాలు.. ఆధునిక డిజైన్‌లను మేళవించి అందమైన కార్పెట్లు తయారు చేస్తున్నారు.

చేతి వృత్తుల గొప్పతనం..

సైనా చిన్నప్పుడు ముంబైలోని సజీవమైన వాతావరణం.. పోటీ బోర్డింగ్ స్కూల్ వాతావరణం క్రమశిక్షణ.. సృజనాత్మకతను పెంపొందించాయి. సెయింట్ జేవియర్స్ కాలేజీలో మాస్ మీడియా.. జర్నలిజం చదువుతూ కథ చెప్పడం ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకుంది. అయితే టొరంటో లైఫ్ ఆమెను పూర్తిగా మార్చేసింది. కొత్త దేశం.. విభిన్న సంస్కృతులు ఆమెలో అనుసరణ శక్తి.. ఆత్మవిశ్వాసం నింపాయి. ఇండియా నుంచి వెళ్లినప్పుడు ఇక్కడి చేతి వృత్తుల గొప్పతనం తనకు స్పష్టంగా కనిపించింది. దూరం నుంచి చూస్తే మన సంప్రదాయాల లోతేంటో తనకు పూర్తిగా అర్థమైంది.

వారసత్వ డిజైన్లు..

నాలుగు సంవత్సరాల క్రితం సోదరి కనికతో కలిసి సైనా ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. ‘అర్ధి’ అంటే భూమి. భూమికి సమీపంగా సహజత్వంతో.. నిజాయితీతో ఉండాలనే ఆలోచనతో ఈ పేరు పెట్టారు. ప్రారంభంలో కేవలం టెక్స్‌చర్లు.. మెటీరియల్స్ పట్ల ఆసక్తి మాత్రమే ఉండేది. కానీ క్రమంగా అది పెద్ద ఆశయంగా మారింది. ఆధునిక ఇంటి అలంకరణకు తగ్గట్టు సాంప్రదాయిక చేనేత కార్పెట్లు.. వారసత్వ డిజైన్లు అన్నీ తయారు చేస్తున్నారు. సాంప్రదాయం.. ఆధునికత రెండింటినీ ఒకదానికొకటి మేళవించాలనేది తన లక్ష్యం.

మూలాలు సజీవం..

సైనా "అర్ధిలూమ్స్ కార్పెట్"లో ప్రతి కార్పెట్ వెనుక ఒక కథ ఉంటుంది. ఆర్కిటెక్చర్.. ప్రకృతి.. భావాల నుంచి స్ఫూర్తి పొంది స్కెచ్ చేసి రంగులు ఎంపిక చేసి.. చేనేత కళాకారులకు అప్పగిస్తారు. వీళ్లు డిజైన్ ఇస్తారు కానీ కళాకారుల నైపుణ్యం.. తరతరాల అనుభవం దానికి జీవం పోస్తాయి. ఈ రోజుల్లో వేగవంతమైన ఉత్పత్తి ఎక్కువ కావడంతో చేతి కళల విలువను ప్రజలకు అర్థం చేయడం పెద్ద సవాలు. ఇంకా ఈ కళలను కొత్త తరం వారు కొనసాగించాలనేది మరో ఆందోళన. వీటన్నింటినీ అధిగమించి కళను.. కళాకారులను కాపాడుతూ మూలాలను సజీవంగా ఉంచుతోంది.

భావోద్వేగాల జ్ఞాపకం

డిజిటల్ మార్కెటింగ్ కారణంగా సైనా బ్రాండ్‌ను కేవలం వ్యాపారంగా కాకుండా కళాత్మకంగా.. భావోద్వేగ స్థాయిలో అందించగలుగుతోంది. ట్రెండ్లను అనుసరించకుండా నిజాయితీతో ముందుకెళ్తోంది. భవిష్యత్తులో మరిన్ని కొత్త కలెక్షన్ల ద్వారా ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్ష. అర్ధి లూమ్స్ కేవలం కార్పెట్ల బ్రాండ్ కాదు ఇది భారతీయ వారసత్వం.. ఆధునిక జీవనశైలికి వారధిగా పనిచేస్తోంది. వ్యాపారం మాత్రమే కాకుండా సైనా వ్యక్తిగతంగా పెయింటింగ్.. బేకింగ్.. కవిత్వం వంటి కళలలో తనను తాను పరిచయం చేసుకుంటోంది. తన దృష్టిలో డిజైన్ భావోద్వేగ జ్ఞాపకం.

Next Story