అమ్మ శోధన.. కూతురి సాధన.!

by Daayi Srishailam |

నిరుత్సాహమనేదే రాకుండా అనుక్షణం ప్రోత్సహించి కూతురి విజయానికి మార్గదర్శకంగా నిలిచింది

అమ్మ శోధన.. కూతురి సాధన.!
X

దిశ, ఫీచర్స్: పిల్లలు సరిగ్గా చదవడం లేదు.. ఎప్పుడు చూసినా ఫోన్లు ముందేసుకొని కూర్చుంటున్నారు.. అని చాలామంది పేరెంట్స్ వాపోతుంటారు. తమ సహకారమేదీ లేకుండా కేవలం క్లాసులో చెప్పే పాఠాలతో ఏం సాధిస్తారు పిల్లలు.? సహకారమంటే పెన్సిళ్లు.. రబ్బర్లు కొనించడం.. పుష్కలంగా పుస్తకాలు ఇప్పించడం కాదు. క్రమశిక్షణ.. ఒత్తిడి లేని దినచర్య ప్రిపేర్ చేయించడమని నిరూపించారు ఏపీకి చెందిన తల్లీ కూతుళ్లు పద్మజ గుత్తికొండ.. సాయి మనోజ్ఞ.

14 మందిలో ఒక్కరే..

జేఈఈ మెయిన్ 2025లో టాపర్లుగా నిలిచిన 14 మందిలో 100 పర్సెంటైల్ సాధించిన ఒకే ఒక్క అమ్మాయి సాయి మనోజ్ఞ గుత్తికొండ. ఇది కేవలం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. తల్లీకూతుర్ల సమిష్టి విజయం అని చెప్పొచ్చు. తన కూతురు సాయి మనోజ్ఞ అందరికంటే టాప్ ర్యాంక్ సంపాదించాలని వాళ్లమ్మ పద్మజ ఎప్పుడూ తన వెన్నంటే నిలబడింది. కూతురికి ఒత్తిడిలేని దినచర్యను ప్లాన్ చేసింది. క్రమశిక్షణ నేర్పింది. మానసికంగా ఎలా హెల్దీగా ఉండాలనేది చెప్పింది. నిరుత్సాహమనేదే రాకుండా అనుక్షణం ప్రోత్సహించి కూతురి విజయానికి మార్గదర్శకంగా నిలిచింది.

ప్రయత్న లోపం ఉండొద్దని..

జేఈఈ మెయిన్ 2025 సెషన్-1 ఫలితాలు వచ్చినప్పుడు సాయి మనోజ్ఞకు తనకు బర్త్ డే గిఫ్ట్‌గా అనిపించింది. 12 లక్షల మంది పరీక్ష రాస్తే 100 పర్సంటైల్ సాధించిన ఒకే అమ్మాయిగా రికార్డు సృష్టించింది. పరీక్షకు కొన్నినెలల ముందు సాయి మనోజ్ఞ డెస్క్ వద్ద కూర్చుని చుట్టూ బుక్స్ వేసుకొని ఆందోళనతో ఉండేది. మాక్ టెస్టుల్లో మంచిగానే రాణించినా ఒత్తిడి మాత్రం తప్పలేదు. రాత్రిపూట ఫార్ములాలు రివైజ్ చేసుకుంటుంటే ఎన్నో సందేహాలొచ్చేవి. ఆ ఒత్తిడిని గుర్తించిన పద్మజ తనకు సపోర్ట్ ఇచ్చింది. ర్యాంక్ రాకపోయినా పర్లేదు.. కానీ ప్రయత్న లోపం ఉండొద్దని ప్రతిరోజూ ఎంకరేజ్ చేసింది.

కెరీర్ త్యాగం..

న్యూట్రిషనిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్‌గా పనిచేసే పద్మజా పేరెంటింగ్‌ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. సాయి మనోజ్ఞ చదువు కీలక దశలో ఉన్నప్పుడు తన కెరీర్‌ను త్యాగంచేసి ఇంటికే పరిమితం అయింది. సాయి మనోజ్ఞ టెన్త్ చదువుతున్నప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్ వాడేది. క్రమంగా సోషల్ మీడియా ఒక అలవాటుగా మారింది. దీనిని గమనించిన పద్మజ "ఇది సరైన వయసు కాదు. ఈ వయసులో స్టడీస్ మీద ఏకాగ్రత ఉండాలి. జీవితంలో సాధించాలంటే ఈ వయసులో నిలకడగా ఉండాలి" అని సున్నితంగా చెప్పేది. అప్పట్నుంచి సాయి మనోజ్ఞతో పాటు వాళ్లింట్లో ఎవరూ సోషల్ మీడియా వాడటం లేదు.

తల్లి అడుగుజాడల్లో..

టీనేజ్‌లో అమ్మలను శత్రువులా చూస్తారు పిల్లలు. సాయి మనోజ్ఞ కూడా మొదట్లో తల్లి మాటకంటే వాళ్ల నాన్నమాటనే వినేది. ఈ ధోరణిని మార్చాలని అప్పట్నుంచి పద్మజ తిట్టడం మానేసింది. ప్రతీ సందర్భంలో తల్లి తనను అర్థం చేసుకుంటుందనే నమ్మకం కలిగించింది. అప్పుడే మార్పు మొదలై స్టడీస్ మీద కాన్సెంట్రేట్ చేసింది. పొద్దున 4 గంటలకే లేచి మెడిటేషన్ చేసేది. 5 గంటలకు కూతురును మేల్కొలిపేది. సాయి మనోజ్ఞ రోజుకు 12-14 గంటలు చదివేది. చదువు ముఖ్యంగానీ ఒత్తిడి కాదు అని మెడిటేషన్ చేయించేది. న్యూట్రిషనిస్ట్‌గా కూతురికి పౌష్టిక, సమతుల ఆహారం ఇచ్చి విజయ తీరాలకు తీసుకెళ్లింది.

Next Story