- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎడ్యుకేటర్ సఫీనా.. అమ్మాయి చదువు.. అవనికి వెలుగు.!
ఆ సంస్థకు రామన్ మెగసెసే అవార్డ్-2025 దక్కింది

దిశ, ఫీచర్స్: చదువుకోవడం అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు. చదువు అనేది మన జీవితాలను మార్చాలి. కుటుంబ ఆరోగ్యాన్ని మెరుగు పరచాలి. ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలి. సమాజంలో సమానత్వం పెరగాలి. ఇదే చదువంటే. ఎడ్యుకేట్ గర్ల్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఇదే చేస్తుంది. అందుకే ఆ సంస్థకు రామన్ మెగసెసే అవార్డ్-2025 దక్కింది.
బాలికలకు ఆశాదీపం..
ప్రభుత్వం.. ప్రజలు.. వలంటీర్లు.. మెంటార్లతో కలిసి పనిచేస్తూ అత్యంత వెనకబడిన ప్రాంతాల్లోని ప్రతీ బాలిక చదువుకోవాలని ఆకాంక్షిస్తూ.. చదువులో చేర్పించడమే ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ లక్ష్యం. అంటే.. బాలికల జీవితాన్ని మెరుగుపరుస్తూ.. కుటుంబం.. సమాజం శ్రేయస్సును పెంచుతుందన్నమాట. చదువులేక చిన్న వయసులోనే పెండ్లి చేసుకొని.. కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి భవిష్యత్‌ను ఆగం చేసుకుంటున్న ఎంతోమంది బాలికలకు ఈ సంస్థ ఒక ఆశాదీపం. విద్యాహక్కు చట్టం, సమగ్ర శిక్షణ, జాతీయ విద్యా విధానాలతో అనుసంధామై.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది.
ప్రతి అమ్మాయి చదవాలి..
గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యాహక్కును సాధించేందుకు ఈ సంస్థను స్థాపించింది సఫీనా హుసేన్. ఎడ్యుకేట్ గర్ల్స్ రామన్ మెగసెసే అవార్డు-2025 సాధించిందంటే.. దాని వెనక సఫీనా హుసేన్ కృషి అపారమైనది. ఆమె సాధారణ మహిళ నుంచి ప్రపంచస్థాయి సోషల్ యాక్టివిస్ట్‌గా ఎదిగింది. సఫీనా హుసేన్ 1971 జనవరి 21న ఢిల్లీలో జన్మించింది. వాళ్ల నాన్న యూసుఫ్ హుసేన్ ఒక నటుడు. మధ్యతరగతి కుటుంబం. సవాళ్లను అధిగమిస్తేూ ఆమె దినదినాభివృద్ధి చెంది సామాజిక మార్పుకు పూనుకుంది. ప్రతీ అమ్మాయి చదువుకొని ఎదగాలని ఆమె ఆకాంక్షించింది.
తన జీవితమే సవాల్..
సఫీనా బాల్యంలోనే సమాజిక ఆచారాలు, కుటుంబ ఒత్తిళ్లను చిన్నతనంలోనే ఎదుర్కొంది. 12వ తరగతి తర్వాత మూడేండ్లు ఆమె చదువుకు ఆటంకం కలిగింది. ఇది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అవమానంగా ఫీలయ్యింది. ఐతే.. వాళ్ల అత్త ఆమెను ప్రోత్సహించింది. దీంతో చదువు మళ్లీ పట్టాలెక్కింది. కుటుంబంలో విదేశాల్లో అండర్‌గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నిలిచింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎకనామిక్స్, హిస్టరీలో డిగ్రీ సాధించింది. తనలా ప్రతీ గ్రామీణ బాలిక ఛాలెంజింగ్‌గా తీసుకొని చదవాలని బాలికా విద్యపై దృష్టిపెట్టింది.
హెల్త్‌కేర్ వలంటీర్‌గా..
సఫీనా కెరీర్ 1998లో ప్రారంభమైంది. 1998 నుంచి 2004 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలో చైల్డ్ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేసింది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల కమ్యూనిటీలతో పనిచేసే అవకాశం దొరికింది. హెల్త్‌కేర్ వాలంటీర్‌గా తన అనుభవాలు ఆమెలో సామాజిక మార్పు పట్ల మక్కువను పెంచాయి. 2005లో ముంబైకి తిరిగి వచ్చి.. ఎడ్యుకేట్ గర్ల్స్ ఆలోచనను ప్రారంభించింది. భారతదేశంలో మహిళల స్థితిని సూచించే సర్వేలు తనలో లింగ సమానత్వం, విద్యపై దృష్టి సారించేలా చేశాయి.
ఎడ్యుకేట్ గర్ల్ స్థాపన..
2007లో సఫీనా 'ఎడ్యుకేట్ గర్ల్స్' సంస్థను స్థాపించింది. గ్రామీణ, విద్యా వెనుకబాటు ప్రాంతాల్లో బాలికల విద్య కోసం కమ్యూనిటీలను సమీకరించడం దీని లక్ష్యం. మొదట ఇద్దరితో చిన్న గదిలో ప్రారంభమైంది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సూచనలతో రాజస్థాన్‌లోని పాలి, జలోర్ జిల్లాల్లో కార్యకలాపాలు మొదలుపెట్టింది. ప్రథమ్, యూనిసెఫ్ లాంటి సంస్థల సహకారంతో 'టీమ్ బాలికా' అనే వాలంటీర్ నెట్‌వర్క్‌ను సృష్టించింది. వేలాది మంది యువతులు వాలంటీర్లుగా, మెంటార్లుగా చేరి.. స్కూల్‌కు వెళ్లని బాలికలను గుర్తించి.. తిరిగి పాఠశాలలో చేర్పించారు.
2 మిలియన్ బాలికలకు..
ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో 30,000కు పైగా గ్రామాల్లో పని చేస్తోంది. ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా బాలికలను స్కూల్‌లో చేర్పించారు. 15.5 మిలియన్లకు పైగా మందిని ప్రభావితం చేశారు. 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో రేషన్లు, హైజీన్ కిట్లు పంపిణీ చేసి 'క్యాంప్ విద్య' ద్వారా 340,000 మంది పిల్లలకు శిక్షణ ఇచ్చారు. ప్రపంచంలో మొదటి ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ బాండ్ (2015-2018) పొంది.. 160% లెర్నింగ్ గోల్స్, 116% ఎన్‌రోల్‌మెంట్ సాధించారు.
రామన్ మెగసెసే అవార్డ్..
సఫీనా కృషికి 2025లో 'ఎడ్యుకేట్ గర్ల్స్' మొదటి భారతీయ ఎన్‌జీఓగా రామన్ మెగసెసే అవార్డు సాధించింది. దీనిని ఆసియా నోబెల్ ప్రైజ్‌గా భావిస్తారు. ఇటీవల ఆమె కృషికి గుర్తింపుగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకుంది. 2023లో వైజ్ ప్రైజ్, 2015లో స్కోల్ అవార్డ్, 2017లో నీతి ఆయోగ్ ఉమెన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అవార్డ్, 2016లో ఎన్డీటీవీ ఎలోరియల్ పారిస్ ఉమెన్ ఆఫ్ వర్త్ అవార్డ్, 2019లో ఈటీ ప్రైమ్ ఉమెన్ లీడర్‌షిప్ అవార్డ్ పొందింది. 2035 నాటికి మొత్తం 1 కోటి మంది పిల్లలకు విద్యా అవకాశాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.






