పెద్దపెద్ద పిల్లలు పెండ్లికేడుస్తుండ్రు వానదేవో ఓ వానదేవా.!

by Daayi Srishailam |

ఇప్పటి పిల్లలకేం తెలుసు.. ఈ కప్పతల్లి ఆటలు.. పరుపు బండమీద పాశం తాగుడు.?

పెద్దపెద్ద పిల్లలు పెండ్లికేడుస్తుండ్రు వానదేవో ఓ వానదేవా.!
X

వానలు పడి..

పంటలు పడి..

సాగు సక్రమంగా సాగితేనే..

కాలం మంచిగైనట్లు.

వాన కోసం ఆ ఎదురుచూపులు..

పూజలు.. కప్పతల్లి ఆటలు గుర్తుకొస్తే..

ఇంత కథ జరిగిందిలే అనిపిస్తోంది.

ఇప్పటి పిల్లలకేం తెలుసు..

ఈ కప్పతల్లి ఆటలు.. పరుపు బండమీద పాశం తాగుడు.?

అందుకే కప్పతల్లి మెమొరీ నెమరేసుకుంటున్నాం.

- దిశ, ఫీచర్స్

కొన్నిసార్లు వానలు మొండికేసేవి. రైతులు వానకోసం ఎదురుచూసేవాళ్లు. కార్తె పోయేది.. కాలం పోయేది.. ఇంకెప్పుడు వానపడతదిరా దేవుడా అని నెత్తికి చేతులు పెట్టుకొని పరేషానైతుండేవాళ్లు. అలాంటి ఒక పరేషాన్ల నుంచి పుట్టుకొచ్చిందే కప్పతల్లి ఆట.. వానమ్మ పాట.

పానమంతా పాశమ్మీదనే

"కప్పతల్లి ఆట" జానపద సంస్కృతి నుంచి పుట్టింది. పెండ్లిగాని ఆడపిల్లలు ఈ కప్పమ్మ ఆటను ఆడేటొళ్లు. ఒక బట్టలో కప్పను చుట్టి, దానిని చిన్న రోకలిబండకు కట్టేసి, యాపాకులు చుట్టి, పసుపు చల్లి, దానిమీద నీళ్లు పోసుకుంటూ ఊరంతా తిరిగేది. "కప్పమ్మ నీళ్లాడె.. కడవనిండ నీళ్లాయె" అని బాధతో పాటలు పాడుతుండేది. "ఒకసారైన వచ్చిపోవే వానమ్మా" అంటూ పిల్లలంతా తిరిగేది. ఆ ఆట, పాట నేపథ్యం సీరియస్. కానీ పిల్లలకు ఇవన్నీ ఏం తెలుసు.? ఆటంతా అయిపోయినంక పోసే పాశం మీదనే ఉండేది ధ్యాసంతా.

వానదేవో ఓ వానదేవా

నీళ్లకు కటకట ఉండే రోజులైనా కప్పతల్లి ఆటకోసం పిల్లలంతా కష్టపడి బోరింగుల కాడ బిందెలకొద్ది నీళ్లు తీసుకొచ్చేది. "చిన్న చిన్న పిల్లలు బువ్వకేడుస్తుండ్రు వానదేవో ఓ వానదేవా.. పెద్ద పెద్ద పిల్లలు పెండ్లికేడుస్తుండ్రు వానదేవో ఓ వానదేవా" అని బాధతో పాటలు పాడితేనైనా వానదేవుడు జాలిజూపి కరుణిస్తడేమో అనే ఆశ ఉండేది. వాస్తవానికి ఈ ఆట వెనక పెద్దొళ్లు ఉండి నడిపించేది. కానీ పెండ్లిగాని పిల్లలతోనే ఆడించేది. ముఖ్యంగా కప్పమ్మ ఆటలో అమ్మాయిలే కీలకం. పాట పాడేది.. నీళ్లు పోసేది అంతా వాళ్లే.

శివునిగూళ్లె నీళ్లు

పిల్లలంతా కప్పతల్లి ఆట ఆడుతుంటే.. పెద్దొళ్లు "శివునిగూళ్లె" నీళ్లు పోసేది. గుడిలో ఉండే లింగం మునిగిపోయేటట్లు నీళ్లను నింపేది. లింగం మునగాలంటే ఎంతలేద్నా రెండు మూడు ట్యాంకర్ల నీళ్లు పోయాలి. ముందే వానల్లేవు. సాగుకోసం కాదు.. తాగెటందుకే నీళ్లు లేకుండె. అసొంటి టైంల.. కష్టపడి.. రిస్క్ చేసి శివునిగూళ్లె నీళ్లు నింపేది. అదేందోగానీ.. ఒకదిక్కు కప్పతల్లి ఆటలు, ఇంకోదిక్కు శివునిగూళ్లె నీళ్లు పోసుడుతోని కనీసం ఓ పది చినుకులైనా వానొచ్చేది. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా పడనివాన.. మన గోసజూశి వానదేవుడు కరుణించిండు అని సంబరపడెటోళ్లు.

పర్బండ మీద పాశం

వానకోసం, వానదేవుని కరుణ కోసం అన్నం తినక, నీళ్లు తాగక గంటలకొద్ది కప్పతల్లి ఆట ఆడుతుండె. ఊరంతా తిరుగుడైపోయినంక శివార్ల ఆ కప్పను, రోకలిబండను ఇడిశిపెట్టేది. దీంతోని కప్పమ్మ ఆట అయిపోయేది. అప్పటికే పెద్దొళ్లంతా మంచిగా బెల్లమేశి ఊరందరికీ సరిపోయేటట్లు పాశం వండేది. పిల్లలు కప్పమ్మ ఆట ముగించుకొని పరుపుబండ కాడికి పోయేది. కొంచెం వయసులో పెద్దగున్న యువతులు సుర్రసుర్ర కాలుతున్న ఆ బండ మీద పాశం పోశేది. అందరూ బట్టలిప్పేసి ఒక నిరసనగా ఆ కాలుతున్న బండమీద పండుకొని నాలుకతో పాశం నాకి వానదేవునికి సందేశం పంపిచ్చుడుతోని ఆట కంప్లీటయ్యేది.

Next Story