- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియల్ ఫైటర్.. రోహిణి గుర్జార్.!
జీవితమంతా సవాళ్ల సంద్రంతో నిండినా ఒడ్డుకు చేరిన ధీర వనిత

దిశ, ఫీచర్స్: జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా ధైర్యం.. పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు. రాజస్థాన్‌కు చెందిన రోహిణి గుర్జార్ జీవితంలో కూడా సవాళ్లు.. కష్టాల ప్రయాణమే ఎక్కువ. అయినా ఆమె ఎక్కడా తగ్గలేదు. రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్స్‌లో ఇప్పుడామె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆమె రియల్ పైటర్. జీవితమంతా సవాళ్ల సంద్రంతో నిండినా ఒడ్డుకు చేరిన ధీర వనిత.
భర్త అకాల మరణం..
రోహిణి.. 2006లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. గ్రూప్స్ సాధించి రాజస్థాన్ ప్రభుత్వంలో మంచి పరిపాలనాధికారి కావాలనేది తన లక్ష్యం. పుట్టినింట్లోనే కాదు.. పెళ్లయ్యాక మెట్టినింట్లో కూడా తనకు పూర్తి మద్దత లభించింది. భర్త కూడా తనతో కలిసి చదువుకునేవాడు. ఇద్దరూ పుస్తకాలు చదువుతూ జీవితంలో ఏ విధంగా పైకి ఎదగాలి అని ఒక ప్లాన్ వేసుకొని భవిష్యత్ కోసం కలలు కనేవారు. ఐతే దురదృష్టవశాత్తు తన భర్త అకాల మరణం చెందాడు. ఆమె కలలు కల్లలైపోయే పరిస్థితి. ఆశలన్నీ అడియాశలయ్యే సిచువేషన్. భర్తే లేనప్పుడు ఈ కలలెందుకు.? అనే స్థితికి వచ్చాయి తన ఆలోచనలు.
ప్రిలిమ్స్ రోజున..
కుటుంబం రోహిణికి అండగా నిలిచింది. క్రమంగా కోలుకున్న తను.. ఇద్దరి కలల్ని తానొక్కరే నెరవేర్చాలి అని నిశ్చయించుకుంది. దు:ఖం నుంచి బయటకొచ్చి మళ్లీ చదవడం మొదలుపెట్టింది. కష్టాలు వచ్చినప్పుడు మళ్లీ లేచి ఎలా నిలబడాలో రోహిణి నేర్చుకుంది. ప్రిలిమినరీ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో మరో కష్టం వచ్చింది. భర్త మరణం తర్వాత ప్రతీ సందర్భంలో తనకు అండగా నిలుస్తూ వచ్చిన అత్త చనిపోయింది. అదకూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజునే. ఘొళ్లున ఏడుస్తూనే రోహిణి పరీక్ష హాల్‌లోకి వెళ్లింది. భర్తను.. అత్తను గుర్తుచేసుకొని.. తాను చదివినదంతా కరెక్టుగా అప్లయ్ చేసింది.
మెయిన్స్‌కు వారం ముందు..
ఇక మెయిన్స్ ప్రిపరేషన్. తన పదేళ్ల కూతురుతో కలిసి మెయిన్స్‌కు సన్నద్ధమైంది. పరీక్షకు ఇంకో ఎనిమిది రోజుల సమయం ఉంది. అంతలోనే మరో అతిపెద్ద కష్టం. తను అల్లారుముద్దుగా పెంచుకున్న పదేళ్ల కూతురు చనిపోయింది. ఒక తల్లికి ఇంతకంటే పెద్ద బాధ ఏముంటుంది? చాలామంది ఇక్కడే ఆగిపోతారు. పరిస్థితులు అలా ఉంటాయి. కానీ రోహిణి ఆ బాధను గుండెల్లో దాచుకుంది. భర్త.. అత్త.. కూతురు ముగ్గురికీ తన విజయంతో ఆత్మశాంతి చేకూర్చాలనుకుంది. తన పోరాటం వృథా కాకూడదని సంకల్పించి ప్రిపరేషన్‌కు ఆటంకం కలగకుండా ముందుకెళ్లింది.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా..
పరీక్షకు రెండు రోజుల ముందు జైపూర్‌లో ప్రమాదం జరిగి కంటికి తీవ్ర గాయమైంది. డాక్టర్లు కట్లుకట్టి పూర్తి రెస్ట్ తీసుకోమన్నారు. కానీ అలా చేస్తే తన లక్ష్యం ఏమవుతుందో అనే భయంతో.. ఒక్క కంటితోనే పరీక్ష రాసింది. భర్త.. అత్త.. కూతురు జ్ఞాపకాలను గుండెల్లో దాచుకొని హాల్‌లో కూర్చుంది. ఫైనల్‌గా సెలక్టయింది. ఇప్పుడు రోహిణి గుర్జార్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా మంచి హోదాలో పనిచేస్తోంది. జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా.. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకేస్తే సమస్యలు సమసిపోయి లక్ష్యాన్ని సాధించవచ్చని రోహిణి విజయం నిరూపిస్తోంది. ఆమెకు వచ్చిన కష్టాల ముందు ఏ కష్టమూ తీవ్రమైనది కాదు.






