పోలింగ్ కేంద్రంలో రోబో సందడి.. చాక్లెట్స్, పూలతో ఓటర్లకు ఆహ్వానం (వీడియో)

by Bhoopathi Nagaiah |

"రండి.. రండి.. ఓటేసి వెళ్ళండి. వెళ్తూ వెళ్తూ ఈ పువ్వు తీసుకోండి.. ఒక చాక్లెట్‌తో నోరు తీపి చేసుకోండి" అంటూ ఈ రోబో ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తోంది.

పోలింగ్ కేంద్రంలో రోబో సందడి.. చాక్లెట్స్, పూలతో ఓటర్లకు ఆహ్వానం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికలంటే నాయకులకు, అధికారులకు హడావిడి తప్పదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు బిజీబిజీగా గడుపుతారు. ఇక అభ్యర్థులు అయితే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. పోలింగ్ కేంద్రానికి కొత్తదూరంలో ఉండి కూడా వారిని కాకాపడుతుంటారు. అయితే వీటన్నీటికి భిన్నంగా ఓ రోబో ఓటర్లను తెగ ఇంప్రెస్ (Impress) చేస్తోంది. పోలింగ్ కేందానికి వచ్చే ఓటర్లను పలకరిస్తూ స్వాగతం పలుకుతుంది. పూలు, చాక్లెట్స్ అందిస్తూ ఆకట్టుకుంటుంది.

విద్యార్థుల వినూత్న ఆలోచన

కోయంబత్తూరు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే కాలేజీకి చెందిన విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టి ఈ వినూత్న రోబోను తయారు చేశారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా దుస్తులు ధరించిన రోబో.. పోలింగ్ కేంద్రం ఎంట్రెన్స్‌లో నిలబడి ఓటర్లకు స్వాగతం పలుకుతుంది. "రండి.. రండి.. ఓటేసి వెళ్ళండి. వెళ్తూ వెళ్తూ ఈ పువ్వు తీసుకోండి.. ఒక చాక్లెట్‌తో నోరు తీపి చేసుకోండి" అంటూ ఈ రోబో ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తోంది. ఈ రోబో ముచ్చట్లు వినడానికి, దాని చేతుల మీదుగా చాక్లెట్లు తీసుకోవడానికి ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువత, వృద్ధులు ఈ రోబోతో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఈ వినూత్న ప్రయత్నం వల్ల ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల కమిషన్ ప్రశంసలు

సాధారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద కఠిన నిబంధనలు ఉంటాయి. అయితే విద్యార్థుల సృజనాత్మకతను, ఓటర్లలో ఉత్సాహాన్ని నింపాలనే వారి ఉద్దేశాన్ని గమనించిన ఎన్నికల కమిషన్ అధికారులు, ఈ రోబోను పోలింగ్ కేంద్రంలో ఉంచేందుకు ప్రత్యేక అనుమతిని ఇచ్చారు. సాంకేతికతను సామాజిక బాధ్యతతో ముడిపెట్టిన విద్యార్థుల ప్రయత్నాన్ని అధికారులు అభినందించారు. నేటి డిజిటల్ యుగంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరడానికి ఇంతకంటే ‘హైటెక్’ మార్గం ఇంకేముంటుంది చెప్పండి అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Next Story