కాల్చిన కాయలెంతో.. కమ్మని రుచి.!

by Daayi Srishailam |

జంక్‌ఫుడ్ జమానా రానప్పుడు చెట్టు నుంచి తెంపి తినే కాయో.. పండో తినేటొళ్లం

కాల్చిన కాయలెంతో.. కమ్మని రుచి.!
X

దిశ, ఫీచర్స్: ఇప్పుడు సీజనేదైనా.. ఒకేరకం తిండి తింటుండ్రు. ఏముంది ఫస్ట్ క్లాస్ చదివే పిలగాడు కూడా ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్లకు పొయ్యి "మంచూరియా ఇయ్యవా" అని అడుగుతుండ్రు. కానీ 90sలో ఈ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లేవీ లేనప్పుడు.. జంక్‌ఫుడ్ జమానా రానప్పుడు చెట్టు నుంచి తెంపి తినే కాయో.. పండో తినేటొళ్లం. అలాంటివాటిలో ఒకటి కాల్చిన సిత్పల కాయలు. అవేనుల్లా సీతాఫలం కాయలు.

మూడ్రోజులు ఒకదిక్కు..

ఆన్‌లైన్ గేమ్‌ల ఆగమాగం లేదు. సెల్‌ఫోన్ల చింతలేదు. స్కూలో.. కాలేజో అయిపోంగనే అప్పుడు దాదాపు పిల్లలంతా బావుల బాట పట్టేది. జట్లుగా ఏర్పడి సిత్పల కాయలు తెంపుకునేటోళ్లం. ఒక్కోరోజు ఒకరి బాయి కాడికి వంతులు పెట్టుకొని పోతుంటిమి. "అరే.. మా నాయిన చూస్తే తిడ్తడ్రా.. నేను ముందుగాల పొయ్యి ముచ్చట పెడ్తా.. మీరు మెల్లెగా వద్దురు. ఇగ.. అరే ఇంతదూరం వచ్చిండ్రు పిలగాళ్లు అని మా నాయిన ఏమనడు. ఇంకేమన్నంటే ఉల్టా మనకే తెంపిస్తడు" అని పక్కా ప్లాన్‌తో వెళ్లేది. తెంపిన సిత్పల కాయలను అక్కడే బల్సుడు చెట్లల్ల.. గుదుమలల్ల.. పానాదిలల్ల మాగేసేది. మల్లొక మూడు నాలుగు రోజులు అటు మొకాన పోకపోయేది. ఎందుకంటే అవి మగ్గాలంటే మినిమమ్ మూడ్రోజులైతే పడుతది కదా.?

కాల్చిన కాయల టేస్ట్..

మిగిలిన మూడ్రోజులు ఇంకోదిక్కు బాటపట్టేది. మొదట మాగేసిన కాయల్ని చూసి.. ఎన్ని మగ్గినయో ఎంతమందిమి ఉన్నమో చూసుకొని అక్కడిదక్కడే తినేసేవాళ్లం. ఆ రోజుల్లో అదే టిఫిన్.. అదే స్నాక్. ఇక సండే వచ్చిందంటే పొద్దున్నే అడవి బాట పడ్తుంటిమి. సండే స్పెషలేందంటే.. మగ్గిన పండ్లు కాకుండా ఎర్రెర్ర కాయలు తెంపి కాల్చుకొని తినేది. వారం రోజులు సిత్పల పండ్లే తింటం కాబట్టీ ఒకరకంగా బోర్ కొట్టేది. ఆదివారం నాడు కాల్చుకుతినే సిత్పల కాయల రుచి మామూలుగా ఉండకపోయేది. "అర్రే.. మగ్గిన పండ్లకంటే కాల్చిన కాయలే మస్తు టేస్టున్నయిగారా" అని అనుకునేవాళ్లం. పొద్దున పొయ్యిన పోకడ.. కాల్చిన కాయల మురిపెంలో పడి పొద్దూకేయాళ్లకు కూడా ఇండ్లకు పోకపోతుంటిమి.

కంప కట్టెలకు దెవులాట..

సిత్పల కాయలు కాల్చాలంటే అందరితో అయ్యే పని కాదు. అందుకే బర్లను.. ఆవులను కాస్తున్నొళ్ల దగ్గరికి పోతుంటిమి. "అన్నా.. జర సిత్పల కాయలు కాల్చియ్యవా.. అంతగాదంటే ఓ ఇద్దరం మీ బర్లను కాస్తం" అని సముదాయించి ఓ ఇద్దర్ని బర్లకాడ పెట్టేవాళ్లం. కొందరు ఆ చెట్టూ ఈ చెట్టూ ఎదురుకొచ్చి కుప్పేసేది. కొందరు సిత్పల కాయలకు పొయ్యేది. సిత్పల కాయలంటే అప్పుడు కొమ్మ కొమ్మకూ ఉండేవి కాబట్టీ జల్ది తెంపుకొచ్చే వాళ్లం. కానీ.. కట్టెలకు కంపకు పొయినొళ్లకు పెద్ద శెరనే ఉండేది. ఏ చిన్న కంప గుంజుదామన్నా ముండ్లు కుచ్చుకునేవి. సీదా ఉన్న కట్టెలు.. తాటి మట్టలు తీసుకొస్తుంటే ఎవరో ఒకరు చూసి "రేయ్.. ఎవడ్రా" అని కూతేసేవాళ్లు. "అన్నా.. ఈ ఒక్కటేనే సిత్పల కాయలు కాలుస్తున్నం" అని బతిమిలాడుకునేది.

అగ్గిపెట్టుందా.??

కట్టెలు.. కాయలు అన్నీ జమైనంక అగ్గిపెట్టెతో ఉండేది అసలు కథ. బర్లు కాసేటొళ్లు ఒకవేళ బీడీ తాగేటొళ్లయితే వాళ్ల దగ్గర అగ్గిపెట్టె ఉండేది. తాగనొళ్ల దగ్గరికి పోతే ఇక పెద్ద కష్టమే ఉండేది. ఏముందిగ బావుల పొంటి ఎవరైనా కనిపిస్తరేమో అని తిరిగేది. తీరా తెచ్చి కాయల్ని కాల్చి సిత్పల ఆకులతో సెగను సల్లార్చి వేడివేడి కాల్చిన సిత్పల కాయలు తినేది. అండ్లకెల్లి కంప కట్టెలు ఇచ్చినాయ్నకు నాలుగు.. అగ్గిపెట్టె ఇచ్చినాయ్నకు నాలుగు.. కాల్చినాయ్నకు నాలుగు తీయంగా తలా ఓ మూడు నాలుగు మిగిలేవి. మంచిగ ఓ గుండు చూసుకునేది. దానిమీద కూసొని ఆ కాయలను ఆస్వాదించుకుంట తిని ఇంటి బాట పట్టేవాళ్లం. అంత తిప్పలవడి తింటంగానీ.. ఇంటికివొయ్యేసరికి నాయిననో.. తాతనో కాల్చి తెచ్చిన కాయలు రెడీగా ఉండేవి. కానీ.. అప్పటికే ఫుల్లు తిన్నం.. ఇంకేం తింటం.?

టీచర్లకు ఇచ్చేది..

ఎవరింట్ల చూసినా ఒక అర్రల సిత్పల పండ్లు.. కాల్చిన కాయలే ఉండేవి. ఒక్కరోజుల్నే తినేవా అవేమన్నా.? బుద్ధి పుట్టినప్పుడల్లా అర్రలకువొయ్యి ఐదో ఆరో తెచ్చుకొని తినేటొళ్లం. కొందరమైతే క్లాసుకు తీస్కపోయి దోస్తుగాళ్లకు ఇస్తుంటిమి. స్కూల్ డేస్లో అయితే టీచర్లకు మంచి మంచి కాల్చిన కాయలు తీసుకొని ఇస్తుంటిమి. ఎంతైనా సిత్పల పండ్లు.. కాయలు ఇచ్చినంగదా.. అందుకే వాళ్లు ఎగ్జామ్ల మార్కులు మంచిగనే వేస్తుండేది. ఏదైనా కొశ్చెన్‌కు ఆన్సర్ చెప్పకపోయినా కొట్టినట్లు చేసేదిగానీ కొట్టకపోయేది. కొందరైతే వాళ్లకు నచ్చిన అమ్మాయిలకు "సిత్పల కాయలు కావాల్నా" అని వాళ్లు అడగకముందే ఇస్తుండేది. ఒకవేళ వాళ్లు వద్దంటే బతిమిలాడి బతిమిలాడు ఇచ్చేది. ఇగో.. కాల్చిన సిత్పలకాయలతో మధురమైన అనుభవాలు ఇట్లుంటయన్నమాట.

Next Story