Health : దెబ్బతిన్న గుండె కండరాలను రీప్లేస్ చేయొచ్చా? కొత్త ప్రోటీన్‌ను గుర్తించిన నిపుణులు!

by Javid Pasha |

గుండె కండరాలను తిరిగి ఉత్పత్తి చేసే పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు ERBB4 అనే ఒక ప్రత్యేక ప్రోటీన్‌ను గుర్తించారు.

Health : దెబ్బతిన్న గుండె కండరాలను రీప్లేస్ చేయొచ్చా? కొత్త ప్రోటీన్‌ను గుర్తించిన నిపుణులు!
X

దిశ, ఫీచర్స్ : శరీరంపై ఏదైనా గాయమైతే కొంతకాలనికి నయం అవుతుంది. కోల్పోయిన కండర కణాలు పునరుద్ధరించబడతాయి. కానీ గుండె కండరాలు డ్యామేజ్ అయితే మాత్రం ఇది చాలా కష్టం. ఎందుకంటే గుండెకు స్వయంగా కోలుకునే శక్తి చాలా తక్కువని వైద్య శాస్త్రం చెబుతోంది. అందుకే గుండెపోటు వంటి సమయాల్లో గాయాలు అయినప్పుడు, గుండె తన కండరాలను పునరుద్ధరించుకోలేక, ఆ ప్రదేశంలో పనిచేయని మచ్చ కణజాలాన్ని(Scar Tissues)ఏర్పర్చుకుంటుంది. అయితే దీనికి పరిష్కారంగా శాస్త్రవేత్తలు ఒక కొత్త ఆవిష్కరణకు తెరతీశారు. మచ్చలను ఏర్పరిచే ఫైబ్రోబ్లాస్ట్ కణాలను తిరిగి పనిచేసే గుండె కండర కణాలుగా మార్చగల రీప్రోగ్రామింగ్ పద్ధతిని కనుగొన్నారు.

గుండె కండరాలను (Cardiomyocytes) తిరిగి ఉత్పత్తి చేసే పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు ERBB4 అనే ఒక ప్రత్యేక ప్రోటీన్‌ను గుర్తించారు. దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించడంలో ఈ ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. చికిత్సలో దీనిని ఉపయోగించడం వల్ల గుండెపోటు తర్వాత క్షీణించిన గుండె సామర్థ్యాన్ని తిరిగి పాతస్థితికి తీసుకురావడం సాధ్యమవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది కేవలం లక్షణాలను తగ్గించడం మాత్రమే కాకుండా, దెబ్బతిన్న అవయవాన్ని పూర్వ స్థితికి చేర్చే దిశగా వైద్య శాస్త్రంలో ఒక పెద్ద మార్పును సూచిస్తుందని కూడా పరిశోధకులు అంటున్నారు. దీంతో దీర్ఘకాలిక గుండె వైఫల్యంతో బాధపడే రోగుల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా, వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

భవిష్యత్తులో ఈ రీజనరేటివ్ ప్రోటీన్ అందుబాటులోకి వస్తే, అత్యంత ప్రమాదకరమైన గుండె మార్పిడి చికిత్సలు లేదా మెకానికల్ పరికరాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పరిశోధకులు ఈ ప్రోటీన్(ERBB4)ను శరీరంలోని ఇతర ఆరోగ్యకరమైన భాగాలకు హాని కలగకుండా కేవలం దెబ్బతిన్న ప్రాంతానికే ఎలా చేరవేయాలనే దానిపై పరీక్షలు జరుపుతున్నారు. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే గనుక గుండెపోటు వచ్చిన వెంటనే ప్రాథమిక చికిత్సగా దీనిని అందించి, గుండె శాశ్వతంగా దెబ్బతినకుండా కాపాడవచ్చునని రీసెర్చర్స్ అంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story