బాడీ టెంపరేచర్ నుంచి విద్యుత్..! స్టిక్కర్ లాంటి డివైజ్‌ ఆవిష్కరణ!

by Javid Pasha |

సౌత్ కొరియాలోని సీయుల్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు మరో సాంకేతిక అద్భుతాన్ని క్రియేట్ చేశారు. శరీర ఉష్ణోగ్రత నుంచి విద్యుత్ జనరేట్ చేయగల డివైజ్‌ను వీరు అభివృద్ధి చేశారు.

బాడీ టెంపరేచర్ నుంచి విద్యుత్..! స్టిక్కర్ లాంటి డివైజ్‌ ఆవిష్కరణ!
X

దిశ, ఫీచర్స్ : నీటి నుంచి, సూర్యుడి వేడి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్న విషయం తెలిసిందే. కానీ బాడీ టెంపరేచర్ నుంచి కూడా అలా చేయవచ్చునంటే నమ్ముతారా? కానీ ఇది సాధ్యమేనని నిరూపించారు సౌత్ కొరియాలోని సీయుల్ నేషనల్ యూనివర్సిటీ(Seoul National University)కి చెందిన పరిశోధకులు. మానవ శరీర ఉష్ణోగ్రత నుంచి నేరుగా విద్యుత్ జనరేట్ చేయగల అతి సన్నతి, సౌకర్యవంతమైన వేరబుల్ డివైజ్‌ను వీరు అభివృద్ధి చేశారు. దీనిని ‘ప్సూడో-ట్రాన్స్‌వర్స్ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్(pT-TEG)’ అని పిలుస్తున్నారు. కాగా ఈ పరిశోధనకు ప్రొఫెసర్ జెయింగ్‌హన్ క్వాక్ (Jeonghun Kwak) నాయకత్వం వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘Science Advances’ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి

ఎలా పనిచేస్తుంది?

నిజానికి సాంప్రదాయ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్లు బాడీ టెంపరేచర్‌ను ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయాలంటే అవి మందంగా(thick) ఉండాలి. లేదా వంచాలి. కానీ సీయూల్ పరిశోధకులు తయారు చేసిన కొత్త డివైజ్ ఎలాంటి బల్కీ స్ట్రక్చర్ లేదా బ్యాటరీలు అవసరం లేకుండానే ఆ పనిచేయగలదు. ఇది చర్మానికి పూర్తిగా ఫ్లాట్‌గా అతుక్కొని పనిచేస్తుంది. కాబట్టి వేరబుల్ టెక్నాలజీలో ఇదొక గొప్ప మార్పును తీసుకురాగలదు అంటున్నారు నిపుణులు. అయితే ఈ ఆవిష్కరణ డ్యూయల్ థర్మల్ కండక్టివిటీ సబ్‌స్ట్రేట్ డిజైన్‌లో ఉంది. ఫ్లెక్సిబుల్ సిలికాన్ బేస్‌లో కాపర్ నానోపార్టికల్స్‌ను నిర్దిష్ట ప్రాంతాల్లో ఎంబెడ్ చేయడం ద్వారా, ఒకే లేయర్‌లో రెండు రకాల థర్మల్ ప్రాపర్టీలు సృష్టించబడతాయి.

ప్రయోజనాలు ఎన్నో..

‘ప్సూడో-ట్రాన్స్‌వర్స్ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్ (pT-TEG)’ అనే డివైజ్ శరీర ఉష్ణం సాధారణంగా నిలువుగా పారిపోయే సమస్యను పరిష్కరించి, దానిని సైడ్‌వేస్(Laterally)గా మళ్లించి, సబ్‌స్ట్రేట్ సర్ఫేస్‌పై వెచ్చని, అలాగే చల్లని ఏరియాలను సృష్టిస్తుంది. ఇలా ఉత్పన్నమయ్యే టెంపరేచర్ డిఫరెన్స్ ద్వారా థర్మోఎలక్ట్రిక్ సెమీకండక్టర్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఈ పద్ధతి సన్నని ఫిల్మ్ స్ట్రక్చర్‌లోనే పని చేస్తుంది. ఈ సాంకేతికత ప్రయోజనాల విషయానికి వసతే సెల్ఫ్ -పవర్డ్ వేరబుల్స్, హెల్త్ మానిటర్లు, స్మార్ట్ క్లోతింగ్ వంటి ఉత్పత్తులు అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. బ్యాటరీల అవసరం ఉండదు కాబట్టి చార్జింగ్ అవసరం తగ్గి, మరింత సీమ్‌లెస్‌గా, సౌకర్యంగా ఉంటుంది. అయితే ఇది ఇంకా మార్కెట్లో అందుబాటులోకి రాలేదు. ల్యాబ్ స్టేజ్‌లోనే ఉంది. భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే రోజువారీ ఆరోగ్యపర్యవేక్షణలో, స్మార్ట్ గార్మెంట్లలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు.

Next Story