వినికిడి లోపానికి శాశ్వత పరిష్కారం.. ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో..!

by Javid Pasha |

జన్యు‌లోపం కారణంగా పుట్టుకతో వచ్చే వినికిడిలోపాన్ని సవరించగల ఇంజెక్షన్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

వినికిడి లోపానికి శాశ్వత పరిష్కారం.. ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో..!
X

దిశ, ఫీచర్స్ : తాత్కాలికంగానో, నరాల బలహీనతవల్లో, జన్యుపరంగానో తీవ్రమైన వినికిడి సమస్య వస్తే ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. హియరింగ్ ఎయిడ్ లేదా ఇంప్లాంట్ వంటి చికిత్సా పద్ధతులు, వైద్య సౌకర్యాలు ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. కాకపోతే సమస్య తీవ్రతను కొందరు వినికిడి మెషిన్లను చెవులకు అమర్చుకోవాల్సి రావచ్చు. అయితే భవిష్యత్తులో ఇలాంటి అవసరం కూడా లేకుండా పోవచ్చు. ఎందుకంటే.. ఎటువంటి మెషిన్ లేదా పరికరాలు అమర్చుకోవాల్సిన అవసరం లేని ఒక చక్కటి పరిష్కారాన్ని స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో పుట్టుకతో వచ్చే శాశ్వత చెవుడును సరిచేసే జన్యు చికిత్స(gene therapy)ను వారు డెవలప్ చేశారు. ఇంతకీ అదేమిటి? ఏ విధంగా ఉపయోగపడుతుంది?

లోపాన్ని నివారించేందుకు..

ఓటోఫెర్లిన్ (OTOF) అనే జన్యు మ్యుటేషన్ వల్ల కొందరిలో పుట్టుకతోనే వినికిడిలోపం వస్తూ ఉంటుంది. అయితే దీనిని సరిచేయడం ద్వారా వినికిడిని పునరుద్ధరించడంపై కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్ నేతృత్వంలో చైనాలోని ఫుడాన్ యూనివర్సిటీ పరిశోధకుల పలు ఇతర హాస్పిటల్స్‌తో కలిసి పరిశోధనలు, ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 1 నుంచి 24 ఏళ్ల వయసుగల 10 మంది వినికిడిలోపం గల బాధితులపై ప్రయోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన్యువును సరిచేయడం ద్వారా వినికిడిని పునరుద్ధరించేందుకు ఇంజెక్ట్ చేయగల జన్యు చికిత్సను డెవలప్ చేశారు.

చెవుడుకు పర్మినెంట్ సొల్యూషన్..

పరిశోధకులు డెవలప్ చేసిన జన్యు చికిత్సను AAV-OTOF gene therapy (అడినో-అసోసియేటెడ్ వైరస్ వెక్టర్ ద్వారా ఓటోఫెర్లిన్ జన్యువును డెలివరీ చేసే చికిత్స)అని పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనంలో భాగంగా పరిశోధకులు సింథటిక్ AAV వైరస్‌ను ఉపయోగించి, లోపభూయిష్టమైన ఓటోఫెర్లిన్ జన్యువుకు సంబంధించిన సరైన కాపీని చెవి లోపలి భాగం (inner ear / cochlea)లో నేరుగా ఇంజెక్ట్ చేయడం ద్వారా దానిని సరిచేయగలిగారు. ఈ సందర్భంగా జన్యులోపంతో వచ్చిన చెవుడుకు శాశ్వత పరిష్కారం లభించినట్లు గుర్తించారు. అయితే ఇది హియరింగ్ ఎయిడ్ లేదా ఇంప్లాంట్ లాంటిది మాత్రం కాదు.

మూలాలను సరిచేయడం

వినికిడి లోపానికి గల మూల కారణాన్ని(జన్యువును) సరిచేయడం ద్వారా ఆ లోపాన్ని పూర్తిగా నివారించడమే లక్ష్యంగా తమ పరిశోధనలు జరిగాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాగా ప్రయోగదశలోనే ఓటోఫెర్లిన్ ఇంజెక్షన్ విధానం సక్సెస్ కావడంతో భవిష్యత్ చికిత్సలపై ఆశలు రేకెత్తుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఈ ఇంజెక్షన్ వినియోగానికి అందుబాటులో లేదు. ఇంకా ప్రయోగాత్మక దశలోనే (Phase 1/2 clinical trial) ఉంది. ఇది ఎఫ్‌డీఏ (FDA) లేదా ఇంకా ఏ దేశంలోనూ అధికారిక ఆమోదం పొందలేదు. సమీప భవిష్యత్‌లో వినియోగానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు రీసెర్చర్స్.

Next Story