- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అండాశయ క్యాన్సర్.. ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్ అంటున్న నిపుణులు!
తరచుగా పొట్ట ఉబ్బరం, పొత్తి కడుపులో నొప్పి, వాపు, కొంచెం తినగానే కడుపు నిండిన భావన వంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందే!

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్లలో పలు రకాలు ఉంటాయి. అయితే ఏ రకం క్యాన్సరైనా సరే ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే నివారణ, చికిత్స సులభం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ చాలా వరకు అలా జరగడం లేదు. చివరి దశలో గుర్తించినా, చికిత్స అందించినా తగ్గే అవకాశాలు చాలా తక్కువ. దీంతో క్యాన్సర్లు పెరిగిపోతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒవేరియన్ క్యాన్సర్ల (Ovarian cancers)సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఏటా పెరుగుతోంది. వీరికి వస్తున్న 8 అత్యంత సాధారణ క్యాన్సర్ల జాబితాలో ఈ అండాశయ క్యాన్సర్ కూడా ఒకటి.
ఆరోగ్య నివేదికల ప్రకారం ప్రతీ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 3, 24,000 మంది మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో 2 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇక 2020 నాటి గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ(GLOBOCAN) ప్రకారం కూడా ప్రపంచ వ్యాప్తంగా అండాశయ క్యాన్సర్ కేసులు సుమారు 3,13,959, కాగా మరణాల సంఖ్య 2, 07, 252. కాబట్టి ఒవేరియన్ క్యాన్సర్, దాని లక్షణాలు, చికిత్స పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తు్న్నారు.
లక్షణాలు
*సాధారణంగా ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడిన వారిలో నిరంతరం పొట్ట ఉబ్బరం, పొత్తి కడుపులో అప్పుడప్పుడూ నొప్పి, వాపు, కొంచెం తినగానే కడుపు నిండుగా, టైట్‌గా అనిపించడం వంటివి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మిగతా సమస్యలవల్ల కూడా అప్పుడప్పుడూ ఇలా జరుగుతుంది. కాబట్టి అండాశయ క్యాన్సర్ లక్షణాలను స్వయంగా గుర్తించడంలో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. తరచుగా లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం వైద్య నిపుణులను సంప్రదించి నిర్ధారించుకోవాలి.
*ఆకలి తగ్గడం, త్వరగా కడుపు నిండిన భావన, నిరంతరం తేలికపాటు కడుపు నొప్పి, మెన్ స్ట్రువల్ సమయం కానప్పటికీ యోనిలో రక్తస్రావం, అలాగే మెనోపాజ్ దశలో కూడా అసాధారణ రక్తస్రావం వంటివి అండాశయ క్యాన్సర్ లక్షణాలుగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
*ప్రేగుల్లో ఉబ్బరం, మలబద్ధకం, అతిసారం, లేదా తరచుగా ఎక్కువసార్లు మలవిసర్జన లేదా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, తీవ్రమైన నీరసం, శక్తి లేకపోవడం, కారణం లేకుండానే వెన్ను లేదా నడుము నొప్పి రావడం, అకస్మాత్తుగా అంటే కొద్ది రోజుల్లోనే బరువు పెరగడం లేదా తగ్గడం ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాల్లో భాగమే.
*మూత్రం రంగులో మార్పు కనిపించినా అనుమానించాల్సిందే. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, డయాబెటిస్ లక్షణాలుగా చాలామంది భావిస్తుంటారు. కానీ అండాశయ క్యాన్సర్ లక్షణం కూడా ఇదే. మూత్రాశయ గోడల వెలుపల క్యాన్సర్ సెల్స్ పెరిగినప్పుడు, బ్లాడర్‌పైన ఒత్తిడి పెరుగుతుంది.
ఎందుకు వస్తుంది? పరిష్కారం ఏమిటి?
*అండాశయ క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒవేరియన్, చెస్ట్, కొలెరెక్టల్ వంటి క్యాన్సర్ హిస్టరీ కలిగిన ఫ్యామిలీలోని వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే అండాశయ క్యాన్సర్ రిస్క్ అనేది వయసుతో పాటు పెరగవచ్చు. పెరి మెనోపాజ్ లేదా పోస్ట్ మెనోపాజ్ తర్వాత దశలో పలువురు దీనిబారిన పడుతుంటారు.
*సంతానలేమి వల్ల అంటే గర్భం ధరించని మహిలల్లో కూడా ఈ ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువంటున్నారు నిపుణులు. ఎందుకంటే నిరంతర అండోత్సర్గం కారణంగా, ఫలదీకరణం చెందిన అండాలు గర్భాశయంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయి. అట్లనే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, ఊబకాయం కూడా అండాశయ క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయి. కాబట్టి అలర్ట్ గా ఉండాలంటున్నారు నిపుణులు. లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించాలి. పలు స్క్రీనింగ్ టెస్టులు ముఖ్యంగా CA-125 రక్త పరీక్ష, ట్రాన్స్‌వాజినల్ అల్ట్రాసౌండ్, లేదా సిటి(CT) స్కాన్ వంటి టెస్టులు రోగ నిర్ధారణలో సహాయపడతాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా, వివిధ హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






