3500 ఏళ్లనాటి ఫ్రిజ్!

by Sujitha Rachapalli |

చిన్నప్పుడు అమ్మమ్మ, నాన్నమ్మ మనిండ్లలో పెద్ద పెద్ద కుండల్లో నూనె, బియ్యం, పప్పులు దాచి ఉంచేది గుర్తుందా? వేడి వాతావరణంలో కూడా నెలల తరబడి తాజాగా ఉండేవి.

3500 ఏళ్లనాటి ఫ్రిజ్!
X

దిశ, ఫీచర్స్: చిన్నప్పుడు అమ్మమ్మ, నాన్నమ్మ మనిండ్లలో పెద్ద పెద్ద కుండల్లో నూనె, బియ్యం, పప్పులు దాచి ఉంచేది గుర్తుందా? వేడి వాతావరణంలో కూడా నెలల తరబడి తాజాగా ఉండేవి. అవన్నీ ఇప్పుడాలోచిస్తే మన పూర్వీకులు ప్రకృతిని అర్థం చేసుకుని ఎంతో తెలివిగా జీవించేవాళ్లు కదా అని అనిపిస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఒకటి బయటపడింది.

వ్యవసాయ గుహలు..

కోయంబత్తూరు సమీపంలోని మొలపాలయంలో పశ్చిమ ఘాట్ల పాదాల వద్ద నియోలిథిక్ యుగపు భూగర్భ గుహలు బయల్పడ్డాయి. సుమారు 3500 సంవత్సరాల క్రితం వ్యవసాయ, పశుపోషణ కోసం ఈ గుహలను నిర్మించి ఉంటారట. ఇవి కేవలం నిల్వ స్థావరాలుగానే కాదు వంట చేసుకునే రాళ్లు, కొన్ని ప్రకృతి విపత్తుల సమయంలో ఆశ్రయం పొందేలా ఉండేవట. ముఖ్యంగా ధాన్యాన్ని దాచిపెట్టడానికి వీటిని ఉపయోగించేవారు. ఎండలు 40 డిగ్రీలు దాటే పరిస్థితిలో అప్పుడు ధాన్యం ఎలా తాజాగా ఉంచేవారంటే.. భూమి లోతులో ఉష్ణోగ్రత ఉపరితలం కంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఈ గుహల్లో నిల్వ చేసేవారట.

భూగర్భ ఫ్రిజ్‌లు..

మన కంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్రిజ్‌లు, కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. పాలు, నీళ్ల నుంచి మొదలుపెడితే ప్రతీది వాటిలో పెడతాం. కానీ 3500 ఏళ్ల క్రితం ఈ కథంతా లేదు కదా.. అందుకే ఈ గుహల గోడలకు ట్యాంక్ స్లడ్జ్, వరి బ్రాన్, పొట్టు మిశ్రమంతో అప్లయ్ చేసి పశువుల పేడతో పూసి.. సున్నంతో కడిగేవారు. ఇవన్నీ సహజంగా తేమను గ్రహించి కీటకాలు, ఎలుకల నుంచి ధాన్యాన్ని రక్షించేవి. పైన రాళ్లు, చాపలు, బెరడు కప్పి గాలి తిరిగేందుకు కొంచెం అవకాశం ఇచ్చేవారు. ఇది యాదృచ్ఛికం కాదు.. ప్రకృతి శాస్త్రాన్ని అర్థం చేసుకుని చేసిన తెలివైన పనిగా చెప్పొచ్చు.

పూర్వీకుల సంప్రదాయం..

భూగర్భ గుహలు భారతీయ సంప్రదాయంలో భాగంగా ఉండేవి. 20వ శతాబ్దం వరకు కూడా ‘కులుమై’, ‘కుధిర్’, ‘కొడంబే’ అనే పేర్లతో మట్టి నిల్వ గోడలను గ్రామాల్లో ఉపయోగించేవారు. మన చిన్నప్పుడు ఊర్లలో పెద్ద మట్టి కుండల్లో బియ్యం దాచేవాళ్లు కదా. సంవత్సరం మొత్తం తినేటట్టు ఉండేది. కానీ ఆధునికత వచ్చేసరికి ఆ సంప్రదాయాలు మరుగున పడ్డాయి. ప్రతి సంవత్సరం టన్నుల కొద్దీ ధాన్యం సరైన నిల్వ లేక పాడవుతోంది. రిఫ్రిజిరేటర్లు, కోల్డ్ స్టోరేజ్‌లేమో ఖరీదైనవి. మన పూర్వీకులు ల్యాబ్‌లు లేకుండానే ప్రకృతిని గమనించి ఓపికగా, గౌరవంగా జీవించారు.

Next Story