- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంతో రుచిరా.. ఎర్ర చీమల చట్నీ!
చిన్నప్పుడు అన్నానికి చీమలు పడితే ఎంత బాధనిపించేదో గుర్తుందా? చీమలు పట్టిన అన్నాన్ని ఎండలో పెట్టి.. ఉట్టిమీద పెట్టి నానా కష్టాలు పడేవాళ్లం.

దిశ, ఫీచర్స్: చిన్నప్పుడు అన్నానికి చీమలు పడితే ఎంత బాధనిపించేదో గుర్తుందా? చీమలు పట్టిన అన్నాన్ని ఎండలో పెట్టి.. ఉట్టిమీద పెట్టి నానా కష్టాలు పడేవాళ్లం. పొద్దుమూకంగ అమ్మకు చెప్తే ‘ఎర్ర చీమలు పడితే మంచిది బిడ్డా. కంటిచూపు మంచిగుంటది’ అని చెప్పి కూల్ చేసేది. అప్పుడు అమ్మ అలా చెప్తుంటే ‘ఏదో చెప్పి మనల్ని కూల్ చేసిందిలే’ అనిపించేది కానీ ఇప్పుడు అదంతా నిజమే అనిపిస్తోంది.
పాత రుచులే..
ఇంట్లో ఎన్ని రకాల వంటకాలు ఉండనీ.. నోరూరించే ఎన్ని రకాల కూరలు ఉండనీ.. అంచుకు ఇంత తొక్కు ఉంటే ఆహా అదో స్వర్గంలా అనిపిస్తుంది. ఇక రోటీ పచ్చళ్లయితే చెప్పనక్కర్లేదు. ఇప్పుడంటే తీరొక్క కూరలు తింటున్నాం కానీ.. ఎనకటి రోజుల్లో ఇవన్నెక్కడివి. ఏం తిన్నా.. ఆఖరికి పండగనాడు కూడా రోటీ పచ్చళ్లనే ఆస్వాదించి ఆహా ఏమి రుచిరా అనేవాళ్లు. కాలం మారింది. మన ఆహారపు అలవాట్లు మారాయి. రకరకాల రుచులు పుట్టుకొచ్చాయి. ఎన్ని రుచులు మారినా మన జిహ్వ చాపల్యం అప్పుడప్పుడు పాత రుచులనే కోరుకుంటుంది.
సిమిలిపాల్ కై చట్నీ..
ఒడిశా మయూర్‌భంజ్ జిల్లా అడవుల్లో జీవించే తెగలు అలాంటి టేస్టీ ఐటమ్‌ను ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. అదే చీమల చట్నీ. చీమలతో తొక్కు ఏంటి అని ఆశ్చర్యం కలగడం వెరీ కామన్. కానీ వాళ్లకిది చాలా సాధారణ విషయం. ఎర్ర చీమలతో చేసే ‘సిమిలిపాల్ కై చట్నీ’కి జీఐ ట్యాగ్ కూడా లభించింది. దీంతో ఈ సంప్రదాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చిన్నప్పుడు అడవి ప్రాంతాల్లో తిరిగినప్పుడు ప్రకృతి మనకు ఇచ్చే అన్ని వనరులను ఉపయోగించుకుని జీవించాలనే ఆ సాదా జీవన విధానం ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తోంది.
ఆరోగ్యానికీ మంచిది..
ఒడిశా సిమిలిపాల్ అడవుల్లో ఎత్తయిన చెట్లపై ఎర్ర చీమలు ఆకులను కుట్టి పెద్ద పెద్ద గూళ్లు నిర్మిస్తాయి. ఈ గూళ్లు గాలికి కూడా తట్టుకుంటాయి. ఆదివాసీలు చెట్ల ఎక్కి ఈ చీమలను, వాటి పిల్లలను సేకరిస్తారు. వీటిని శుభ్రం చేసి ఉప్పు, వెల్లుల్లి, అల్లం, పచ్చి మిరపకాయలతో కలిపి నూరి చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ రుచి పుల్లగా, కారంగా ఉంటుంది. ఇది వారి రోజువారీ ఆహారంలో భాగం. ఆరోగ్యానికి కూడా మంచిది. జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధులు వచ్చినవాళ్లు ఈ చట్నీ లేదా సూప్ తాగితే ఆకలి పెరుగుతుందని, శరీరం బలిష్టం అవుతుందని అంటుంటారు.
గత స్మృతులు..
ఎర్ర చీమల్లో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజంగా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో కూడా ఈ చీమలను ఉపయోగిస్తారు. ఫార్మిక్ ఆమ్లం కారణంగా ఇవి యాంటీబాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. అడవులతో ముడిపడి ఉన్న ఈ ఆహార వ్యవస్థ పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. 2024లో జీఐ ట్యాగ్ లభించడంతో ఈ చట్నీ అప్పట్నుంచీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై గత స్మృతులను యాది చేస్తోంది.






