- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు సొంతిల్లు కొనడమంటే రిటైర్మెంట్ తర్వాతే. ఆ ఆలోచన కూడా అప్పుడే చేసేవారు. ఇప్పుడు ఆ అంశంలో మార్పు వచ్చింది. 45 నుంచి 50 ఏండ్ల లోపు వారే ఇండ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు రికార్డులు చెప్తున్నాయి. ఈ వయసు వారే సొంతింటిని సమకూర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత ఉండే వ్యవహారాల తీరును మార్చుకుంటున్నారు. ఉద్యోగంలో ఉండగానే, పని చేయగల సామర్ధ్యం ఉన్నప్పుడే బ్యాంకు రుణం తీసుకొనైనా సరే కొనడం మంచిదన్న భావనకు వచ్చారు. 2025లో ఇండ్ల కొనుగోలు చేసిన వారి లెక్కలే ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.
కొనుగోలుదారుల్లో 16 శాతం..
దేశంలో ఇండ్లు కొనుగోలు చేస్తోన్న వారిలో 16 శాతం 30 సంవత్సరాలలోపు ఉంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. 2022లో ఇది కేవలం 9 శాతం ఉండేది. ఇప్పుడు ఏకంగా 16 శాతానికి పెరగడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అంటే మూడు సంవత్సరాల్లోనే కొనుగోలుదారుల సంఖ్య దాదాపు డబుల్ అయ్యింది. అంటే యువతలో మారుతున్న లైఫ్ స్టయిల్‌ని ప్రతిబింబిస్తున్నది. ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఇతర ప్రైవేటు కంపెనీల్లో పని చేసే వారికి ప్యాకేజీలు బాగానే ఉంటున్నాయి. ఏటా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. అందుకే పెళ్లికి ముందే ఫ్లాట్‌ని సిద్ధం చేసుకుంటున్న యువత దర్శనమిస్తున్నారు. ముందు ఇల్లు.. ఆ తర్వాతే పెళ్లి అన్నట్టుగా ఉంది. తల్లిదండ్రులు కూడా సంపాదన వృథా కాకుండా ఈఎంఐలు కట్టుకునేలా ఎంకరేజ్ చేస్తున్నారు.
కిరాయిలు అధికం కూడా కారణమే
హైదరాబాద్, బెంగుళూరు, ముంబయి, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఇంటి కిరాయిలు బీభత్సంగా పెరిగాయి. ఐటీ, ఇతర కార్పొరేట్ కంపెనీల్లో పని చేసే యువత ఈ కిరాయిలు, ఈఎంఐలను సరిపోల్చుకుంటున్నారు. కాస్త ఎక్కువగానే వెచ్చిస్తే సొంతింటికి వెళ్లొచ్చన్న లెక్కలు వేస్తున్నారు. నెలకు రూ. 25 వేల నుంచి రూ.50 వేల వరకు కిరాయిలు కట్టడం కంటే మరికొంత కలిపి ఈఎంఐలు కట్టేస్తే ప్రాపర్టీ సొంతమవుతుందన్న లెక్కలకు కార్యరూపం దాల్చుతున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో పని చేస్తూ అధికంగా ప్యాకేజీలు పొందుతున్న వారైతే కెరీర్ ప్రారంభంలోనే సొంతింటి వైపు యోచిస్తున్నారు. యువత కేవలం నాలుగు గోడల ఇంటిని కోరుకోవడం లేదు. లగ్జరీ లైఫ్‌ని అందించే సొంతింటి కోసం చూస్తున్నారు. క్లబ్ హౌజ్, జిమ్, వర్కింగ్ స్పేస్, ఫీచర్లతో కూడిన బడ్జెట్ అపార్ట్‌మెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 2025 లెక్కల ప్రకారం రూ. కోటి కంటే ఎక్కువ విలువ గల ఇండ్ల అమ్మకాల్లో 20 శాతం వాటా యువతదే. ఐటీ రంగాల్లో విరాజిల్లుతున్న హైదరాబాద్, బెంగళూరు, పూణె, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ ట్రెండ్ పెరిగింది. గృహ రుణాలు పూర్తిగా డిజిటలైజేషన్ కావడం కూడా కారణమే. ఈజీగా లోన్స్ వస్తున్నాయి. ఆ తర్వాత ఈఎంఐలు కట్టడం కూడా సులువుగా మారింది.






