- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊహకందని ఆఫర్లతో బోల్తా కొట్టిస్తున్న రియల్ ఎస్టేట్ బూచోళ్లు.. తస్మాత్ జాగ్రత్త!
అరచేతిలో స్వర్గం చూపిస్తున్న కేటుగాళ్లు.. రెరా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు లేవు.. కానీ భారీ ప్రాజెక్ట్ అంటూ ఛానల్ పార్ట్‌నర్ ప్రచారం.. సోషల్ మీడియాలో ఆఫర్లతో జనాలు బోల్తా..

దిశ, తెలంగాణ బ్యూరో: రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీలాంచ్ ఆఫర్లతో జనాన్ని మోసం చేసి వేల కోట్లు దండుకున్న సంస్థలు ఉన్నాయి. కేసులు, అరెస్టులు, ఈడీ విచారణ, విజిలెన్స్ ఎంక్వయిరీలు కొనసాగుతున్నాయి. ఐతేనేం? ప్రీలాంచ్‌కు బదులుగా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈఓఐ) అని కొత్త పేరు పెట్టుకొని ఆఫర్లతో ప్రచారం నడుస్తూనే ఉన్నది. వీళ్లకు స్థలం కొనేందుకు డబ్బులు ఉండవు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. దాంతో జనం నుంచే వసూలు చేసి స్థలానికి కట్టాలని కుట్రలు చేస్తున్నారు. ఐతే సదరు కంపెనీ పేరిట కాకుండా ఛానల్ పార్ట్‌నర్‌గా ప్రచారం చేస్తున్నారు. కొందరేమో ప్రాప్ ఎన్ స్పేస్ అని, ఇంకొందరేమో ఎస్జీడీ సంస్థ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు.. పెద్ద సంఖ్యలోనే హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన భారతీ బిల్డర్స్‌కు రెరా రూ.4.74 కోట్లు పెనాల్టీ విధించింది. సాహితీ, భువనతేజ, జయ గ్రూప్ వంటి సంస్థలు అనేకం జనాన్ని మోసం చేసినవే. నానక్ రాంగూడ, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, పుప్పాలగూడ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఆఫర్ల బూచీతో జనం నుంచి సొమ్మును లాక్కొని చుక్కలు చూపిస్తున్న సంస్థలు ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కేసులు, జరిమానాలను లెక్క చేయడం లేదనే ప్రచారం పెరిగింది.
ఊహల్లో తేలియాడినట్లుగా..
వ్యవసాయ వర్సిటీ, ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గర అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇటు శంషాబాద్ ఎయిర్ పోర్టు అత్యంత సమీపంలోనే ప్రాజెక్టు.. కిస్మత్ పురాలో సువర్ణ దుర్గ గ్రూప్(ఎస్డీజీ) ప్రాజెక్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రెండు టవర్లు, 344 యూనిట్లు, 80 శాతం ఓపెన్ స్పేస్, 45 ఫ్లోర్లు, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు, నాలుగు కార్నర్ ఫ్లాట్లు, రెండు బేస్మెంట్ పార్కింగ్, 5 లెవెల్స్ పోడియం పార్కింగ్, 3 లెవెల్ ఎమినిటీస్, 75కి పైగా ఎమినిటీస్, 50 వేల చ.అ.ల ఎకో డెక్, 3.3 మీటర్ల ఎత్తులో ఒక్కో అంతస్థు.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఎవరికైనా వెంటనే ఫ్లాట్ కొంటే బాగుంటుందని అనిపిస్తుంది. అది కూడా ఆఫర్‌లో వస్తుందంటే ఎగిరి గంతెయ్యడం పక్కా. కానీ మరి అనుమతులు? ఎన్నేండ్లకు అప్పగిస్తారు? ముందుగానే డబ్బులు కట్టేయ్యడం సరైందేనా? గడువులోగా ఫ్లాట్‌ని అప్పగించకపోతే ఎక్కడికి వెళ్లాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అంటే నిండా ముగినినట్లేనని గుర్తుంచుకోవాల్సిందే. రెరా అనుమతులు ఉన్నప్పుడే చెల్లించిన మొత్తానికి ఓ హామీ లభిస్తుంది. ఆవేదన వ్యక్తం చేయడానికి ఓ ప్లాట్ ఫారం లభిస్తుంది. ఊహల్లో తేలియాడినట్లుగా ఆఫర్లు, సదుపాయాలను వీడియోలు, వాయిస్, బ్రోచర్ల రూపంలో కస్టమర్లకు పంపిస్తున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
అసలు కంపెనీ ఏది?
కిస్మత్ పురాలో ఈ ప్రాజెక్టు చేపట్టిన అసలు కంపెనీ ఏది? అది హైదరాబాద్ వాళ్లదా? ఇతర సిటీలో పని చేస్తున్నదా? విదేశీ కంపెనీయా? ఈ వివరాలేవీ ఉండవు. ఫ్లాట్లు బుక్ చేయించే వరకు అంతా గోప్యతే. ఆ తర్వాత తెలిసినా.. అనుమతి లేకుండా ప్రచారం ఎలా చేస్తున్నారని.. ఎవరైనా అడిగినా తమకేం తెలియదు. అది మాకు సంబంధమే లేదంటూ అసలు కంపెనీలు తప్పించుకోవడం పరిపాటిగా మారింది. నిజానికి ఈ ఛానల్ పార్ట్‌నర్ కంపెనీలు మాత్రం కమీషన్ వస్తే చాలు.. కస్టమర్లు ఎటుపోతే మాకేందన్న ధోరణిలో పని చేస్తున్నాయి. కనీసం సదరు కంపెనీ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల నుంచి అనుమతులు పొందాయా? అప్లై చేశాయా? ఫైల్ ఏ స్టేజ్‌లో ఉన్నదో కూడా తెలుసుకోకుండానే మార్కెటింగ్ చేయడం ఫ్యాషన్‌గా మారింది.
నష్టపోతే.. నో అడ్రస్
ఇలాంటి ఛానల్ పార్ట్‌నర్ కంపెనీ ఫ్లాట్ బుక్ చేసే వరకే తమ పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. సదరు ప్రాజెక్టు పూర్తి కాకపోయినా, ఇంకేమైనా పొరపాట్లు జరిగినా పట్టించుకోవడం లేదు. బిల్డర్లు చేతులెత్తేస్తే.. ప్రాజెక్టు పూర్తి చేయకుండా అదృశ్యమైతే బాధ్యత తీసుకోవడం లేదు. వీళ్లు కట్టించిన సొమ్మును కూడా చెల్లించేందుకు ససేమిరా అంటున్నారు. సొంతింటి కలను నెరవేర్చే ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టించడమే ఈ ఛానల్ పార్ట్‌నర్స్ లక్ష్యం. ఆ తర్వాత ఎవరెటు పోయినా తమకేందన్న ధోరణిలో పని చేస్తున్నాయి. ఇలాంటి దురాలోచనలతో పని చేసే ఛానల్ పార్ట్‌నర్స్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎన్నో ప్రాజెక్టులు
కొల్లూరు, వెలిమల, పాటిఘన్ పూర్, పటాన్ చెరు, శంషాబాద్, మోకిల, బాచుపల్లి, కిస్మత్ పురా, బండ్లగూడ ప్రాంతాల్లో తక్కువ ధరకే ఫ్లాట్లు అంటూ ప్రచారం ఇప్పటికీ సాగుతున్నది. రెరా అనుమతి పొందని ప్రాజెక్టులను ఛానల్ పార్ట్‌నర్ల పేరిట విక్రయిస్తున్నారు. ఎలాగూ రెరా దాకా ఈ విషయం చేరదు. చేరినా ఎవరైనా మోసపోయినప్పుడు చూద్దాం అంటుంది. కొన్నాళ్ల తర్వాత ప్రాజెక్టుకు అనుమతులు లభిస్తాయి. ప్రీలాంచ్ లేదా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట ఎన్ని అమ్మేసినా అధికారులకు పట్టింపు లేదు. ఇలా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి కస్టమర్లను ఆకట్టుకునే వారిపైనా చర్యలు తీసుకోవాలి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెరా అనుమతి లేని ప్రాజెక్టులను ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్‌ల ద్వారా మార్కెటింగ్ చేసే వారిపైనా చర్యలు ఉండాలి. అప్పుడే కస్టమర్లు మోసపోకుండా నియంత్రించగలుగుతారు.






