- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాద్ నగర్ ప్రాంతంలో రియల్ బూమ్
షాద్ నగర్ ప్రాంతంలో రియల్ బూమ్.. ఇతర రాష్ట్రాలకు కనెక్టివిటీ.. కాలుష్య రహిత జోన్‌గా అనుకూలతలు.. అరగంటలోనే శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణం.. వెలుస్తున్న భారీ స్తిరాస్థి ప్రాజెక్టులు -పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న కస్టమర్లు

దిశ, రంగారెడ్డి బ్యూరో : చెంతనే హైదరాబాద్- బెంగుళూరు హైవే(ఎన్‌హెచ్-44).. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అరగంటలో ప్రయాణం.. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రాబోయే రిజినల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ.. పెద్ద పెద్ద కంపెనీల ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ది వంటి అనుకూలతల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ ప్రాంతం రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. కాలుష్య రహిత జోన్‌గా ఉండటంతో ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్న వారు ఇటు వైపుగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ ఉద్యోగులకు సైతం వారు పనిచేస్తున్న ప్రదేశాలు దగ్గరలో ఉండటంతో ప్రత్యేకించి ఆయా వర్గాలు ఇటుగా మొగ్గు చూపిస్తున్నాయి. ప్రఖ్యాతిగాంచిన రియల్ సంస్థలు పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపట్టి అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లోనే అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణాలను చేపడుతున్నాయి.
నగరాలను తలదన్నేలా వసతులు
హైదరాబాద్ నగరంలో భూముల లభ్యత తగ్గిపోవడం.. ఉన్న వాటి ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో నిర్మాణదారులు సైతం షాద్ నగర్ వంటి శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఎకరాల విస్తీర్ణంలో గేటేడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. సకల వసతులు ఒకప్పుడైతే నగరంలోనే సాధ్యం. కానీ.. శివార్లలోనూ మౌలిక వసతులు పెద్ద ఎత్తున సమకూరడం.. రవాణా సదుపాయాలు సైతం మెరుగుపడడంతో కస్టమర్లు ఈ ప్రాంతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కార్పోరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇప్పటికే కొలువుదీరాయి. షాద్ నగర్ నుంచి దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు కనెక్టివిటీ ఉంది. 44వ జాతీయ రహదారితోపాటు ముంబై, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుసంధాన రోడ్లు ఉన్నాయి. ఈ ప్రాంతానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు తోడు భవిష్యత్తులో ట్రిపుల్ ఆర్ రానుండడంతో ఎన్నో ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఆదిభట్ల, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌లు షాద్ నగర్ పట్టణ కేంద్రం నుంచి 45 కిలోమీటర్లు, 60 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉండటం.. ట్రాఫిక్ సమస్యలు లేకపోవడంతో.. ఐటీ ఉద్యోగులు సైతం పెద్ద ఎత్తున స్తిరాస్థులను కొనుగోలు చేస్తున్నారు. వివిధ వర్గాల అభిరుచులకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో ప్రైవసీ, సెక్యూరిటీ ఉండేలా అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణాలను చేపడుతున్నారు. వీకెండ్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడిపేందుకు ప్లాట్లలో సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఓపెన్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్టీ జోన్, జిమ్, పచ్చదనం వంటి అదనపు హంగులను సమకూరుస్తున్నారు. వీటితోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కరెంట్, ఓపెన్ ఏరియా, ప్లాట్ చుట్టూ పచ్చటి చెట్లను ఏర్పాట్లు చేస్తున్నారు.
భవిష్యత్తులో మరింత అభివృద్ది
షాద్ నగర్ పరిసర ప్రాంతాలలో మైక్రోసాఫ్ట్, అమెజాన్ డేటా సెంటర్లు ఏర్పాటయ్యాయి. పి అండ్ జీ, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి బడా పరిశ్రమలతో పాటు నాట్కో, ఎంఎస్ఎన్ వంటి ఇతర పరిశ్రమలు సైతం పెద్ద ఎత్తున ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు ఇక్కడ కొలువుదీర బోతున్నాయి. ఈ క్రమంలో వృత్తి, ఉద్యోగాల రీత్యా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు. సింబాసిస్ యూనివర్సిటీ ఇదే ప్రాంతంలో ఉంది. ఆధ్యాత్మిక జీవనం గడిపే వారి కోసం స్టాచు ఆఫ్ ఈక్వాలిటీ, కన్హా శాంతివనం వంటి అనేక పర్యాటక కేంద్రాలు షాద్ నగర్ చుట్టూత ఉన్నాయి. ప్రతిపాదిత ట్రిపుల్ ఆర్ ను దృష్టిలో పెట్టుకుని ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేటు సంస్థలు అనేక ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. దీంతో ఈ ప్రాంత పరిసరాల్లో అభివృద్ది మరింతగా ఊపందుకునే అవకాశం కన్పిస్తుండడంతో ఎన్‌ఆర్‌ఐలు సైతం ముందు చూపుతో భూములను కొని పెట్టుకుంటున్నారు.






