- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేవెళ్ల.. రియల్ ఎస్టేట్‌కు కల్పవల్లి!
చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్ పల్లి మండలాల్లో విస్తరిస్తున్న స్తిరాస్థి వ్యాపారం.. పరిశ్రమల ఏర్పాటుతో అమాంతం పెరిగిన భూముల ధరలు.. వ్యవసాయ భూములకు మరింతగా డిమాండ్.. ఇప్పటికే పెద్ద ఎత్తున ఫాం హౌస్‌లు, విల్లాల నిర్మాణం

దిశ, రంగారెడ్డి బ్యూరో : ‘చేవెళ్ల.. ఇప్పటిదాకా ఒక లెక్క. ఇప్పుడొక లెక్క. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉన్న చేవెళ్ల చుట్టూతా.. రియల్ పరుగులతోపాటు పారిశ్రామిక ప్రభ కళ్లెదుటే కనబడుతోంది. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ది చెందుతుండడంతో అవన్నీ రియల్ వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ప్రముఖ సంస్థలు విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఫామ్ హౌస్ కల్చర్ వచ్చాక వ్యవసాయ భూములకు సైతం విపరీతమైన డిమాండ్ వచ్చింది. భూముల లభ్యత కూడా ఎక్కువగా ఉండడంతో పెట్టుబడులకు అనుకూలంగా మారింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా స్తిరాస్థి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు నగర వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు.
పరిశ్రమలకు గమ్యస్థానం
రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో తీసుకొచ్చిన మార్పులతో రంగారెడ్డి జిల్లానే కాదు.. చేవెళ్ల నియోజకవర్గ ముఖచిత్రం సైతం మారిపోయింది. చేవెళ్ల, చందనవల్లి, సీతారాంపూర్, కొండగల్ ప్రాంతాల్లో రోజురోజుకూ పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. ఔటర్ నుంచి అరగంట ప్రయాణం.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఐటీ కారిడార్‌కు చేరువగా ఉండడం.. వంటి అనుకూల పరిస్థితుల నేపథ్యంలో పారిశ్రామిక వేత్తల చూపు సైతం చేవెళ్ల వైపు మళ్లుతోంది. దీంతో ఈ ప్రాంతం నేడు పరిశ్రమలకు, ఉపాధికి గమ్యస్థానంగా మారింది. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని 1,248.22 ఎకరాల వక్ఫ్ భూముల్లో ఇండిస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భూ సేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను సైతం జారీ చేసింది. ఇవన్నీ కూడా రియల్ ప్రగతికి మరింతగా దోహదపడనున్నాయి.
వడివడిగా రియల్ పరుగులు
అవుటర్ నుంచి 29 కి.మీ.ల దూరంలో చేవెళ్ల ప్రాంతం ఉంది. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉండడంతో రియల్ వ్యాపారం ఈ ప్రాంతంలో అనతికాలంలోనే పుంజుకున్నది. ఆహ్లాదకర వాతావరణం.. పెద్ద ఎత్తున వ్యవసాయ క్షేత్రాలు ఉండడంతో వడివడిగా రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోంది. ప్రధాన రహదారుల పక్కన ఒకప్పుడు ఎకరా కోటి రూపాయలు ఉన్న వ్యవసాయ భూములు ప్రస్తుతం రూ.3 కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయి. ఇతర ప్రాంతాల్లోని భూముల ధరలతో పోలిస్తే.. ఇక్కడ ధరలు తక్కువగా ఉండడం.. భూముల లభ్యత ఎక్కువగా ఉండడంతో వ్యాపారుల దృష్టి ఇటువైపు మళ్లుతోంది. నిర్మాణాలపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. బడ్జెట్‌ను బట్టి ఎకరాల్లోనే కాకుండా.. తక్కువ విస్తీర్ణంలోనూ భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మోకీల ప్రాంతంలో విల్లాల సంస్కృతి ఎక్కువగా కనబడుతోంది. నగర వాసులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు విల్లాల కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తుండడంతో పలు బడా సంస్థలు ఈ ప్రాంతంలో భారీ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ప్లాట్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం భారీ వెంచర్లు ఏర్పాటు చేసి క్రయ విక్రయాలు జరిపేందుకు సన్నద్దమవుతోంది.
మెరుగుపడుతున్న రవాణా సదుపాయం
ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగేలా చేవెళ్ల ప్రాంతానికి అనుసంధానంగా అనేక రహదారులను ప్రభుత్వం విస్తరిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో కదలిక వచ్చింది. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఉన్న రహదారి నాలుగు వరుసలుగా మారనున్నది. ప్రతిపాదిత ట్రిపుర్ ఆర్ సైతం చేవెళ్ల ప్రాంతం నుంచే వెళ్తోంది. షాబాద్-హైతాబాద్-చేవెళ్ల మార్గంలో కొన్ని ఐటీ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో మెరుగైన రవాణా సౌకర్యం కోసం అవుటర్ నుంచి కొడంగల్ వరకు రేడియల్-2 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. బుద్వేలు సమీపంలోని బాహ్య వలయ రహదారి నుంచి ప్రారంభమయ్యే రేడియల్ రోడ్-2 షాబాద్ మీదుగా పూడూరు, కొడంగల్ వరకు కొనసాగనుంది. ఈ రహదారికి సంబంధించి ఇప్పటికే బహిరంగ ప్రకటన విడుదలైంది. భూ సేకరణ పూర్తి కాగానే టెండర్లు పిలవనున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే శంషాబాద్ నుంచి షాబాద్, శంకర్ పల్లి, చేవెళ్ల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడడంతోపాటు ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకునేందుకు ఈ రేడియల్ రహదారి సహాయపడనుంది.






