సర్వీసులో మైలురాయి.. పనితీరే గీటురాయి.. ‘దిశ’ స్పెషల్ ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

by Javid Pasha |

సర్వీసులో మైలురాయి.. పనితీరే గీటురాయి.. ‘దిశ’ స్పెషల్ ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

సర్వీసులో మైలురాయి.. పనితీరే గీటురాయి.. ‘దిశ’ స్పెషల్ ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
X

‘నా సర్వీసులో హైడ్రా కమిషనర్ గా పనిచేయడం ఓ మైలురాయిగా భావిస్తున్నా. హైదరాబాద్ మహానగరంలో అయినా.. సమాజంపై ఇంత పెద్దఎత్తున ప్రభావం చూపుతుందనుకోలేదు. ‘సార్ ఏండ్లుగా తిరిగినా పరిష్కారంకాని పనులు హైడ్రా వల్ల అయింది’ అని ప్రజలు ఆనందం వ్యక్తం చేసిన అనుభూతి ఏ పోస్టులో రాలేదు. ప్రశంసలకు పొంగిపోను..విమర్శలకు కుంగిపోను. మూసీ కూల్చివేతలకు లింకుపెట్టి హైడ్రా ఒక సెటిల్ మెంట్ సంస్థ అంటూ విమర్శలు గుప్పించారు. కానీ అనతికాలంలో ప్రజల మద్దతు పెరిగింది. ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకు హైడ్రా పనితీరే గీటురాయిగా నమ్ముకున్నా’ అని హైడ్రా కమిషనర్ ఏ వీ రంగనాథ్ అన్నారు. హైడ్రా ఏర్పడి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ‘దిశ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. - దిశ, తెలంగాణ బ్యూరో


హైడ్రా కారణంగానే రియల్ ఎస్టేట్ తగ్గిందని విమర్శలున్నాయి. దీన్ని ఎలా చూస్తారు ?

హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ తగ్గలేదు. దేశవ్యాప్తంగా 9 మెట్రోపాలిటన్ నగరాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆనారాక్ అనే ఏజెన్సీ వెల్లడించింది. హైడ్రా వల్లనే రియల్ ఎస్టేట్ తగ్గితే కరీంనగర్ జిల్లాల్లో హైడ్రా లేదు. ఢిల్లీ, పూణె, ఇతర నగరాల్లోనూ హైడ్రా లేదు. బ్యాంకింగ్ వడ్డీ రేట్లు పెరగడం, అమెరికాలో భారతీయులకు ఉపాధి అవకాశాలు తగ్గడం, ఐటీ ఉద్యోగాలు తగ్గడం వంటి కారణాలతో రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్నది. సేల్స్, రిజిస్ట్రేషన్స్ పెరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఆస్తుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎలా ?

ప్రభుత్వ ఆస్తులు.. ప్రజలకు సంబంధించిన ఆస్తులు. చెరువులు, నాలాలు, భూములను పరిరక్షించాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. మధురానగర్ లో 2015లో కాలనీవాసులంతా కలిసి 1000 చదరపు అడుగుల ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు. నార్సింగిలో ముష్కిల్ లేక్ గురించి 100 మందికి పైగా ఐటీ ఉద్యోగులు కలిసికట్టుగా ముందుకొచ్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ఆరు చెరువులలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. మరో 15 చెరువులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. వాటికి సంబంధించిన డీపీఆర్ లను సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతితో సుందరీకరిస్తాం. ఒక్కో చెరువును అభివృద్ధి చేయడానికి రూ.10 కోట్లు అవుతుంది. దీంతోపాటు ఆ ఏరియా అభివృద్ధి చెందే అవకాశముంది. భూగర్భ జలాలు పెరిగే అవకాశముంది.

ప్రజావాణి ఫలితాలు ఎలా ఉన్నాయి?

ప్రజావాణితో హైడ్రాకు ప్రజల మద్దతు పెరిగింది. కబ్జాలు తగ్గాయి. చెరువుల ఆక్రమణలు తగ్గిపోయాయి. ప్రజల్లో అవగాహన పెరిగింది. గేటెడ్ కమ్యూనిటీలకు కాంపౌండ్ వాల్ కట్టాలా ? వద్దా ? అనే సందేహాలకు సమాధానాలు లభించాయి. ప్రజావాణి, సోషల్ మీడియా, ఇతర మార్గాల్లో హైడ్రాకు 25 వేల ఫిర్యాదులు వచ్చాయి.

హైడ్రా తీసుకున్న ముఖ్యమైన చర్యలు?

హైడ్రా ఏర్పడి ఏడాది కాలంలో 500 ఎకరాల భూములను పరిరక్షించింది. 70 పార్కులను కాపాడింది. రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను పరిరక్షించింది. తమ్మిడికుంట చెరువును 12 ఎకరాల నుంచి 29 ఎకరాలకు చేసింది. భుమ్రూక్ దౌల చెరువును 6 ఎకరాల నుంచి 20 ఎకరాలకు చేసింది. నామరూపాల్లేకుండా పోయిన బతుకమ్మకుంట చెరువును 5 ఎకరాల్లో పునరుద్దరించింది.

ప్రభుత్వ సంస్థల సహకారం ఎలా ఉంది ?

హైడ్రాకు అటు ప్రభుత్వం నుంచి ఇటు ప్రభుత్వ విభాగాలైనా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, ట్రాఫిక్ పోలీసుల నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులది. చెరువులను కాపాడాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులది. వాళ్లు చేయకుంటే హైడ్రా చేస్తది. ప్రతిదీ హైడ్రా చేయాలంటే అంత సిబ్బంది లేరు. ప్రభుత్వం మంజూరు చేసిన 169 మంది అధికారుల్లో ప్రస్తుతం 55 మంది మాత్రమే వచ్చారు. మిగిలినవారు ఒక్కొక్కరుగా వస్తున్నారు. పోలీసుస్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 15 రోజుల్లో కోర్టు నుంచి క్లియరెన్స్ రానుంది.

విమర్శలను ఎలా తీసుకుంటున్నారు?

హైడ్రాపై కొంత మంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. చెరువులను ఆక్రమించి కొన్ని విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, వాటి విషయంలో హైడ్రా చర్యలు తీసుకోవండంలేదని ఆరోపిస్తున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో 1000 చెరువులకుగాను 140 చెరువులకే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేశాం. 550 చెరువులకు ప్రైమరీ నోటిఫికేషన్ జారీచేశాం. ప్రతి చెరువుకు హద్దులు నిర్ధారిస్తాం. ప్రైమరీ, ఫైనల్ నోటిఫికేషన్ జారీచేస్తాం. ఎన్ఆర్ఎస్సీ డేటా ఆధారంగా చెరువులను ఆక్రమించినట్టు గుర్తిస్తే చర్యలు కచ్చితంగా తీసుకుంటాం.

విపత్తుల నిర్వహణ ఎలా ఉంది?

విపత్తుల నిర్వహణకు డీఆర్ఎఫ్ చర్యలు తీసుకుంటున్నది. తక్కువ ఖర్చుతో ఎఫెక్ట్ గా పనిచేయడానికి మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏర్పాటు చేశాం. రాబోయే రెండేండ్లలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ ఏడాదిలో వర్షాల కారణంగా సంభవించే విపత్తుల తీవ్రతను మాత్రం తగ్గిస్తాం. నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నాం. హాట్ స్పాట్లపై దృష్టి పెడతాం. భారీ వర్షాలు వచ్చినప్పుడు నగరంలో కొన్ని ప్రాంతాలు మునిగే అవకాశముంది. హైడ్రాకు మాన్ సూన్ ఎమర్జెన్సీ పనులు అప్పగించడంతోనే మునిగిందనే ప్రచారం కూడా చేసే అవకాశముంది. రెండేండ్లల్లో విపత్తులకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటాం. అందుకు ప్రజలు సహకరించాలి.

భవిష్యత్ కర్తవ్యం?

హైడ్రా పరిధిలోని అన్ని చెరువులకు హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారుల సహకారంతో సరిహద్దులు గుర్తించే పనులు పూర్తి చేస్తాం. కొత్త చెరువులు, కొత్త నాలాలు, కొత్త పార్కులను ప్రజలకు అందిస్తాం. హిమాయత్ సాగర్ కు జలమండలి ఆధ్వర్యంలో ఫ్రైమరీ నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఉస్మాన్ సాగర్ కు ఫైనల్ నోటిఫికేషన్ జారీచేశారు. దాని ఆధారంగా కమర్షియల్ ఫామ్ హౌస్ లను కూల్చేశాం. చెరువుల్లోకి మురుగును వదులుతున్న సంస్థలపై చర్యలు తీసుకుంటాం. ప్రతి గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్ కు తప్పనిసరిగా ఎస్టీపీ ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఇంకుడు గుంతలను సైతం ఏర్పాటు చేసుకోవాలి. ఈ రెండింటిపై హైడ్రా సీరియస్ గా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Next Story