రష్మి దుర్వే.. రాజీలేని రైతు నాయకురాలు.!

by Daayi Srishailam |

ప్రదాన్ అనే సంస్థ ద్వారా 2000 మంది రైతులకు నాయకత్వం వహిస్తూ సామాజిక మార్పుకు కృషి చేస్తోంది

రష్మి దుర్వే.. రాజీలేని రైతు నాయకురాలు.!
X

దిశ, ఫీచర్స్: రైతు పేరు గురించి గొప్పగా చెప్తాం. కానీ అతనొక 100 రూపాయలు అడిగితే మాత్రం ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకంటే వ్యవసాయం బువ్వ పెట్టదనే అభిప్రాయం అందరిదీ. ఆ పరిస్థితిని చిన్నప్పటి నుంచే చూసింది రష్మి దుర్వే. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా సెంగుడా గ్రామంలో పుట్టిన రష్మి.. ప్రదాన్ అనే సంస్థ ద్వారా 2000 మంది రైతులకు నాయకత్వం వహిస్తూ సామాజిక మార్పుకు కృషి చేస్తోంది.

పెండ్లయినా మార్పు లేదు..

సెంగుడా ఎర్రమట్టి పొలాలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించినట్లు కనిపించే గ్రామం. ఊర్లో ఎక్కువగా వరి పొలాలే ఉండేవి. పేదరికం వల్ల రష్మి పెద్దగా చదువుకోలేదు. పెండ్లికూడా చాలా చిన్న వయసులోనే చేశారు. అప్పటివరకు తనకు తన భవిష్యతేంటో తెలియదు. ఆ ఆలోచన కూడా చేయలేదు. ఈ మట్టికి రుణం ఉన్నాను కాబట్టీ పొలంలో పనిచేయాల్సిందే అని మెంటల్‌గా డిసైడ్ అయింది. పెండ్లితో కొత్త జీవితం వస్తుందనుకుంటే అక్కడా అదే పరిస్థితి. వంట చేయడం.. బట్టలు ఉతకడం.. బాసాన్లు తోమడం.. పొలంలో పనికి వెళ్లడమే తన దినచర్యగా మారిపోయింది.

వారానికి 10 రూపాయులు ఆదా..

ఒక సంవత్సరం తర్వాత కూతురు పుట్టింది. రెండేళ్ల తర్వాత కొడుకు. నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. కానీ దమ్మిడి ఆదాయం లేని భూమి అది. దీంతో భర్త ఏ పని దొరికితే ఆ పని చేసేవాడు. కొన్నిసార్లు 50కి 100కి కూడా ఆటోలు నడిపేవాడు. పండగకు బట్టలు కొనే స్థోమతలేని పరిస్థితి. 2015లో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా జాగృతి స్వయసహాయక బృందంలో చేరింది. మొదట చాలా సంకోచించేది. కానీ వరుస మీటింగులు.. చర్చలతో తన భయం తొలగిపోయింది. వారానికి 10 రూపాయులు ఆదా చేయాలనే టార్గెట్ పెట్టుకుంది. కానీ కుటుంబ అవసరాలు కష్టమయ్యాయి.

గ్రేడింగ్ తెలియలేదు కానీ..

10 రూపాయలు ఆదా చేస్తే కొన్నిసార్లు భోజనం కూడా కష్టమయ్యేది. కానీ పిల్లల కోసం రిస్క్ తీసుకుంది. ఆదా పెరిగిన తర్వాత గ్రేడింగ్.. క్యాష్ క్రెడిట్ లిమిట్ నుంచి రుణాలు తీసుకుంది. గ్రేడింగ్ అంటే ఏమిటో తెలియలేదు కానీ నమ్మకంతో ముందడుగు వేసింది. 2018లో ప్రదాన్‌లో చేరింది. ఇంటిగ్రేటెడ్ నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంది. సెంగుడా రైతులను రీజెనరేటివ్ ఫార్మింగ్‌కు ప్రోత్సహించింది. మొదట 150 మంది మాత్రమే చేరారు. చాలామంది సందేహపడ్డారు. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లకు శిక్షణ ఇచ్చి చాలా గ్రామాలకు దీనిని విస్తరించింది.

15 ఎకరాల్లో 250 మంది..

రష్మి ఇప్పుడు 2000 మంది రైతులకు నాయకురాలు. ఖరీఫ్ సీజన్‌లో ఆకుకూరలు.. సీజనల్ కూరగాయలు పండించి లోకల్ బిజినెస్ ఎకానమీ సృష్టించి సీజన్‌కు రూ.12,000-15,000 అదనపు ఆదాయం తెస్తోంది. 2021లో 0.07 ఎకరాల్లో రెండు పంటలు పండించి రూ.35000 సంపాదించింది. 2022లో సోషల్ ఆడిటర్‌గా మారి నెలకు రూ.10000 సంపాదించింది. ఇప్పుడు 10 పంచాయతీల్లో ప్రాజెక్టులు ఆడిట్ చేస్తోంది. ఆమె నెట్‌వర్క్‌లో రైతులు యేడాదికి రూ.70000 సంపాదిస్తున్నారు. రష్మి ప్రోత్సాహంతో 15 ఎకరాల్లో 250 మంది మహిళలు కూరగాయలు పండిస్తూ లాభసాటి వ్యవసాయం చేస్తున్నారు.

సెంగుడా మారిపోయింది..

కెరీర్ బాగున్నప్పుడు భర్త చనిపోయాడు. పిల్లల కోసం ఇప్పుడు తను ఆగిపోతే వాళ్ల భవిష్యత్తు ఏమవుతుంది అనుకుంది. దుఃఖాన్ని దిగమింగేందుకు పూర్తిగా పనిమీదే ధ్యాస పెట్టింది. పొలంలో పంటలు పెరుగుతున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండేది. వెర్మికంపోస్ట్ తయారుచేస్తూ అదనపు ఆదాయం సంపాదిస్తోంది. స్వయం సంపాదన.. పిల్లల పెంపకం.. శిక్షణలు ఇస్తూ మహిళా సాధికారత అంటే ఏంటో నిరూపిస్తోంది. రష్మి వల్ల సెంగుడా మారింది. ఖాళీ పొలాలు ఇప్పుడు కూరగాయలు.. ఆకుకూరలతో నిండాయి. మహిళలు బాగా సంపాదిస్తు్న్నారు. ఇంత మార్పు తను ఊహించలేదని నవ్వుతూ చెప్తోంది రష్మి.

Next Story