- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Folk Singer: ఫోక్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రాము రాథోడ్
‘రాను..బొంబాయికి రాను..’అని వినపడితే చాలు.. తెలియకుండానే కాళ్లు, చేతులు ఆడుతాయి. మూడేళ్ల పసివాడి నుంచి పండు ముసలి వరకు అందర్నీ ఆడిస్తున్నదీ పాట.

‘రాను..బొంబాయికి రాను..’అని వినపడితే చాలు.. తెలియకుండానే కాళ్లు, చేతులు ఆడుతాయి. మూడేళ్ల పసివాడి నుంచి పండు ముసలి వరకు అందర్నీ ఆడిస్తున్నదీ పాట. యూట్యూబ్ లో అతి తక్కువ కాలంలో ట్రెండింగ్ లోకి వచ్చి రికార్డులన్నీ బద్దలుకొట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పాటలేకుండా పండుగ లేదంటే ఆశ్చర్యంకాదు. ఫోక్ ఇండస్ట్రీనే షేక్ చేస్తున్న ఈ పాటను రాసింది.. పాడింది.. ఆడింది.. పాలమూరు జిల్లా ఫోక్ సింగర్..డ్యాన్సర్ రాము రాథోడ్. మొన్న ‘సొమ్మసిల్లీ పోతున్ననే... ఓ సిన్నీ రాములమ్మ..’అన్న ఫోక్ సాంగ్ తో అందరి దృష్టిని తన వైపు ఆకర్షించిన రాము రాథోడ్.. నేడు వరుస ఫోక్ సాంగ్ లు రాస్తూ.. పాడుతూ... డ్యాన్సులతో దుమ్మురేపుతున్నాడు.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : రాము రాథోడ్.. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్ లో కిషన్ నాయక్, కమలమ్మ దంపతులకు ఐదో సంతానం. చిన్నప్పటి నుంచి తండ్రి టేప్ రికార్డులో వేసే పాటలకు చిందేసేవాడు. ఇంట్లో నిత్యావసరాలకు కొరత ఉన్నా.. పాటల క్యాసెట్లకు మాత్రం కొరతలేకుండా చేసేవాడు తండ్రి. అలా మ్యూజిక్ తో రాముకు బాల్యంలోనే బలమైన బంధం ఏర్పడింది. ఇది కాస్త పెళ్లిలు, ఇతర శుభకార్యాలలో డ్యాన్సులు వేయడం వరకు వెళ్లింది. అయితో ఓ పెళ్లిలో చేసిన నృత్యానికి పెళ్ళికొడుకు ముగ్ధుడై వంద రూపాయలు ఇచ్చాడు. చిన్నతనంలో రాముకు అది చాలా పెద్దమొత్తమే. అంతేకాదు ‘డ్యాన్సులు చేస్తే.. డబ్బులు వస్తాయా ? ఇలాగైతే డ్యాన్సులు చేయాల్సిందే..’ అని రాము బలంగా నిర్ణయించకున్నాడు. నాటి నుంచి పాఠశాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల మన్ననలు పొందాడు. భూత్పూర్ లోని వివేకనంద పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గోరేటి వెంకన్న మాటలు రామురాథోడ్ ను ఆలోచనలో పడేశాయి. ఆడుతూ.. పాడుతూ.. పాటలు రాయడం చాలా సులభం.. అని చెప్పిన గోరేటి మాటలు.. రాముని పాటల రచయితగా మార్చాయి. పాఠశాల స్థాయిలోనే జిల్లా, రాష్ట్రస్థాయిలో బహుమతులు అందుకున్న రాముకు పాలమూరులో కాలేజీ రోజులు మరింత ప్రత్యేకంగా మారాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న రోజుల్లో గద్దర్ పాటలు మరింత స్పూర్తినింపాయి. ఉద్యమంలో, కళాశాలలో గద్దర్ పాటలు, డ్యాన్సులతో రాము రాథోడ్ అందరినీ ఆకట్టుకున్నాడు.
కల్చరల్ వైపే కన్ను..
రాము రాథోడ్ చదువు కన్నా ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాల వైపే దృష్టి సారించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తిరుగులేని కళాకారులుగా వెలుగు వెలిగిన జంగి రెడ్డి, శివ నాగులు, జయప్రకాష్, తదితరుల ట్రూప్ లో చేరి అనతి కాలంలోనే రాము మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పోలోజు సత్యం మాస్టర్ బృందంలో చేరి అనేక నృత్య ప్రదర్శనలు చేశాడు. హరికథ కళాకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మాలయతోనూ రాము కార్యక్రమాలు చేశాడు. కరోనా కాలంలో ఇంట్లోనే ఉన్న రాముకు పాటలు రాసుకునేందుకు బోలెడు సమయం దొరికింది. లాక్ డౌన్ తర్వాత అప్పటి ఎమ్మెల్యే సహకారంతో సంక్రాంతి పండుగ పాటను రాసి.. విడుదల చేశాడు. ఆ తర్వాత రెండు, మూడు పాటలు విడుదల చేశాక.. ‘సొమ్మసిల్లిపోతున్ననే.. ఓ సిన్నీ రాములమ్మ’పాట రాముకు మంచి బ్రేక్ ఇచ్చింది. నాటి నుంచి వెనుతిరిగి చూడకుండా వరుస పాటలతో ఊపుమీదున్న రాముకు ‘రాను.. బొంబాయికి రాను..’ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. ఫోక్ ఇండస్ట్రీలోనే ఈ పాట ఓ సంచలనం అని చెప్పాలి. తాజాగా ఈటీవీ ఢీ2లోనూ రాము రాథోడ్ పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. ఇలా రాష్ట్రంలోని జానపద కళాకారులతో కార్యక్రమాలు చేస్తూనే రాము రాథోడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.






