లగ్జరీ విల్లాలు వదిలి.. మట్టి ఇంటిలోకి..! ఈ దంపతులు ఏం చేశారంటే..

by Javid Pasha |

లగ్జరీ విల్లాలు వదిలి.. మట్టి ఇంటిలోకి..! ఈ దంపతులు ఏం చేశారంటే..
X

దిశ, ఫీచర్స్ : ధర్మశాల కొండల్లో పచ్చని పైన్ ఫారెస్ట్‌లు, దిగుడు బావుల వంటి పొలాలు విస్తరించిన ప్రాంతంలో ఒక అద్భుతమైన హోమ్ స్టే ఉంది. అదే ‘కోసెన్ రుఫు విలేజ్ రిక్లూస్’ హోమ్ స్టే. ఇది సాధారణ హోమ్ స్టే కాదు. దీని ప్రత్యేకత సౌకర్యాల్లోనో.. ఆధునిక సదుపాయాల్లోనో కాదు.. సంస్కృతితో మమేకమైన తీరులో ఉంది. ఈ ప్రాజెక్ట్ ఆలోచన సినిమాటోగ్రాఫర్ దంపతులు రమణ్ సిద్ధార్థ, మంజు నారాయణ్‌లది.

లండన్‌ను వదిలి..

రమణ్ సిద్ధార్థ, మంజు నారాయణ్‌ది లండన్‌లో విలాసవంతమైన జీవితం. కానీ వాళ్లు ఆ లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేయలేకపోయారు. చిన్నప్పుడు ఇండియాలోని గ్రామీణ ప్రాంత మట్టి ఇళ్లను చూస్తూ పెరిగిన వాళ్లకు లండన్‌లోని లగ్జరీ విల్లాలు నచ్చలేదు. 25 ఏళ్లు లండన్‌లోనే ఉన్నా.. మట్టి ఇళ్ల సౌందర్యాన్ని వెతుక్కుంటూ ఇండియాకు వచ్చేశారు. హిమాచల్‌లోని చాలా చోట్ల అన్వేషించారు. కానీ కాంక్రీట్ భవనాలే కనిపించి నిరాశకు గురిచేశాయి. ఇలా అయితే కాదు.. ప్రకృతికి దగ్గరగా ఒక స్థిరమైన నివాసం నిర్మించాలనుకొని 2019లో ధర్మశాలలోని ఖన్యారా రోడ్‌లో థాత్రి గ్రామంలో హోమ్ స్టే ఏర్పాటు చేశారు.

నాలుగేళ్లు పట్టింది

హోం స్టే నిర్మించాలనుకున్నది వ్యాపార ఉద్దేశంతో కాదు. స్థానిక సంస్కృతితో మమేకం కావాలనే ఆకాంక్షతో దాన్ని తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్‌కు జీవం పోసేందుకు జర్మన్-అమెరికన్ ఆర్కిటెక్ట్ డెలియా కింజింగర్ సహాయం తీసుకున్నారు. మొదట్లో ఈ ప్రాజెక్ట్‌పై సందేహం వ్యక్తం చేసినప్పటికీ ఈ దంపతుల ఉద్దేశం.. నిజాయితీ.. స్థానిక సంస్కృతిపై ఉన్న ప్రేమను తెలుసుకొని ‘కోసెన్ రుఫు హోమ్ స్టే’ను నిర్మించారు. స్థానిక మట్టితో చేసిన ఇటుకలు.. వెదురు.. స్లేట్‌లతో దీనిని కట్టారు. దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు దీని నిర్మాణం సాగింది.

పర్యావరణహితం..

సిమెంట్‌ను పూర్తిగా నివారించి వెదురుతో పునాదులు, రాళ్లు, మట్టితో గోడలు, స్థానికంగా తవ్విన స్లేట్‌తో రూఫింగ్ చేశారు. ఎలాంటి పారిశ్రామిక పదార్థాలను ఉపయోగించలేదు. 18 అంగుళాల మందంతో గోడలు, చీడి ఆకులు వాడారు. ‘కోసెన్ రుఫు’ అంటే జపనీస్‌లో ‘శాంతి.. సంతోషం’అని అర్థం. ఇక్కడ టీవీలు, ఎయిర్ కండిషనర్లు, మొబైల్ సిగ్నల్‌లు లేవు. సూర్యరశ్మితో వెచ్చగా ఉండే మట్టి కాటేజ్‌లు, పైన్ కలప సుగంధం, కొండల దృశ్యాలు ఆకర్షిస్తాయి. ఇక్కడ స్టే చేయాలంటే ఒక నైట్‌కు మినిమం ఫీజు రూ.3000 ఉంటుంది. పర్యావరణ అనుకూల టాయిలెట్‌రీలు ఉంటాయి. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధం.

కూల్చొద్దని అవగాహన..

‘కోసెన్ రుఫు’ హోమ్ స్టే వల్ల స్థానిక మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. దీని నిర్మాణానికి దాదాపు రూ.2.5 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేసినప్పటికీ 30% అదనపు ఖర్చు అయింది. భూమిని సమతలం చేయకుండా.. భారీ యంత్రాలను ఉపయోగించకుండా నిర్మించడం వల్ల కొండల్లో సాధారణంగా ఎదురయ్యే ఒడుపు.. డ్రైనేజీ సమస్యలను నివారించారు. స్థానికులకు సాంప్రదాయ ఇళ్లను కూల్చివేయొద్దని సలహాలిస్తూ స్థిరమైన నిర్మాణాలపై వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నారు. ఇదొక పర్యాటక గమ్యస్థానమే కాదు. స్థిరత్వం, సంస్కృతి, భూమితో సామరస్యానికి నిదర్శనం అంటున్నారు.

Next Story