చిరుతకు రాఖీ కట్టిన మహిళ.. నెటిజన్ల నుంచి అభినందనల వెల్లువ.!

by Disha Web Desk 16 |
చిరుతకు రాఖీ కట్టిన మహిళ.. నెటిజన్ల నుంచి అభినందనల వెల్లువ.!
X

దిశ, ఫీచర్స్ : తోడబుట్టిన సోదరుల క్షేమాన్ని తలచి సోదరీమణులు కట్టే రక్షా బంధనం 'రాఖీ'. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు గురు, శుక్రవారాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకోగా.. ఓ ఆసక్తికరమైన ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వాస్తవానికి కొన్నేళ్ల నుంచి కొందరు మహిళలు ప్రకృతిని కాపాడుతున్న 'వృక్షాల'కు, మరికొందరు 'మూగజీవాల'కు రాఖీ కడుతున్నారు. అయితే ఈసారి ఇంకొంచెం కొత్తగా రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ.. అనారోగ్యానికి గురైన చిరుతపులికి రాఖీ కట్టింది. ఆమె చేసిన పని నెటిజన్ల హృదయాలను గెలుచుకోగా.. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద షేర్ చేసిన ఫొటో ప్రకారం.. పింక్ చీర ధరించిన ఓ మహిళ చిరుతపులి ముందరి కాలుకు రాఖీ కట్టింది. అనారోగ్యంతో ఉన్న చిరుతపులిని అటవీ శాఖకు అప్పగించే ముందు సదరు మహిళ రాఖీ కట్టినట్లు నందా వివరించాడు. 'యుగాలుగా భారతదేశంలోని మూగజీవాలు.. మనుషులపై ప్రేమతో సామరస్యంగా అడవిలో జీవిస్తున్నాయి. ఓ మహిళ చిరుతపులికి కట్టిన రాఖీ మనకు అడవిపై అపరిమితమైన ప్రేమను చూపుతుంది' అని నందా ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'ఇది కదా నిస్వార్థ ప్రేమ. అడవులు, వన్యప్రాణులతో మనం సహజీవనం చేయాలి. ఈ ప్రపంచం మానవులకు మాత్రమే కాదు. ఆ దేవుడు అన్ని రకాల జీవాలను సృష్టించాడు. తోటి జీవులకు ప్రేమను పంచాలి. మీ ప్రేమకు ఆ రాఖీనే సాక్ష్యం. మీరూ మాలో చైతన్యాన్ని కలిగించారు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story

Most Viewed