- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Silent Suffering : వర్షం మీకు ఆనందం కావచ్చు.. కానీ వాటిపై కూడా కాస్త జాలి చూపండి!
Silent Suffering : వర్షం మీకు ఆనందం కావచ్చు.. కానీ వాటిపై కూడా కాస్త జాలి చూపండి!

దిశ, ఫీరచ్స్ : వర్షం చూడ్డానికి అందంగా ఉంటుంది. చిరు జల్లులో, జడివానలో కురుస్తుంటే ఇంట్లో కూర్చొని ఆస్వాదించే వారికి అదో ఆనందమే కావచ్చు. కానీ నిలువనీడలేని కమ్యూనిటీ యానిమల్స్(Community Animals) పరిస్థితిని మీరెప్పుడైనా గమనించారా? వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ అవి ఎంత బాధపడతాయో పాపం! పెంపుడు కుక్కలనైతే తీసుకొచ్చి సోఫామీదో, మంచం మీదో కూర్చోబెడతాం. పెంచుకున్న ఆవులకు, బర్లకు, ఇతర జంతువులకు ఏ కొట్టమో, తాత్కాలిక షెడ్డునో నిర్మిస్తాం. వర్షం ధాటినుంచి సంరక్షణకోసం ఆశ్రయం కల్పిస్తాం. కానీ ఏ దిక్కూ లేని వీధి కుక్కలు(Stray dogs), పిల్లులు(cats), దారితప్పి వీధుల్లోనే తిరుగుతూ కనిపించే ఇతర జంతువులే.. వానకు, చలికి తట్టుకోలేక గజ గజ వణుకుతుంటాయి. తట్టుకోలేక ఏ ఇంటి ఆవరణలోకో వెళ్దామని అవి ప్రయత్నిస్తే, ఆ ఇంటి యజమానులో, అక్కడి జనాలో అస్సలు ఊరుకోరు.. మన కుక్క కాదనో, మన పిల్లి కాదనో, మన జంతువు కాదనో గేటు బయటి దాకా తరిమేస్తారు.
మనిషిది జాలి గుండె, దయగల హృదయం అంటుంటారు కదా.. వర్షం పడుతున్నప్పుడు తడిసి ముద్దై, ఎక్కడ ఆశ్రయం పొందాలోనని వెతుకుతున్న కుక్కలు, కోళ్లు, ఆవులు, మేకలు ఇలా ఏవైనా సరే ఇతర జంతువులపై కూడా కాస్త దయ చూపితేనే జీవితానికి నిజమైన సార్థకత చేకూరుతుంది అంటున్నారు జంతు ప్రేమికులు. మీరు వాటికోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే వానలు, వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎవరికీ చెప్పుకోలేక నిశ్శబ్ద బాధను భరించే కమ్యూనిటీ యానిమల్స్‌ను అర్థం చేసుకుంటే చాలు. వాటికోసం ప్రత్యేక షెల్టర్లు, నివాసాలు ఏర్పర్చకపోయినా సరే.. కానీ విశాలమైన మీ హృదయ ద్వారాలను, అలాగే మీ ఇంటి గేట్లను తెరవండి చాలు. వర్షం పడుతున్నప్పుడు అవి లోపలికి వచ్చి మీ ఇంటి ఆవరణలోనో, గోడ పక్కనో, చెట్టుకిందనో కాసేపు తలదాచుకొని తర్వాత వెళ్లిపోతాయి.






