Punch -Kun : కోతి పిల్ల కాదు మన పిల్లలను గుర్తిస్తున్నామా?

by Sujitha Rachapalli |

కోతి పిల్ల బాధను గుర్తించిన మనం.. మన చుట్టూ ఉన్న పిల్లలను గుర్తిస్తున్నామా? బాధను తగ్గించడం పోయి బాధిస్తున్నామా? దిండ్లకు మాత్రమే తెలుసు వారి బాధ.

Punch -Kun :  కోతి పిల్ల కాదు మన పిల్లలను గుర్తిస్తున్నామా?
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో ఓ కోతి పిల్ల వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా హృదయాలను మెలిపెడుతోంది. కంటతడి పెట్టిస్తోంది. కన్నతల్లి తనను యాక్సెప్ట్ చేయకుండా.. దూరం పెట్టడమే ఇందుకు కారణం. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో జూలై 26, 2025న జన్మించింది పంచ్ కున్ అనే స్నో మంకీ. కానీ అది పుట్టిన కాసేపటికే తల్లి దాన్ని వదిలేసింది. దీంతో చేసేదేమీలేక జూ సిబ్బంది ఆ పిల్ల కోతికి బాటిల్‌తో పాలు ఇస్తూ పెంచారు. దానికో పెద్ద స్టఫ్డ్ ఒరాంగుటాన్ బొమ్మను ఇచ్చారు. తల్లి దగ్గరికి తీయట్లేదు కాబట్టి ఆ బొమ్మనే హత్తుకుని పడుకుంటుంది. ఒంటరిగా అనిపించినా.. భయమేసినా.. దానివైపు పరుగెడుతుంది. లేదా దాన్ని తనతో లాక్కెళ్తుంది. అయితే ఈ జనవరిలో దాన్ని 60 కోతులున్న గ్రూప్‌లో చేర్చారు. కానీ తల్లితోసహా మిగతా కోతులన్నీ దాన్ని టార్గెట్ చేశాయి.. కొట్టాయి.. హింసించాయి. అప్పుడు దానికి ఆ బొమ్మనే ఓదార్పునిచ్చింది. ధైర్యాన్ని పంచింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా టీవీ కార్యక్రమాల్లో దీనిపై పెద్ద చర్చ జరిగింది. దయ, సానుభూతి, ధైర్యం గురించి డిస్కషన్స్ పెట్టారు.

మన పిల్లల సంగతేంటి?

అయితే ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఒక చిన్న కోతి తల్లి లేకుండా బొమ్మను హత్తుకుంటుంటే ప్రపంచం ఏడుస్తుంది. సానుభూతి చూపిస్తుంది. కానీ మనుషుల్లో తల్లి నుంచి విడిపోవడం సంగతి ఏంటి? విడాకులు, కస్టడీ, ఉద్యోగం, కుటుంబ గొడవల కారణంగా పిల్లలు తల్లికి దూరం అవుతున్నప్పుడు వారు ఎదుర్కొంటున్న బాధకు సమాధానమేది? దీన్ని ఎవరు గుర్తిస్తారు. ఎవరు గుర్తించరు. నిజానికి తల్లి పిల్లలకు మొదటి భావోద్వేగ ఆధారం. ఆమె స్పర్శ, స్వరం, ఉనికి పిల్లల్లో భద్రత, నమ్మకం, భావోద్వేగ నియంత్రణను ఏర్పరుస్తాయి. అలాంటి తల్లి నుంచి అకస్మాత్తుగా విడిపోతే పిల్లలపై ఆ ప్రభావం ఎంత ఘోరంగా ఉంటుంది? వారి బాధ మనుషులకు కాదు బొమ్మలు, దిండ్లు, స్క్రీన్లకు మాత్రమే తెలుసు. లేదంటే కొందరు చిన్నారులు నిశ్శబ్దాన్నే ప్రత్యామ్నాయంగా చేసుకుని.. పంచ్‌-కున్ మాదిరిగా దీర్ఘకాలిక బాధను అనుభవిస్తారు.

కస్టడీ గొడవలతో బలయ్యేదెవరు?

ఇక కస్టడీ కేసుల్లో తల్లిదండ్రుల గొడవలు చూసి పిల్లలు గిల్టీగా ఫీల్ అవుతారు. భయపడుతారు. కానీ ఇవేవి తల్లిదండ్రులకు, చుట్టాలకు, చట్టాలకు పట్టదు. చుట్టాలు తతంగాన్ని ఎంజాయ్ చేస్తుంటే.. చట్టాలు భావోద్వేగాల గురించి కాకుండా బ్యాటిల్ గురించే ఎక్కువగా మాట్లాడుతుంటాయి. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని ఎంచుకోవడంతో.. మరొకరితో లిమిటెడ్ విజిటింగ్ హవర్స్, సొసైటీ ట్రీట్ చేసే విధానం వారిపై ప్రభావం చూపుతుంది. స్కూల్ ఈవెంట్స్, బెడ్ టైమ్ స్టోరీస్ వీటన్నింటినీ పేరెంట్స్ ఇద్దరితో షేర్ చేసుకోవాలనే వారి ఆశ అలాగే మిగిలిపోతుంది.

Next Story