అవహేళనే ఆభరణం.. వైఫల్యమే పునాది.. ఓ మహిళ సక్సెస్ జర్నీ..!

by Javid Pasha |   (  Updated:2025-11-03 07:38:43  IST  )

అవహేళనే ఆభరణం.. వైఫల్యమే పునాది.. ఓ మహిళ సక్సెస్ జర్నీ..!
X

దిశ, ఫీచర్స్ : పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఎవరైనా ఎదుగుతారు. ఏదైనా సాధిస్తారు. ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఎదురీది దరిచేరే ధైర్యాన్ని ప్రదర్శిస్తారు పలువురు. వీళ్లే అసలైన విజేతలు అంటారు నిపుణులు. ఆ కోవకు చెందిన వ్యక్తే ప్రియా యాదవ్(Priya Yadav). అవమానాలు, అవహేళనలు వాటినే ఎదురైనా ఆభరణాలుగా భావించి, వైఫల్యాల నుంచి సైతం ఎన్నో విషయాలు నేర్చుకుని తన బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంది. అనుకున్నది సాధించి ఎందరికో ప్రేరణగా నిలిచింది.

పేదరికం వెంటాడినా..

మధ్యప్రదేశ్‌లోని ఒక పేద రైతు కుటుంబంలో జన్మించింది ప్రియా యాదవ్. ఆమె తండ్రి 3వ తరగతి, తల్లి ఏడవ తరగతి వరకే చదువుకున్నారు. తామైతే పెద్దగా చదువుకోలేదు.. కానీ తమ కూతుర్ని చేతనైనంత వరకు చదివించాలని భావించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివించారు. అయితే అసలే పేదరికం. పైగా కుటుంబంలో పెద్దగా చదువుకున్న వారు లేకపోవడం వల్ల ప్రియా యాదవ్‌కు సరైన గైడెన్స్ ఇచ్చే వారు కూడా లేరు. పది పాసయ్యాక ఇంకా ఏం చదవాలి? ఏ గ్రూపు తీసుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడింది. సమాజం ఆశించిన మార్గంలో నడవాలని ఇంటర్‌లో సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) ఎంచుకుంది. కానీ పరీక్షల్లో ఫెయిలైంది.

పరీక్షల్లో ఫెయిలై.. అవహేళనల పాలై..

సైన్స్ గ్రూప్ ఎంచుకోవడం, పరీక్షల్లో ఫెయిలవడం ప్రియా యాదవ్‌కు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనేలా చేసింది. బాధగానే ఉన్నా మళ్లీ ప్రయత్నించాలని ఆమె భావించింది. కానీ చుట్టు పక్కల సమాజం ఆమెను అవహేళన చేయడం ప్రారంభించడం మాత్రం తీవ్రంగా కలచి వేసింది. ‘కూటికిలేకుంటే సరి కానీ సైన్స్ గ్రూప్ తీసుకొని ఏదో సాధిద్దామనున్నావు.. ఇప్పుడేమైంది’ అని పలువురు ఆమెను అవహేళన చేసేవారట. ‘ఇక నీ జీవితం అంతే.. ఇంతటితో అయిపోయిట్టే.. చదువు మానేసి బాసండ్లు తోముకో’ అంటూ అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవేవీ ఆమె పెద్దగా పట్టించుకోలేదు. పేరెంట్స్ కూడా తమ కూతురిని చదువులో ప్రోత్సహించారు. ఫెయిలైనప్పుడు ఓదార్చారు. మళ్లీ ప్రయత్నించాలని చెప్పారు. ఇష్టమైన చదువు చదువుకోవాలని సూచించారు తప్ప, ఆమెను ఎన్నడూ ఒక్క మాట అనలేదు. పైగా ఆమె ఏదో ఒకటి సాధిస్తుందన్న నమ్మకాన్ని కూడా వారు కోల్పోలేదు. ప్రియా యాదవ్ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని గట్టిగా డిసైడ్ అయింది.

వైఫల్యాల పునాదిపై.. సక్సెస్ జర్నీ

ఇంకేముంది అవహేళనలను ఆమె ఆభరణాలుగా భావించింది. వైఫల్యాలను సక్సెస్‌ను నిర్మించుకునే పునాదిగా మల్చుకుంది. స్వీయ అవగాహనతో, సొంత ఆలోచనతో, ధైర్యంతో కొత్త లక్ష్యాలు పెట్టుకుంది ప్రయా యాదవ్. ఈసారి తన ఆలోచనకు, బలానికి తగిన మార్గాన్ని(అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్) ఎంచుకుంది. కొన్నేళ్ల కఠిన శ్రమ తర్వాత ఆమె మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) పరీక్షల్లో ఒక్కసారి కాదు, మూడుసార్లు సత్తా చాటింది. 2019లో 19వ ర్యాంక్‌తో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్‌గా, 2020లో 34వ ర్యాంక్‌తో అసిస్టెంట్ కమిషనర్‌గా, 2021లో 6వ ర్యాంక్‌తో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతన్న ప్రియా యాదవ్ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే చదువులకోసం ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థినులకు అండగా నిలుస్తోంది. ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది. మార్కులు మాత్రమే వ్యక్తికి గుర్తింపు కాదని, అవి సామర్థ్యాన్ని కొలవలేవని, వైఫల్యం భవిష్యత్తును నిర్ణయించలేదని నిరూపించిన ప్రియా యాదవ్ జీవితం ప్రస్తుతం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. Link

Next Story