- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాలిక్యులర్ బయాలజీ టు హాలీవుడ్
నటి మోటివేషనల్ జర్నీ.. జాబ్ చేస్తూనే యాక్టింగ్ క్లాసెస్‌కు.. ఫస్ట్ ఆడిషన్‌తోనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌కు ఎంపిక.. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ బిజీ

దిశ, ఫీచర్స్: రోజంతా ఉద్యోగం చేస్తూ.. నైట్ అకడమిక్స్ చదువుతూ కష్టపడి పైకొచ్చినవాళ్లను ఎంతోమందిని చూస్తుంటాం. కానీ వాళ్లలో ఆడవాళ్లుండటం చాలా తక్కువ. కానీ ఒక యువతి ఉంది. పేరు ప్రియా కంసారా. ఇప్పుడామె నటి. ఒకప్పుడు రోజంతా హెల్త్ కమ్యూనికేషన్స్ ఉద్యోగం చేస్తూ.. నైట్‌పూట యాక్టింగ్ నేర్చుకొని నటి అయ్యిందామె.
యాక్టింగ్ వైపు..
ఉత్తర లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌లో పుట్టిన ప్రియా కంసారా భారతీయ కుటుంబానికి చెందిన యువతి. ఇంట్లో రెండు రకాల సినిమాలు చూస్తూ పెరిగిందామె. తల్లి బాలీవుడ్ సినిమాలు చూసేది. వాళ్ల నాన్న జేమ్స్ బాండ్.. మిషన్ ఇంపాసిబుల్.. డై హార్డ్ వంటి యాక్షన్ చిత్రాలు చూసేవాడు. చిన్న వయసులోనే ఈ సినిమాలు చూడడం వల్ల సినిమా ద్వారా వేరే ప్రపంచాల్లోకి తప్పించుకోవచ్చు అని ఆమెకు అర్థమైంది. అది తనకు చాలా స్ఫూర్తినిచ్చి నటన పట్ల ప్రేరేపించింది. పామర్స్ గ్రీన్ హై స్కూల్.. డేమ్ ఆలిస్ ఓవెన్స్ స్కూల్‌లో చదివిన ప్రియా యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో మాలిక్యులర్ బయాలజీలో బీఎస్‌సీ పూర్తి చేసింది. చదువుతూనే ఇంకోపక్కన నాటక క్లబ్స్.. మ్యూజికల్ థియేటర్.. యూనివర్సిటీ షోల్లో నటించేది.
మూడేళ్ల కష్టం..
బ్రిటన్‌లో స్టేజ్.. స్క్రీన్‌పై తనలాంటి వారిని తక్కువగా చూడడం వల్ల దీనినొక సవాలుగా తీసుకుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత బీసీడబ్ల్యూ గ్లోబల్‌లో హెల్త్‌కేర్ కమ్యూనికేషన్స్ ఉద్యోగం చేసింది. పగటిపూట పని.. రాత్రి ఐడెంటిటీ స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో తరగతులు.. ఇలా మూడు సంవత్సరాలు కష్టపడింది. 2021 మార్చి వరకు ఉద్యోగంలోనే కొనసాగింది. కానీ నటనను సవాలుగా తీసుకున్న ఆమె ఎంతోకాలం ఉద్యోగంలో కొనసాగాలనుకోలేదు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆడిషన్స్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. మొదటి ప్రొఫెషనల్ ఆడిషన్‌కు వెళ్లగానే రోల్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘బ్రిడ్జర్టన్’ సీజన్ టూలో మిస్ ఈటన్ పాత్ర. తర్వాత మరో నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘ది బాస్టర్డ్ సన్ అండ్ ది డెవిల్ హిమ్‌సెల్ఫ్’.
ప్రాజెక్ట్ హైల్ మేరీ..
2022లో ‘స్క్రీన్ ఇంటర్నేషనల్’ ఆమెను ‘స్టార్ ఆఫ్ టుమారో’గా ప్రకటించింది. ఆ తర్వాత వచ్చిన ‘పొలైట్ సొసైటీ’ సినిమాలో రియా ఖాన్ పాత్రతో లీడ్ రోల్. నీడా మంజూర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీలో స్టంట్ పెర్ఫార్మర్‌గా మారాలని కలలు కనే యువతి పాత్రలో ప్రియా అద్భుతంగా నటించింది. 2023లో సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘పొలైట్ సొసైటీ’ తర్వాత ఆమె కెరీర్ స్థిరంగా ముందుకు సాగింది. 2025లో బీబీసీ వన్ చారిత్రక డ్రామా ‘డోప్ గర్ల్స్’లో నటించింది. అదే సంవత్సరం ఆపిల్ టీవీ+ సిరీస్ ‘స్టార్ సిటీ’లో చేరింది. 2026లో ‘ప్రాజెక్ట్ హైల్ మేరీ’లో సపోర్టింగ్ రోల్ చేయగా ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 538 మిలియన్ డాలర్ల వసూళ్లు చేసింది.






