స్కై వారియర్స్

by Daayi Srishailam |

సంగారెడ్డి మహిళలకు ప్రధాని ప్రశంసలు

స్కై వారియర్స్
X

వ్యవసాయంలో రైతులకు కూలీల కొరతను అధిగమించేందుకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

ఈ డ్రోన్ ద్వారా రైతులకు సమయం, ఖర్చులు ఆదా అవుతాయి.

గతంలో పంటలకు పిచికారి చేయడానికి రోజంతా గడిపోయేది..

కానీ డ్రోన్ వినియోగం ద్వారా మూడు గంటల్లో ఎకరం పిచికారి చేయవచ్చు.

ఈ మేరకు దేశంలో డ్రోన్ దీదీ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.

దీని ద్వారా మహిళలకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించేందుకు శిక్షణ ఇస్తున్నారు.

ఈ పథకానికి సంగారెడ్డి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.

- దండు ప్రభు

నమో డ్రోన్ దీదీ, కిసాన్ డ్రోన్ ఆపరేటర్ గా ఎస్ హెచ్ జీ మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలోని 10 మండలాల నుంచి 54 మందిని ఎంపిక చేశారు. జిల్లాలోని అందోల్ మండలంలో మార్చి 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణలో ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులను ఖచ్చితంగా వర్తింపజేయడం, సమాన పంపిణీ, సరైన వినియోగ నైపుణ్యాలను నేర్పించారు.


24 యూనిట్స్ మంజూరు

డ్రోన్ దీదీ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు ఒక్కో గ్రూపుగా ఉండే మహిళలకు ఒక యూనిట్ చొప్పున జిల్లాకు 24 యూనిట్లు మంజూరు చేశారు. మొదటి విడతలో అందించేందుకు ఆరు యూనిట్లను జూన్ నెలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా అందించనున్నారు. ఒక్కో యూనిట్ విలువ సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది.

ప్రధాని ప్రశంసలు

మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గ్రామీణ మహిళలు డ్రోన్ ద్వారా వ్యవసాయ పనులు చేపట్టి నూతన విప్లవానికి నాంది పలికారని ప్రశంసించారు. గ్రామీణ మహిళలు డ్రోన్ దీదీలుగా మారి వ్యవసాయంలో నూతన విప్లవాన్ని తీసుకువస్తున్నారని, తెలంగాణాలోని సంగారెడ్డి మహిళలు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆ మహిళలు డ్రోన్ ల సహాయంతో 50 ఎకరాల విస్తీర్ణంలో మందుల పిచికారీ చేశారని చెప్పారు. వారు డ్రోన్ ఆపరేటర్లుగానే కాక స్కై వారియర్స్ గా గుర్తింపు పొందారని అభినందించారు.

80 శాతం సబ్సిడీతో డ్రోన్: భవానీ, ఇసోజిపేట, పుల్కల్ మండలం


డ్రోన్ వాడకంలో 9 రోజులు శిక్షణ ఇచ్చారు. పంటలకు ఎరువు మందుల వాడకం, స్ప్రే చేసే విధానాన్ని నేర్పించారు. పుల్కల్ మండలం నుంచి నేను ఎంపిక అయ్యాను. డ్రోన్ రెండో విడత శిక్షణ బెంగుళూరులో ఇస్తామన్నారు. డ్రోన్ ఖరీదు రూ.10 లక్షల వరకు ఉంటుంది. మాకు 80 శాతం సబ్సిడీ అందిస్తామన్నారు. డ్రోన్ వచ్చేలోపు శిక్షణ పూర్తి చేసుకుని సన్నద్ధంగా ఉన్నాం.


రెండో ట్రైనింగ్ కు రెడీ: ఎన్.లక్ష్మీ, అన్నాసాగర్, అందోల్ మండలం


డ్రోన్ వినియోగంపై మొదటి విడత శిక్షణను పూర్తి చేసుకున్నాం. రెండో విడత శిక్షణ బెంగుళూరులో ఉంటుందని చెప్పారు. ఆ శిక్షణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. డ్రోన్ తో పంటలకు స్ప్రే చేసేందుకు ఎకరానికి సుమారు ఐదు నుంచి పది నిమిషాల్లో పూర్తవుతుంది. దీని వల్ల రైతులకు సమయం ఆదా అవుతుంది. బెంగుళూరులో శిక్షణ పొందిన తరువాత లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ తీసుకున్న తరువాత ఆ కంపెనీ నుంచి డ్రోన్ అందజేస్తారు.


Next Story