అమెరికాలో చదివి.. మఖానాతో మస్త్ బిజినెస్.!

by Daayi Srishailam |

రైతులకు శ్రమకు తగిన ధర అందేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది

అమెరికాలో చదివి.. మఖానాతో మస్త్ బిజినెస్.!
X

దిశ, ఫీచర్స్: బీహార్‌లోని దర్భాంగాలో 2020లో ప్రారంభమైన "పర్ల్ మిథిలా మఖానా" సరికొత్త బ్రాండ్‌గా మారుతోంది. ఈ బ్రాండ్ ఓనర్ "ప్రతిభా బొండియా ఖేరియా". కస్టమర్లకు నాణ్యమైన మఖానా అందిస్తూ "దర్భాంగా" రైతులకు శ్రమకు తగిన ధర అందేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రతిభ.

సరికొత్త బ్రాండ్‌తో

"మఖానా" ప్రిక్లీ వాటర్ లిలీ అనే నీటి కలుపు మొక్క గింజలు. బీహార్‌లో మఖానా కేవలం స్నాక్ కాదు.. కుటుంబంలో ఒక భాగం. 18వ శతాబ్దంలో దర్భాంగా, మధుబనీ ప్రాంతాల్లోని మిథిలాంచల్‌లో రాజుల పాలనలో మఖానా సాగు ప్రారంభమైంది. వీటిని ‘బ్లాక్ డైమండ్’ అనేవారు. 2022లో మిథిలాంచల్ మఖానా ఉత్పాదక సంఘానికి జీఐ ట్యాగ్ లభించింది. 2018లో దర్భాంగాకు కోడలిగా వచ్చిన ప్రతిభా, మఖానా సాంస్కృతిక ప్రాముఖ్యతను గమనించింది. దేశం మొత్తంలో బీహార్ నుంచే 85 శాతం మఖానా ఉత్పత్తి అవుతుందని తెలుసుకున్న ఆమె, ఒక సరికొత్త మఖానా బ్రాండ్‌ను నిర్మించాలనుకుంది.

ఫార్మింగ్‌లో శిక్షణ

అమెరికాలో అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ, కాలిఫోర్నియాలోని సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాల్లో ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్న ప్రతిభ ఇండియాకు వచ్చి మఖానాపై దృష్టిపెట్టింది. 2010 నుంచి 2018 వరకు ప్రతిభ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, రైతులతో మాట్లాడింది. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నాచురల్ ఫార్మింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఈ అనుభవాలు రైతుల జీవన స్థితిగతులను, వ్యవసాయంలోని లోటుపాట్లను అర్థం చేసుకోవడంలో సహాయపడి రైతులకు మెరుగైన జీవనోపాధిని అందించాలనే లక్ష్యం పెట్టుకుంది.

30 శాతం పెరిగింది

మఖానా సేకరణ సులభమైందేం కాదు. బీహార్‌లోని బురద చెరువుల్లో 8 అడుగుల లోతు వరకు డైవ్ చేసి, నీటి కలుపు మొక్కల గుండా మఖానా గింజలను సేకరించాలి. ఈ కష్టానికి తగిన ధర లభించడం లేదని గమనించిన ప్రతిభా, రైతులకు న్యాయమైన ధర అందేలా తన బ్రాండ్‌ను రూపొందించింది. రైతులతో పాటు చెరువుల్లోకి దిగి, మఖానా సేకరణ ప్రక్రియను అర్థం చేసుకుంది. ఈ ప్రయత్నంలో 500 మంది రైతులు భాగస్వాములయ్యారు. గతంలో మధ్యవర్తుల వల్ల తక్కువ ధర పొందేవారు. కానీ, పర్ల్ మిథిలా మఖానాతో చేరిన తర్వాత, వారి ఆదాయం 30 శాతం పెరిగింది.

సొంత బ్రాండ్లకూ సాయం

ఆగస్టు- నవంబర్ మధ్యలో గింజలను సేకరించి, ఎండబెట్టి, జల్లించి, పరిమాణాల వారీగా విభజిస్తారు. తర్వాత గింజలను టెంపరింగ్ చేసి, నల్లని పొట్టు నుంచి తెల్లని కెర్నల్‌ను వేరు చేస్తారు. ఈ బ్రాండ్‌లో అత్యంత ఆదరణ పొందిన ఉత్పత్తి రసగుల్లా మఖానా. ఇది 22 మి.మీ. పరిమాణంలో ఉంటుంది. తల్లులకు, పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ ఇది. సొంత బ్రాండ్‌లను సృష్టించడంలో రైతులకు సహాయం చేస్తోంది ప్రతిభ. వారి పిల్లల విద్య, వివాహాలకు సహాయం చేస్తోంది. ఈ మఖానా కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఇనుము, జింక్ వంటి పోషకాలకు పెట్టింది పేరు.

Next Story