థైరాయిడ్‌ అసమతుల్యత.. ఈ అలవాట్లతో పరార్!

by Javid Pasha |   (  Updated:2026-04-23 10:36:33  IST  )

హైపోథైరాయిడిజం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి, మలబద్ధకం, బ్లోటింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

థైరాయిడ్‌ అసమతుల్యత.. ఈ అలవాట్లతో పరార్!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఒకటి. ముఖ్యంగా స్త్రీలలో మరింత ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల వారు ఒత్తిడి, సంతానలేమి, అలసట, పలు ఇతర అనారోగ్యాలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి సమతుల్యంగా ఉంచుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ఆహారపు అలవాట్లలో, జీవన శైలిలో మార్పులు, చికిత్సలు కూడా అవసరమని చెబుతున్నారు. అయితే ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని రోజువారీ అలవాట్లు థైరాయిడ్ అసమతుల్యతను దూరం చేయడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్ రకాలు - సమస్యలు

థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత తరచుగా మలబద్ధకం లేదా డయేరియా వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. దీంతోపాటు దీర్ఘకాలిక ఒత్తిడి, ఇర్రెగ్యులర్ సర్కాడియన్ రిథం (Irregular Circadian Rhythm)తో ఇది ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం (తక్కువ థైరాయిడ్)లో జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి మలబద్ధకం, బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. ఇక హైపర్ థైరాయిడిజం (ఎక్కువ థైరాయిడ్)లో జీర్ణం వేగంగా జరిగి డయేరియా ఏర్పడవచ్చు. ఇర్రెగ్యులర్ స్లీప్, షిఫ్ట్ వర్క్ లేదా స్ట్రెస్ వల్ల సర్కాడియన్ రిథమ్ దెబ్బతిని TSH, T3, T4 హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. బలహీనత, మూడ్ స్వింగ్స్, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తుంది. థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చిన్న, స్థిరమైన అలవాట్లు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి అంటున్నారు నిపుణులు.

ఏం చేయాలి?

*ఉదయం లేవగానే శరీరానికి సూర్యరశ్మి తీసుకోవడం.. స్థిరమైన నిద్ర షెడ్యూల్.. (రాత్రి 10 గంటలకు ముందు పడుకోవడం ఉదయం సూర్యోదయానికి ముందు నిద్రలేవడం చేయాలి) బ్రీతింగ్ వ్యాయామాలు, మెడిటేషన్ వంటి ఒత్తిడి నిర్వహణ వ్యాయామాలు రోజూ చేయాలి

*సమయానికి ఆహారం తీసుకోవడం, ప్రోటీన్ ఉండే ఆహారాలు, అలాగే అవకాడో, నట్స్, ఆకు కూరలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉన్న సహజ ఆహారాలు తీసుకోవడం వంటివి థైరాయిడ్ సమతుల్యతకు సహాయపడతాయి. సర్వాంగాసనం, మత్స్యాసనం వంటి యోగాసనాలు, తేలికపాటి ఇతర వ్యాయామాలు కూడా థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరచి, హార్మోన్ సమతుల్యతను మెరుగు పరుస్తాయి.

*శరీర తత్వాన్ని బట్టి గోరువెచ్చని నీరు తాగడం, నూనెతో బాడీ మసాజ్, అశ్వగంధ వంటి మూలికలు కూడా కొంత వరకు మేలు చేస్తాయి. దీంతోపాటు అధిక చక్కెరలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడం వంటి మార్పులు థైరాయిడ్ సమస్యను దూరం చేయడంలో, దానిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అయితే ఇదంతా ఆయుర్వేదిక్ నిపుణుల ప్రకారమే.. ఆధునిక వైద్యం ప్రకారమైతే థైరాయిడ్ సమస్యలు ఉంటే.. TSH, T3, T4 టెస్టులు చేయించుకొని, డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇది వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story