- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Long life : నిండు నూరేళ్లు..! అక్కడంతా దీర్ఘాయుష్కులే..
Long life : నిండు నూరేళ్లు..! అక్కడంతా దీర్ఘాయుష్కులే..

దిశ, ఫీచర్స్ : మనిషి ఆయుఃప్రమాణం వందేళ్లుగా చెప్తారు. కొన్ని దశాబ్దాలక్రింత చాలా మంది 90 నుంచి వందేళ్ల వరకు బతికేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మనిషి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయ్. 60 ఏండ్ల తర్వాత ఎంతకాలం బతుకుతారనే గ్యారెంటీ ఎవరికీ లేదిప్పుడు. అంతకంటే చిన్న వయస్సులో కూడా స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి అనారోగ్యాల కారణంగా ఎంతోమంది చనిపోతున్నారు. ఫైనల్లీ మనిషి ఆయుష్షు వందేళ్లు అని చెప్పలేం.. కానీ ఒకచోట మాత్రం ఇప్పటికీ ఆ పరిస్థితి ఉంది. అక్కడి ప్రజలంతా 90 నుంచి వందేళ్లు, అంతకంటే ఎక్కువకాలం కూడా బతుకుతున్నారు. ఇంతకీ అదెక్కడ? వారి దీర్ఘాయువు వెనుక రహస్యమేంటి?
90 నుంచి 110 ఏండ్ల వరకు
అది జపాన్ దేశంలోని ఒకినావా ద్వీపం. ఇది ప్రజలు ఎక్కువకాలం జీవించే అవకాశం ఉన్న బ్లూ జోన్ పరిధిలోకి వస్తుంది. కాణం ఏంటంటే.. ఇక్కడి ప్రజలు ప్రపంచ సగటుకంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. దాదాపు ప్రతి ఒక్కరూ 90 నుంచి వందేళ్లు గ్యారెంటీ బతుకుతారట. అక్కడక్కడా 110 ఏండ్ల వరకూ జీవిస్తున్నవారు కూడా ఇక్కడ ఉన్నారు. అదెలా సాధ్యమంటే.. సంతోషంగా జీవించడం, సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు, ఆరోగ్యకరమైన కార్యలాపాలు ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఒకినావాన్స్ దీర్ఘాయువు వెనుక మరో ప్రత్యేక కారణం ‘మోయి’ అని పిలువబడే వారి పురాతన సంప్రదాయ ఆచార వ్యవహారం కూడా ఉంది అంటున్నారు.
కారణం ఇదే
‘మోయి’ ఆచారం ప్రకారం ఒకినావాలోని ప్రజలు తరచుగా ఒకచోటకు చేరడం, విరాళాలు ఇచ్చిపుచ్చుకోవడం, సమావేశాలు, వేడుకలు నిర్వహించడం, కలిసి మెలిసి జీవించడం, ఆపద సమయాల్లో ఒకరికొకరు తోడుగా నిలువడం వంటి లోతైన సామాజిక సంబంధాలను కలిగి ఉంటారు. ఏ సమస్య వచ్చినా అది ఒక వ్యక్తికి సంబంధించింది అని వదిలేయరు. అందరూ కలిసి దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సమ్యల్లో ఉన్న వ్యక్తులకు మేమున్నామనే భరోసా లభిస్తుంది. దీంతో అనారోగ్యాలు, ఆపదలు వంటి సందర్భాల్లోనూ ఒకనావాలోని ప్రజలు దిగులు చెందరు. ఇలాంటి ఆచార వ్యవహారాలే వీరిని సంతోషంగా ఉంచుతున్నాయి. అన్నివేళల్లో భావోద్వేగ మద్దతు, పరస్పర ఆర్థిక సహాయం వంటివి ఆనందాన్ని రెట్టింపు చేస్తు్న్నాయి. ఇవే వారి ఆరోగ్యానికి, దీర్ఘాయుష్షుకు కారణం అవుతున్నాయి. మరో విషయం ఏంటంటే.. టెక్నాలజీ మోజులో పడి ఇక్కడి ప్రజలు కొట్టుకుపోవడం లేదు. మానవ సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తారు.
ఆహారపు అలవాట్లు, జీవనశైలి
సంప్రదాయ ఒకినావాన్ ఆహారంలో ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాలు, సీ ఫుడ్ అండ్ సోయా ఉత్పత్తులు ఉంటాయి. ఇవి కేలరీలు, చక్కెర స్థాయిలు, సంతృప్త కొవ్వులను తక్కువ స్థాయిలో కలిగి ఉంటాయి. దీంతోపాటు రంగు రంగుల కూరగాయలు, పండ్లు తింటారు. జీవన శైలి విషయానికి వస్తే ఒకినావాన్స్ చురుకైన జీవనశైలిని కలిగి ఉంటారు. మార్షల్ ఆర్ట్స్, గార్డెనింగ్, నడక వంటి సాధారణ శారీరక శ్రమలో తరచుగా పాల్గొంటారు. మెడిటేషన్, యోగా, ఎక్కువగా ప్రకృతి ఆధారిత గ్రామీణ జీవనం వంటివి వీరి దీర్ఘాయువుకు కారణం అవుతున్నాయి. దీంతోపాటు లోతైన సామాజిక సంబంధాలు వీరి ఆయుష్షును పెంచుతున్నాయి. వీరి దీర్ఘాయువు వెనుక జెనెటిక్ రీజన్స్ కూడా ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తు్న్నారు.






