- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఫీచర్స్: మన మూలం మర్చిపోవద్దంటారు పెద్దవాళ్లు. మూలం అంటే ఇక్కడ మన అమ్మ, నాయిన, కుటుంబ నేపథ్యం అన్నమాట. ఇయాల రేపు పోరగాళ్లకు తాత, నాయనమ్మ పేర్లే యాదికుంటలేవు. ఈ పరిస్థితిని ఎప్పుడో ఊహించి పెద్దలను తలుచుకోవడానికి "పెద్దలకిచ్చుడు" అనే సంప్రదాయాన్ని పెట్టారు. పెద్దలకిచ్చుడంటే పితృదేవతల నామ స్మరణ. వాళ్ల యాదిలోకి వెళ్లి తలుచుకోవడం.
బియ్యం ఇస్తారు..
పెత్తరమాస నాడు పితృదేవతలను తలుచుకొని వారి పేరుమీద తర్పణాలు ఇస్తారు. అప్పటికీ ఇప్పటికీ దేంట్లో పెద్దగా మార్పు ఏం లేదు. మనం ఎంత ఎదిగినా.. ఎక్కడున్నా మన జన్మకు కారణమైన పెద్దలను గుర్తుంచుకోవాలనేది పెత్తరమాస ఉద్దేశం. సంస్కారం, సంస్కతికి కూడా వాళ్లే కారణం. మూలం వాళ్లే అని తెలిసినప్పుడు వాళ్లనెలా మర్చిపోతాం.? అలా మర్చిపోకుండా తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని తర్పణాలు ఇచ్చే సంప్రదాయమే ఇది. పిండ ప్రదానం లాంటివి ఆచారం లేనివాళ్లు పంతులును తీసుకొచ్చి పెద్దల పేరుమీద బియ్యం ఇస్తుంటారు. బియ్యం, కూరగాయలు వాళ్లకు సమర్పించి స్మరించుకుంటారు. వాళ్లు ఎక్కడున్నా మన మీదనే వాళ్లకు ప్రేమ ఉంటుందని జనాల నమ్మకం.
శాపం పెడతారని..
పితృ దేవతలు పెత్తరమాస నాడు మన ఇంటి ముందుకు వస్తారని నమ్మకం. ఇల్లు చొచ్చుకొని వచ్చిన వారికి ఆ రోజునాడు శ్రాధ్దకర్మలు చెయ్యకపోతే దీవించడానికి బదులు శపించి వెళ్తారని అంటుంటారు. పెద్దలు అలా చేయొద్దంటే, ముఖ్యంగా వారికి మోక్షప్రాప్తి కలగాలంటే.. వాళ్లు భూమ్మీదికి వచ్చి మనల్ని ఆశీర్వదించాలంటే అన్నాన్ని అందించాలి. పితృదేవతలను సంతోష పెడితే మన పిల్లలకు ఆయుష్షు పెరుగుతుందంటారు. ఇంకా చదువు, ధనం, సంతానం ప్రాప్తిస్తుందని చెప్తారు. బియ్యం ఇవ్వడం, అన్నం సమర్పించడంలో నువ్వులు, గూడమిశ్రిత సమర్పిస్తే ఆ దానం అక్షయమవుతుందంటారు.
ఫొటోలకు బొట్లు..
కొందరు పెత్తరమాస నాడు దాన ధర్మాలు చేస్తారు. కొందరు పెద్ద మనుషులకు ఇష్టమైన మాంసాహారం, మద్యపానం, పిండి వంటలు, పండ్లు, ఫలాలు నైవేద్యంగా పెడతారు. పెత్తరమాస నాడు ఇల్లు ఇల్లు శుద్ధి చేసుకొని అందరూ స్నానాలు చేస్తారు. ఇంటి మధ్యలో పసుపుతో అలికి ముగ్గు వేసి, పీట వేసి దానిపై పెద్దల ఫొటో లేదా మనం నిత్యం వాడే అద్దాన్ని పెడతారు. ఫోటోకు 3 బొట్లు పెట్టీ తులసి నీళ్లు, పండ్లు, బట్టలు, వంటలు, దీపం పెడతారు. అన్నీ సమర్పించిన తర్వాత ఇంటి పెద్దమనిషి కల్లు సాకపెడతాడు. తర్వాత ఇంటిల్లిపాది మొక్కుతారు. ఇదే కదా అసలైన స్మరణ, పెద్దలను తలుచుకునే జ్ఞాపకం అంటే.






