హైదరాబాద్ యువతి ఆవిష్కరణ.. 7 రోజుల్లో చెత్తను ఎరువుగా మార్చే కంపోస్టర్.!

by Daayi Srishailam |

ఏడు రోజుల్లోనే ఎరువును మార్చే కంపోస్టర్‌ను తయారుచేసింది

హైదరాబాద్ యువతి ఆవిష్కరణ.. 7 రోజుల్లో చెత్తను ఎరువుగా మార్చే కంపోస్టర్.!
X

దిశ, ఫీచర్స్: కూరగాయల తొక్కలు, మిగిలిన అన్నం, చపాతీ వంటి మిగిలితే ఏం చేస్తాం.? అమాంతం తీసి చెత్తబుట్టలో పడేస్తాం. చెత్త బండి వచ్చినప్పుడు కవర్లో చుట్టేసి దాంట్లో వేసేసి హమ్మయ్యా అని చేతులు దులుపుకుంటాం. కానీ.. దానివల్ల మనకు వచ్చేదేముంది.? ఏం లేదు కదా.? ఇలాంటి చెత్తను డంప్ చేసి కేవలం ఏడు రోజుల్లోనే ఎరువును మార్చే కంపోస్టర్‌ను తయారుచేసింది హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువతి పావని లొల్లా.

వాప్రా హోం కంపోస్టర్..

పావని.. సేంద్రియ చెత్తను ఒక సమస్యగా కాకుండా ఆవిష్కరణకు ఒక అవకాశంగా భావించింది. ఆ ఆలోచనతో 2020లో ఒక కంపోస్టర్‌ను రూపొందించింది. దానిపేరు వాప్రా హోం కంపోస్టర్. ఇది సులభమైంది. ముఖ్యంగా దీన్నుంచి ఎలాంటి దుర్వాసన రాదు. చాలా వేగంగా కంపోస్టింగ్ చేసే అవకాశం ఉంది. టెర్రాస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్ ఉండేవారికి ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే ఇది ఉండటం వల్ల గార్డెనింగ్ కోసం వేలకు వేలు పెట్టి సేంద్రియ ఎరువులు కొనుక్కోవడం తగ్గుతుంది. చెత్త డంపింగ్‌ను తగ్గించి పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపుతుంది. మీథేన్ గ్యాస్ ఉద్గారాలను తగ్గిస్తుంది.

ప్రజలకు అర్థమయ్యేలా..

బాల్కనీలకు సరిపడేలా రూపొందించిన ఈ పోర్టబుల్ కంపోస్టర్‌ను చెత్త బుట్టలా ఎక్కడైనా ఉంచవచ్చు. హైదరాబాద్‌లోని విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు పావని ‘ఈకో క్లబ్’ అనే విద్యార్థి ఫోరమ్‌లో భాగమైంది. ఈ క్లబ్ పర్యావరణ అనుకూల పద్ధతులపై అవగాహన కల్పించేది. ప్రాజెక్ట్‌లో భాగంగా పావని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేయడం చూసింది. ఇలా చేయొద్దని అవగాహన కల్పించింది. ఎలాగూ భూమిలో కలిసిపోయేదే కదా దాన్ని ఎందుకు ఎరువుగా మార్చుకోకూడదు అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పింది.

ఫ్యూచర్ స్టెప్స్..

ప్రాజెక్టు అయిపోయాక అందరూ దాని గురించి మర్చిపోయారు. కానీ పావని మాత్రం ఆ సమస్యకొక పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించింది. ఇంట్లోనే చెత్తను వేరుచేసి డంప్ చేసే మెషిన్‌ను ఎందుకు తయారు చేయకూడదు అనుకుంది. ఫైనలియర్ అయిపోయేసరికి పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకొని 2020లో వాప్రా హోం కంపోస్టర్‌ను రూపొందించింది. అదే సంవత్సరం తన ఫ్రెండ్స్ మహేష్, సిద్ధేష్‌తో కలిసి ‘ఫ్యూచర్ స్టెప్స్’ను స్థాపించింది. దీని ద్వారానే హోం కంపోస్టర్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంది.

60 రోజుల్లో అయ్యేదాన్ని..

పావని తయారుచేసిన హోమ్ కంపోస్టింగ్ కిట్ రోజుకు ఒక కిలో సేంద్రియ చెత్తను ఎరువుగా మారుస్తుంది. దీని ధర రూ.3,500. కంపోస్టర్‌తో పాటు గ్రీన్ మిక్స్ పౌడర్‌ వస్తుంది. ఈ కిట్‌లో రోటేటింగ్ కంపోస్టర్, 2 కేజీల గ్రీన్ మిక్స్ పౌడర్ ప్యాక్ ఉంటాయి. మొదటి రోజు కంపోస్టర్‌లో పూర్తి గ్రీన్ మిక్స్ ప్యాక్‌ను జోడించి 400 మిల్లీ లీటర్ల నీరు పోసి చేత్తో కలపాలి. ఆ తర్వాత పండ్ల తొక్కలు, మిగిలిన అన్నం, రొట్టి వంటి ఏ రకమైన కిచెన్ చెత్తనైనా వేయొచ్చు. తర్వాత మూత పెట్టి కంపోస్టర్‌ను ఐదు సార్లు తిప్పాలి. సాధారణ కంపోస్టింగ్ ప్రక్రియ 45-60 రోజులు పడుతుంది. కానీ ఇది కేవలం ఏడు రోజుల్లోనే చేసేస్తుంది.

పర్యావరణ పరిరక్షణలో..

ఒక నెలలో ఈ మెషిన్ కనీసం 30 కేజీల వంటగది చెత్తను ఎరువుగా మారుస్తుంది. ఇప్పటివరకు ఫ్యూచర్ స్టెప్స్ తెలంగాణ, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, కర్ణాటకల్లో 6000కు పైగా కంపోస్టింగ్ కిట్‌లు అమ్మింది. వాప్రా హోమ్ కంపోస్టింగ్ కిట్ సామాన్య ప్రజలకు కంపోస్టింగ్‌ను సరళమైన ప్రక్రియగా మారుస్తుంది. ఇది కేవలం ఎరువు తయారీకే కాకుండా.. పర్యావరణాన్ని కాపాడే జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. సేంద్రియ పదార్థాలను సహజంగా కుళ్లబెట్టి, మట్టిని సారవంతం చేయడానికి.. ఆరోగ్యంగా ఉంచడానికి వాప్రా హోం కంపోస్టర్ ఉపయోగపడుతుంది.

Next Story