అసమానతలను పెంచి పోషిస్తున్న సంప్రదాయాలు..

by Mallepaka Hamsa |   (  Updated:2023-01-13 14:30:44  IST  )

'ఏమ్మా.. కోడలు పిల్ల.. అందరి ముందు కుర్చీపై కూర్చుంటావా?' అని అత్తమ్మ తిట్లు ఆరగించడం..

అసమానతలను పెంచి పోషిస్తున్న సంప్రదాయాలు..
X

దిశ, ఫీచర్స్: 'ఏమ్మా.. కోడలు పిల్ల.. అందరి ముందు కుర్చీపై కూర్చుంటావా?' అని అత్తమ్మ తిట్లు ఆరగించడం.. 'బావ ముందే మరదలు కాలు మీద కాలేసుకుని రాణిలాగా కూర్చుంటుందా' అని కొత్త అల్లుడు అలిగి వెళ్లిపోవడం.. 'అల్లుడు ఉన్న ప్రాంతంలోని ఛాయల్లో కూడా బిడ్డను ఇచ్చిన అత్త ఉండకూడదు' అని ఆ దరిదాపుల్లోకి వెళ్లకపోవడం.. మన డైలీ లైఫ్‌లో చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే 'రాజస్థాన్‌లోని బన్‌స్వారా జిల్లాలో మహిళలు నేలపై కూర్చోవాలి.. పురుషులు కుర్చీలు, మంచాలపైన ఆసీనులు అవ్వాలి' అనే వీడియో వైరల్ కాగా. ఈ పితృస్వామ్య విధానపు మరో మూసధోరణిపై చర్చ వైరల్ అవుతోంది. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న మహిళలు, చిన్న పిల్లలు.. ఇలా అమ్మాయి అయితే చాలు నేలకు అంకితం అవ్వాల్సి్ందే. ఒకవేళ కాదు కూడదు అంటే తప్పుకు శిక్షను అనుభవించాల్సిందే.

మొత్తానికి ఈ వీడియో సమాజంలో పితృస్వామ్యం ఎంత గాఢంగా నాటుకుపోయిందో తెలిపేందుకు నిదర్శనం కాగా. వీరిలో కొంత మంది మహిళలు ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌పై క్షణం కూడా కూర్చునేందుకు అభ్యంతరం చెప్పడం నిజంగా ఆశ్చర్యమేస్తోంది. నేటి ప్రపంచంలో స్త్రీలు పురుషులతో సమానంగా ఉన్నత శిఖిరాలను అధిరోహిస్తున్నారు. తక్కువ ఎక్కువ తేడా వస్తే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటికీ పురుషుల కంటే తాము తక్కువ అనే నమ్మే మహిళలు ఉండటం నిజంగా నిరుత్సాహాన్ని కలిగించే విషయమే. ఇప్పటికీ చాలా పల్లెటూళ్లో ఇలాంటి సందర్భాలు చూస్తూనే ఉంటాం. మహిళలు, బాలికలు తమ కుటుంబంలోని మగవాళ్లు ఉన్నప్పుడు నేల మీద కూర్చోవడం గమనిస్తుంటాం. ఇంట్లో సోఫా, కుర్చీ, మంచం వంటి సౌకర్యాలున్నా వాటిపై కూర్చుంటామని బాలికలు ఏనాడూ తమ కుటుంబసభ్యులను అడగరు. కిందనే, నేలపైనే కూర్చుంటారు. పురుషులు లేనప్పుడు మాత్రమే పైన కూర్చుంటారు.

కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పురుషులు ఎప్పుడైతే కుటుంబ యజమానులుగా చలామణి అయ్యే పరిస్థితులు వచ్చాయో అప్పుడే ఈ పరిస్థితికి బీజాలు పడ్డాయని చెప్పవచ్చు. పురుషుడు బయట సంపాదించడానికి, పనికోసం వెళ్లడం, మహిళ ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని చూసుకోవడం అనేవి స్ర్తీ, పురుషుల బాధ్యతగా పరుషాధిక్య సమాజం నిర్ణయించింది. నేడు లింగ అసమాతకు కారణం కూడా ఇదే. పురుషుడు సంపాదించేవాడు.. కుటుంబాన్ని పోషించేవాడు.. మహిళలను రక్షించేవాడు.. అనే బలమైన భావజాలం సమాజంలో వ్యాప్తి చెందింది. దీంతో ఆటోమేటిక్‌గా అన్ని విషయాల్లోను న్యాయనిర్ణేతగా పురుషుడే మారిపోయాడు. మహిళలు పురుషుడిపై ఆధారపడి జీవించే పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే పితృస్వామ్య భావజాలం మహిళలను బానిసలుగా, పురుషుడికి అణగి మణిగి ఉండేలా మార్చింది. నేటికీ ఆ ప్రభావం కొనసాగుతోంది.

మగాళ్లే కాదు మహిళలు విలన్‌లే..

అంతెందుకు చాలా సినిమాలు, పాత ఫొటోల్లో ఫ్యామిలీ ఫొటోస్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. అందులో ఒక పురుషుడు కాలుమీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చొని ఉంటే.. అతని కాళ్లకు ఎదురుగా ఒక మహిళ నిలబడి ఉంది. అతను కుటుంబాన్ని పోషించే పెద్ద ఆయన అయితే.. ఆ కాళ్ల దగ్గర నిల్చున్న మహిళ అతని భార్య. దీని గురించి ఓ ముసలవ్వను అడిగితే.. 'అదెలా కుదురుతుంది. నేనెప్పుడూ మా అమ్మగాని, అమ్మమ్మగాని పురుషుల ఎదుట కూర్చోవడం చూడలేదు. చిన్నప్పుడు నేను, నా అక్కాచెల్లెళ్లు కూడా అలా చేయలేదు. మా నాన్న ఎదుట ఎప్పుడూ కుర్చీలో కూర్చోలేదు' అని తమ అనుభవాన్ని చెప్పుకొచ్చారు. అంతెందుకు ఇప్పుడు కూడా చాలామంది బాలికల్లో బాల్యదశ నుంచే తాము పురుషులకంటే తక్కువ స్థాయి అని.. వారి ఎదుట, వారితో సమానంగా కుర్చీపై కూర్చోవడం తప్పు అనే భావనను నూరిపోస్తున్నారు పెద్దలు. కేవలం పురుషులకు భయపడి మాత్రమే మహిళలు కుర్చీమీద కూర్చోవడం లేదని చెప్పే కంటే తరతరాలుగా వస్తున్న పితృస్వామ్య విధానమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే అలా పురుషుల ఎదుట మహిళ చెయిర్‌పై కూర్చోవడం అనేది కేవలం పురుషుల తప్పు కాదు సాటి మహిళలు కూడా తమ తర్వాతి తరాలకు అదే చెప్తున్నారు. ఒక వేళ కూర్చుంటే.. సాటి మహిళలే మగాళ్ల ముందు అలా కూర్చోవడం ఏమిటని హెచ్చరించడమో, వారించడమో చేస్తుంటారు. అంటే ఎంత బలంగా లింగ అసమానత భావజాలం నాటుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

పురుషాధిక్య సమాజంలో ఇక అంతేనా..

మన వ్యవస్థలో ఇప్పటికీ మెజార్టీ భావజాలం ఇదే. వయస్సులో చిన్న వాడైనా సరే పురుషుడు కుటుంబానికి పెద్ద. కుటుంబ విషయాల్లో మహిళలతో పోల్చినప్పుడు అన్ని విషయాల్లో పురుషుడే న్యాయ నిర్ణేత. కుటుంబ వ్యవహారాలు చూసుకునే శక్తి, సామర్థ్యాలు మహిళలకు ఉన్నప్పటికీ కుదరదు. పురుషుడే సర్వస్వం, సర్వాధికారి, పెత్తనం చేసేది అతనే. అంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పురుషుడు స్ర్తీని డామినేట్ చేసే అధికారాన్ని కలిగి ఉన్నాడని.. మనం అనుకోవడమే కాదు.. మన సమాజం ఒప్పుకుంటోంది కూడా. ఇది గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కొనసాగుతున్నదని చాలా మంది అనుకుంటారు కానీ పట్టణాల్లోనూ లింగ అసమానత, పురుషాధిక్యత, పితృస్వామిక భావజాలం తక్కువేం లేదు. పట్టణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజల్లో నేటికీ మతపరమైన ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతుండటం ఆధునిక సమాజానికి సిగ్గు చేటని పలువురు సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.

Next Story