- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లల్ని చంపుకోవడమేంటయ్యా దరిద్రంగా.?
పోటీ పేరుతో ఉసిగొల్పి ఉసురు తీయకండి ప్లీజ్.!

డియర్ పేరెంట్స్..
సత్నారి సైనిక్ స్కూల్లో చేర్పించిండు..
ఇస్తారి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తుండు..
అని ఆగం కాకండి.
మీ స్థోమత తగ్గట్టే మీ పిల్లల్ని ఓ మంచి స్కూల్లో చేర్పించండి.
ఎందుకండీ..
ఎవరో ర్యాంక్ సాధిస్తే మీ పిల్లల్ని వేధిస్తారు.?
ఇంకెవరికో సీటొస్తే మీవొళ్లను నిందిస్తారు.?
ఏమో..
మీ పిల్లల్లోనూ మంచి నైపుణ్యం ఉండొచ్చు.
సానబెట్టండిగానీ సంపకండి.
పోటీ పేరుతో ఉసిగొల్పి ఉసురు తీయకండి ప్లీజ్.!
- దిశ, ఫీచర్స్
ఎందుకు చెప్తున్నామో తెలుసు కదా.? ఈ మధ్య పిల్లల్ని చంపేయడం ఒక సాంప్రదాయంగా మారిపోతోంది తల్లిదండ్రులకు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అమ్మానాన్నే ఇలా కనికరం లేకుండా చంపేస్తే ఎలా.?
ద్వేషం వద్దు..
ఆ మధ్య చంద్ర కిషోర్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని చంపేసిన ఘటన తెలుసు కదా.? ఎంత ఘోరం.. ఎంత దుర్మార్గ.? పైగా అతడూ చనిపోయి సూసైడ్ నోట్ రాశాడు. సూసైడ్ నోట్ ఆధారంగా.. "జోషిల్.. నిఖిల్ ఎల్‌కేజీ.. ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. ఎంత చెప్పినా చదువుపై శ్రద్ధ చూపించడం లేదట. లక్షల రూపాయల ఫీజు కట్టి చదివిస్తే.. ఇట్లా చదువతరా.? ఈ అత్తెసరు చదువులతో ఏం రాణిస్తారు.. ఈ పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తారు" అని బాధపడి ఇద్దరినీ నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. చంద్ర కిషోర్‌లా చాలామంది భయపడి ముందే ఓ అంచనాకు వస్తారు. టెన్త్ క్లాస్.. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అంటే ఏమో అనుకోవచ్చు.? అంగన్వాడీలో ఆడుకునే వయసున్న పిల్లలపై మీ ప్రతాపమేంటి.? పైత్యమేంటి.? ఎల్కేజీ.. యూకేజీ పిల్లలుకూడా ర్యాంకులు సాధించాలంటే ఏం చెప్పాలి ఇగ.? అందుకే పిల్లలపై ప్రేముంటే జీవితకాలం నిలబెట్టుకోండి.. దాన్ని ద్వేషంగా మార్చి మధ్యలో తుంచేయకండి.
ఫీజుల భారం..
చదువు కూడా ప్రెస్టేజ్ ఇష్యూ అయింది ఈ రోజుల్లో. చంద్ర కిషోర్ విషయంలో ఇదే జరిగింది. రూ.లక్షన్నర ఫీజు చెల్లించి ఓ పెద్ద స్కూల్లో చేర్పించాడట. ఒక్కరికి లక్షన్నర అంటే ఇద్దరికి కలిపితే మూడు లక్షలు అవుతుంది. మీదికెల్లి ఆ ఫీజు.. ఈ ఫీజు అని ఇంకో యాబైవేలదాక అవుతుంది. "ఇంత భారం అవుతున్నా పెద్ద స్కూల్లో వేస్తే ఏం చదువుతలేరు" అని కోపమొచ్చి రూ.50వేల ఫీజున్న స్కూలు మార్చిండట. "పిల్లలు చెప్తే వినకపోవడంతో చిన్న స్కూల్లో వేసిన.. నా పరువు పోవట్టె. ఇట్లయితే ఫ్యూచర్ల వీళ్లేం బతుకుతరు" అని మనసు నొచ్చుకున్నడట. ఒకదశలో భయానికి.. అభద్రత భావానికి గురయ్యాడు. పిల్లల భవిష్యత్‌ను శిశు దశలోనే అంచనా వేయగలుగతామా.? ఆ తప్పు చంద్ర కిషోర్ చేసి పాపం.. తన పిల్లల్ని తానే హతమార్చాడు.
ప్రెస్టేజ్ ఇష్యూ..
"పోటీ ప్రపంచం"ను బద్నాం చేశాడు కానీ.. చంద్ర కిషోర్ కొంప ఫీజులే ముంచాయని తెలుస్తుంది. ఈరోజుల్లో చదువుకూడా ప్రెస్టేజ్ ఇష్యూ అయింది కదా.? దాన్ని గుర్తించలేకపోయాడతను. చాలామంది ఇలాగే ఉన్నారు. పక్కింటొళ్లను.. ఎదురింటొళ్లను చూసి "మన పిల్లల్ని కూడా కార్పొరేట్ స్కూల్లో వేద్దాం" అనుకుంటున్నారు. ఎవరో స్కూల్ మార్చారని వీళ్లు మారుస్తారు. ఇంకెవరో కోచింగ్‌కు పంపారని వీళ్లూ పంపిస్తారు. "మనం చదవలేక పోయాం. పిల్లల్నయినా మంచిగా చదివిద్దాం" అని స్వార్థం. అప్పు చేసయిన సరే కార్పొరేట్ స్కూల్లో వేయాలనే కసి. చిన్న పిల్లలు కదా.? స్కూలేదైనా చిన్న బుర్రకు ఎంత చదవాలో అంతే చదువుతారు. ఇది తెలియక "లక్షలు పెట్టినం.. అప్పులు చేసినం" అని చిరాకుపడి చిన్నపిల్లలపై ప్రతాపం చూపిస్తుంటారు.
ఖర్చుపై కంట్రోలేది.?
"పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువొక్కటే" అనేది ఈ మధ్య అందరూ అంటున్నమాట. నిజమే. చంద్ర కిషోర్ అన్నట్టు ఇదొక పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో బతకడమే కష్టమంటే ఇంకా ఆస్తులు కూడబెట్టడమా.? అందుకే పిల్లల మీద మంచి కేరింగ్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా చదువుల విషయంలో. నర్సరీ నుంచే ఏవేవో టాలెంట్ టెస్టులు పెడుతున్నారు. ఎంట్రెన్స్‌లు రాయిస్తున్నారు. స్థోమతకు మించి చదువుపై ఖర్చు చేస్తున్నారు. చంద్ర కిషోర్ బంధువులు చెప్పినట్టు ఆయనది సెంట్రల్ గవర్నమెంట్ జాబే అయుండొచ్చు.. మంచి జీతమే వస్తుండొచ్చు. కానీ ఎంత చెట్టుకు అంతే గాలి. జాబ్ చేసేవాళ్లయినా.. కూలీ చేసేవాళ్లయినా ఖర్చు విషయంలో నియంత్రణ ఉండాలి. లక్షల జీతముందిగా అని ఇరుగు పొరుగును ఫాలో అయితే ఎన్ని లక్షలు ఆగుతాయి.?
ప్రతీది పంచుకోండి
"భార్యాభర్తలు బాగుండేవారు" అని చంద్ర కిషోర్ బంధువులన్నారు. బాగుండటం అంటే నవ్వుతూ ఉండటం కాదు. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండొద్దు. హోలీ వేడుకులకు వెళ్లి భార్యను అక్కడే వదిలేసి తాను పిల్లల్ని తీసుకొని ఇంటికొచ్చాడు కిషోర్. అంటే తాను పడే మనో వేదనను భార్యతో పంచుకోలేదు. ఎవరు చెప్పారండీ భార్యాభర్తలు అన్ని విషయాలు షేర్ చేసుకోవద్దని.? వీళ్లిద్దరూ అలా చేసుంటే ఆ చిన్నారులిద్దరూ బతికేవాళ్లేమో.? భర్త మనసును.. ఆలోచనను భార్య మార్చుతుండెనేమో.? "పిల్లల్ని చదివించడమే మేమిచ్చే ఆస్తి" అనుకుంటున్నప్పుడు వాళ్ల విషయాల పట్ల ఇద్దరికీ బాధ్యతుండాలి.. ఇద్దరూ వాళ్ల విషయాలు చర్చించాలి. నాన్న భరోసా కల్పించాలి.. అమ్మ ప్రేమను పంచాలి. అప్పుడే మరో జోషిల్.. నిఖిల్ బలికారు.
లెక్కలేసుకోండి
అకడమిక్ ఇయర్ దాదాపు పూర్తయింది. ఇప్పటికే అడ్మిషన్లు షురూ అయ్యాయి. స్కూళ్ల విషయంలో కాస్త బాధ్యతగా ఆలోచించండి. మీకొస్తున్న ఆదాయం.. మీ పిల్లలకు సూటయ్యే స్కూల్లో మాత్రమే చేర్పించండి. గొప్పలకు పొయ్యి.. మీ అసమర్థత వల్ల పాపం.. పిల్లల జీవితాలను పాడుచేయకండి. పిల్లల గురించి కలలు కనండి తప్పులేదు. కానీ కన్ఫ్యూజ్ కావద్దు. "బ్రాండ్స్" వెంట పరుగులు తీయొద్దు. బతుకు ప్రయాణంలో అవొక భాగం మాత్రమే. పిల్లలకూ కలల్ని కనే అవకాశమిస్తే ఇంకా మంచిది. వారికో బాటను వేసినవాళ్లం అవుతాం. సక్సెస్ దారి చూపినవాళ్లమవుతాం. ఉత్తములుగా చూడాలనుకోవడంలో తప్పులేదు.. కానీ ఉరేసి చంపేంత కాఠిన్యమొద్దు.!!






