Parenting : భావోద్వేగాల బంధం.. పిల్లలే లోకంగా బతికేస్తున్న పేరెంట్స్..

by Javid Pasha |

Parenting : భావోద్వేగాల బంధం.. పిల్లలే లోకంగా బతికేస్తున్న పేరెంట్స్..

Parenting : భావోద్వేగాల బంధం.. పిల్లలే లోకంగా బతికేస్తున్న పేరెంట్స్..
X

దిశ, ఫీచర్స్ : అనుబంధాలు ఎలా పెనవేసుకుంటాయో కానీ.. అందులో ఆత్మీయత, అనురాగం, భావోద్వేగాలు అధికమే. ఆధునిక కాలంలో బంధాలు చెదురుతున్నాయనే మాటలు మనం తరచూ వింటుంటాం.. అయితే అందరి విషయంలోనూ అలాగే ఉండదని, అలాంటి వారిని పక్కన పెడితే అత్యధిక మందిలో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చెక్కు చెదరని బంధాలెన్నో.. అంటున్నారు హ్యూమన్ రిలేషన్స్ పరిశీలకులు. అలాంటి అందమైన బంధమే పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఉండే సంబంధం అంటున్నారు.

ఎనలేనిది.. కొనలేనిది..

పిల్లలపై అమ్మా నాన్నల మమకారం గొప్పదు. అది మంచుకన్నా చల్లైననది. తీనెకన్నా తీయనైనది. అందుకే అంటారు. తల్లిదండ్రల లాలనలోని వాత్సల్యమెంతో గొప్పదని. బుడి బుడి నడకల తప్పటడుగులు దాటి.. పెరిగి పెద్దయ్యి, ఉద్యోగం చేసే వరకు పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మనం ఎదగలేం. వారు బతికున్నంత వరకూ ఏదో ఒక రూపంలో పిల్లలకు సహాయపడుతూనే ఉంటారు. బాధల్లో, భావోద్వేగాల్లో అండగా ఉంటారు. సందర్భం ఏదైనా, సవాళ్లు ఎదురైనా, సమస్యలు వెంటాడుతున్నా అమ్మా నాన్నా.. చెప్పే ప్రతీ మాటలో పిల్లలపై మమకారమే స్ఫురిస్తుంది. వారు తీసుకునే ప్రతీ నిర్ణయంలో పిల్లల భవిష్యత్తే దర్శనమిస్తుంది. వారి ఆనందంలో, ఆవేదనలో, బాధలో, భావోద్వేగంలో పిల్లలపై ఉన్న ప్రేమానురాగాలే పెనవేసుకొని ఉంటాయి. అందుకే తల్లిదండ్రుల ప్రేమ ఎనలేనిది, కొనలేనిది. ఎల్లలు లేనిది అంటారు పెద్దలు, నిపుణులు.

బాల్యం నుంచి బాధ్యతల దాకా

పేరెంటింగ్ అంటే అంత ఈజీ కాదు. ఒక విధంగా సంక్లిష్టమైనది. మరో విధంగా సంతోషాలకు నెలవైనది. తమ పిల్లల మొహాల్లో ఆనందం చూసేందుకు తల్లిదండ్రులు తమలోని బాధలను మర్చిపోతుంటారు. తమకు కష్టాలొచ్చినా పర్లేదు కానీ పిల్లలు అందులో చిక్కుకో వద్దని భావిస్తుంటారు. అందుకోసం వారు చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. వారికి తమ పిల్లలు బాగుండాలనే స్వార్థం తప్ప మరో స్వార్థం ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచం గురించిన అనేక విషయాలు తెలిసినా తెలియకపోయినా పిల్లలే ప్రపంచంగా బతుకుతుంటారు పేరెంట్స్. పిల్లలు చదువుకునే దశలో వారు ఇంటికి చేరుకోగానే టీచర్ల అవతారమెత్తుతారు తల్లిదండ్రులు. అలసి పోయినప్పుడు ముద్దు ముద్దు మాటలతో ఉపశమనం కలిగిస్తారు. పిల్లలు మనోవేదనకు గురైతే.. మనసును ఓదార్చే కౌన్సెలర్ల పాత్ర పోషిస్తారు. పిల్లలకు అనారోగ్యం చేసినప్పుడు కంటికి రెప్పలా కాపాడే డాక్టర్లవుతారు. ఇలా.. సందర్భానుసారంగా మాటలద్వారా, చేతల ద్వారా పేరెంట్స్ ఇచ్చే సపోర్టుతో పిల్లల్లో వెయ్యేనుగుల బలం వస్తుంది. ఏ మానసిక నిపుణుల, మేధావుల అంచనాలకూ అందని ఆత్మ స్థయిర్యం, ధైర్యం ఇచ్చేది కేవలం పేరెంట్ష్ మాత్రమే.

పేరెంట్స్‌‌కూ కావాలి సపోర్ట్

తల్లిదండ్రుల్లో పిల్లలపై స్వార్థం, పిల్లలకు మేలు చేసే విషయంలో నిస్వార్థం, త్యాగం, ప్రేమ అన్నీ కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పేరెంటింగ్, పిల్లలు, కుటుంబం ఒకే వేరుతో ఎదిగిన చెట్టు, చెట్టు కొమ్మల్లా అల్లుకుపోయిన మానవ సంబంధాల అనుబంధాల కలయిక. అయితే తమ పిల్లలకోసం ఎంతగానో ఆలోచిసస్తున్న పేరెంట్స్‌కు పిల్లలు కూడా తాము సపోర్టుగా ఉండాల్సిన అవసరం ఉందంటుననారు నిపుణులు. పేరెంట్స్ ఏదో ఒక దశలో పిల్లల నుంచి సపోర్టు పొందే సందర్భాలూ వస్తుంటాయి. వారు అడగకపోవచ్చు కానీ అర్థం చేసుకొని ఇవ్వగలగాలి.

పిల్లలు ఏం చేయాలి?

ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కష్టపెట్టే సపోర్టును ఆశించరు. ఎప్పుడూ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. అందుకే చేతనైనన్ని రోజులు పిల్లలకోసం కష్టపడిన తల్లి దండ్రులను పెద్దయ్యాక ఆదరించాలి. ప్రేమను పంచాలి. పిల్లలు సెటిలయ్యేందుకు కారణమైన పేరెంట్స్‌ను తాము సెటిలయ్యాక కూడా పిల్లలు పట్టించుకోకపోతే అంతకంటే ఘోరం మరొకటి ఉండదంటున్నారు హ్యూమన్ రిలేషన్స్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్లు. పిల్లలకోసం ఎంతో ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో వారు ఎన్నడూ ఫలితాన్ని ఆశించరు. కేవలం ప్రేమ.. ప్రేమతో నిండిన పలకరింపులే వారికి గొప్ప ఓదార్పునిస్తాయి. మంచి పిల్లలుగా మీ పేరెంట్స్‌కు మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ముందుగా వారిని అర్థం చేసుకోండి. ప్రేమతో ఉండండి. వారి అవసరాలు తీర్చండి. సేవ చేయండి. ముఖ్యంగా వృద్ధాప్యంలో మరింత అండగా నిలువడమే అన్నింటికంటే గొప్ప విషయం అంటున్నారు నిపుణులు.

Next Story