పల్నాడు to మంగోలియా.. 12 దేశాల్లో బైక్ రైడింగ్ చేస్తున్న తెలుగోడు.!

by Daayi Srishailam |

వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపాడు.

పల్నాడు to మంగోలియా.. 12 దేశాల్లో బైక్ రైడింగ్ చేస్తున్న తెలుగోడు.!
X

దిశ, ఫీచర్స్: బైక్ రైడింగ్.. కొందరికి ప్యాషన్. కొందరికి గోల్. కానీ.. ఒక యువకుడికి మాత్రం సామాజిక మార్పు కోసం. 12 దేశాలు బైక్‌పై తిరిగాడు. వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపాడు. ఒకే ఒక్కడు ఇంత మార్పు తీసుకొచ్చినప్పుడు.. మనం ఉత్తగనే కూర్చుందామా.?

అతడి పేరు జోషువా డానియల్ పుట్టి. మన తెలుగోడే. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడులోని బండలమొట్టు గ్రామస్తుడు. "రైడర్ జోష్"గా పిలవబడే ఒక సాధారణ యువకుడు తన మోటార్ బైక్‌తో 12 దేశాలు తిరిగి, వేలాదిమందికి శస్త్ర చికిత్సలకు నిధులు సమకూర్చడం, చెట్లు నాటడం, అట్టడుగు సమాజాలకు సాయం చేయడం వంటి పనులతో సమాజంలో సామాజిక మార్పు తీసుకొచ్చాడు.

ఇంటి నుంచి పారిపోయి

జోషువాకు అప్పుడు పద్నాలుగేళ్ల వయసు. పదో తరగతి తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. మామూలుగా సినిమాల్లో ఇలా చేసి హీరోలవుతారు. కానీ ఇక్కడ జోషువా పరిస్థితి తలకిందులైపోయింది. విజయవాడ, హైదరాబాద్ ఎక్కడెక్కడో తిరిగి ఇంటి మొకాన పోలేదు. గత్యంతరం లేక రైల్వే స్టేషన్లలో పడుకోవడం, చెత్త డబ్బాల్లో ఆహారం వెతకడం వంటి కష్టాలెన్నో చూశాడు. ఇవన్నీ కష్టాలు చూసి అటు తిరిగీ ఇటు తిరిగీ ఆఖరికి ఇల్లు చేరుకున్నాడు. కాలేజీ చేసిన తర్వాత విశాఖపట్నంలోని ఎన్జీవోల వద్ద శిక్షణ తీసుకున్నాడు. అక్కడ నేర్చుకున్న జ్ఞానం అతడిన సేవా మార్గంలో నడిపించింది.

ఉగాండా మార్చేసింది

2013లో జోషువా బైక్ మీద ప్రపంచయాత్రకు శ్రీకారం చుట్టాడు. ఉగాండాలో ఉన్నప్పుడు అక్కడి చిన్నారుల పరిస్థితి చూసి కలత చెందాడు. పోషకాహార లోపంతో చాలామంది పిల్లలు నడవలేని స్థితిలో ఉన్నారు. యూనిసెఫ్ నివేదిక ప్రకారం 2013-2015 మధ్య ఉగాండాలో 5 లక్షల మంది చిన్నారులు మరణించారు. వీరిలో దాదాపు సగం మంది పోషకాహార లోపం వల్లే. ఈ అనుభవం అతడి జీవిత లక్ష్యాన్ని మార్చేసింది. అట్టడుగు సమాజాలకు సాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానికి తన రైడింగ్ ప్రయాణాన్నే మార్గంగా ఎంచుకున్నాడు.

బ్రూనై దాటిన ఇండియన్

జోషువా బైక్ రైడింగ్‌కు సరిహద్దుల్లేవు. అతడు ఎక్కడైనా ఆగితే అలసిపోయి ఆగినట్టు కాదు, ఆ ప్రాంత పేద ప్రజల సమస్యలు తెలుసుకొని వారి కష్టాల్లో పాలుపంచుకుంటాడు. ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలు తిరగడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు జోషువా. ఆయన కిట్ బ్యాగ్‌లో తనకు సంబంధించిన వస్తువుల కంటే పేదలకు అవసరమయ్యే ఆహారం, దుప్పట్లు, రెయిన్ కోట్స్, బట్టలు ఉంటాయి. ఇప్పుడు బ్రూనై, రష్యా, చైనా, మంగోలియా, యూరప్‌లలో తన రైడింగ్‌ను కొనసాగిస్తున్నాడు. బ్రూనై దాటిన మొదటి భారతీయ మోటార్ సైకిల్ రైడర్‌గా రికార్డు సృష్టించాడు.

80 శాతం ఫౌండేషన్‌కే

2020లో "రైడర్ జోష్ ఫౌండేషన్"ను స్థాపించాడు జోషువా. దాని ద్వారా కోవిడ్ సమయంలో రోజూ 1500 మందికి ఆహారం పంచేవాడు. సింగపూర్‌లో క్యాన్సర్ బారినపడిన పిల్లల కోసం $50,000 సేకరించాడు. గ్రామీణ మహిళలకు రుతుక్రమ స్వచ్ఛత కిట్లు అందించాడు. మహిళలకు కుట్లు, కొవ్వత్తలు తయారీ, బ్యూటీషియన్ కోర్సులు, హస్తకళల శిక్షణ వంటి స్వయం ఉపాధికి సాయం చేస్తున్నాడు. ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్, చేపల పెంపకం వ్యాపారం నుంచి వచ్చిన డబ్బులను ఇలా సొసైటీ కోసం ఖర్చు చేస్తున్నాడు. తన ఆదాయంలో 80 శాతం ఫౌండేషన్ కార్యక్రమాలకే పెడుతున్నాడు.

ఆపదలో అభయం

ఏపీలోని వినుకొండలో సంకల్పన అనే 7 ఏళ్ల బాలిక గుండెలో మూడు రంధ్రాల సమస్యతో బాధపడుతుంటే తెలుసుకున్నాడు. ఆ అమ్మాయి ముగ్గురు తోబుట్టువులు ఆ వ్యాధితోనే మరణించారు. శస్త్ర చికిత్స కోసం రూ.4 లక్షలు ఇచ్చి ఆ పాపను రక్షించాడు. 13 ఏళ్ల రూత్ అనే బాలిక సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతుంటే వాళ్ల నాన్న ఆమెను వికలాంగుడైన వ్యక్తితో వివాహం చేసేందుకు ప్రయత్నిస్తే కాపాడిన జోషువా ఆ అమ్మాయికి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించాడు. ఏపీలోని బందరుగూడెంలో కోయ గిరిజనులకు ఆహారం, ఔషధాల కోసం స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాడు.

Next Story